Sunday, April 28, 2024

వుహాన్ ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కొవిడ్ 19 మూలాలు ఉన్నాయని అనుమానించడానికి బలమైన ఆధారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. 2017 లో వుహాన్ ల్యాబ్ ప్రారంభసమయంలో చిత్రీకరించిన వీడియోను స్కైన్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ వీడియోను ఆనాడు చిత్రీకరించింది. ఈ ల్యాబ్ లోని బోన్లలో గబ్బిలాలను శాస్త్రవేత్తలు పెంచుతున్నట్టు , వాటికి పురుగులను ఆహారంగా పెడుతున్నట్టు ఆ వీడియోలో దృశ్యాలు కనిపిస్తున్నాయి. పది నిమిషాల నిడివి గల ఈ వీడియోకు ‘వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ …పీ4 ల్యాబ్ నిర్మాణం, పరిశోధనలు’ అని పేరు పెట్టారు. ఈ వీడియోలో ఒక అధికారి మాట్లాడుతున్న దృశ్యం కూడా ఉంది. పీ 4 ల్యాబ్‌లో పరిశోధనలు జరిగే సమయంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే తక్షణం స్పందించే భద్రతా వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్పడం గమనార్హం. ల్యాబ్‌లో జరిగే పరిశోధనలను చిత్రీకరించడానికి వీలుగా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మొక్కుబడి నివేదిక
వుహాన్ ల్యాబ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సందర్శించినా మొక్కుబడిగా నివేదిక సమర్పించినట్టు స్పష్టమౌతోంది. ల్యాబ్‌లో గబ్బిలాలు పెంచుతున్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ల్యాబ్ లోని యానిమల్ రూమ్‌లో వివిధ జంతువులు చక్కగా ఉండవచ్చని, సార్స్ కొవ్ 2 వంటి వైరస్‌పై పనిచేయవచ్చని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం లోని పీటర్ డెస్టాక్ డిసెంబర్‌లో చేసిన ట్వీట్‌లో వుహాన్ ల్యాబ్‌కు గబ్బిలాలను తీసుకురాలేదని, గబ్బిలాల శరీరం నుంచి వైరస్ నమూనాలు సేకరించిన తరువాత ప్రకృతి లోకి గబ్బిలాలను విడిచిపెట్టామని పేర్కొన్నారు. కానీ ఆయన చెప్పినదానికి వీడియో లో దృశ్యాలకు ఎక్కడా పొంతన కుదర లేదు. వీడియోలో బోన్లలో పెట్టిన గబ్బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ల్యాబ్‌ల్లో గబ్బిలాలను పెంచరని, కుట్రతో ప్రచారం చేస్తున్నారని కూడా మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. డిజిటల్ ఆర్కైవిస్ట్ జెస్సీ ఈ వీడియో క్లిప్‌ను సంపాదించారు. వాట్ రియల్లీ హ్యాపెన్డ్ ఇన్ వుహాన్ అనే పుస్తకాన్ని రాయడానికి ఈ వీడియో క్లిప్పింగ్‌ను ఆయన ఉపయోగించుకున్నారు.

అయితే ఈ వీడియోపై ఇప్పటివరకు పీటర్ డెస్టాక్ స్పందించలేదు. న్యూయార్క్ లోని ది ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ అధ్యక్షుడు వైరాలజిస్టు పీటర్ డెస్టాక్ ఈ ల్యాబ్‌కు నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధుల తోనే వుహాన్ ల్యాబ్‌లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సార్స్ కొవి 2 వైరస్ వుహాన్‌లో వ్యాపించడానికి ముందే ల్యాబ్‌లో అనేక మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కరోనా లేదా సాధారణ ప్లూ, జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. అమెరికా ఇంటెలిజెన్స్ వద్దకు ఈ వివరాల సమాచారం చేరింది. దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ లో కథనం వెలువడింది. అయితే వుహాన్ ల్యాబ్ మాత్రం ఈ పరిశోధనలకు సంబంధించిన రికార్డులను ఎవరికీ ఇవ్వడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం చైనాలో 76,000 కొవిడ్ కేసుల్లో 92 మంది అక్టోబర్ డిసెంబర్ మధ్యలో అస్వస్థతకు గురైనట్టు గుర్తించ గలిగింది. ఆ డేటాను ఇవ్వడానికి చైనా ఒప్పుకోలేదు. వుహాన్ లోని బ్లడ్‌బ్యాంక్‌లో 2019 డిసెంబర్ కంటే ముందటి నమూనాలను పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పగా దానికి చైనా తిరస్కరించడం గమనార్హం.

Video footage prove bats were kept in Wuhan Lab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News