Friday, April 19, 2024

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసిపి ఎంపి అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా పేర్కొంది. వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసిన సమయంలో ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఎ8 అని సిబిఐ పేర్కొంది. గతంలో అవినాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని పేర్కొంది.

అవినాష్, భాస్కర్‌రెడి్డ్లు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ప్రలోభపెట్టినట్టుగా కూడా పేర్కొంది. వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈ కేసులో సిబిఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్క డా కూడా నిందితుడిగా చెప్పలేదు. కానీ, ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో మాత్రం ఎ8గా సిబిఐ ప్రస్తావించింది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఇక, వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది.

బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందన్న సిబిఐ
కాగా, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారని, ఆయన బయట ఉంటే పులివెందుల సాక్షులు ప్రభావితమైనట్లేనని కౌంటర్ లో సిబిఐ స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విచారణకు సహకరిస్తున్నామని భాస్కర్ రెడ్డి చెబుతున్నారని, కానీ అదంతా అబద్దమన్నారు. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నారని అంతకు ముందే గంగిరెడ్డి, శివంకర్ రెడ్డి , అవినాష్ రెడ్డి మాట్లాడుకున్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారన్నారు. కేసు పెట్టవద్దని వివేకా మృతదేహానికి పోస్టుమార్టం వద్దని సిఐ శంకరయ్యకు అవినాష్ , శివశంకర్ రెడ్డి చెప్పారన్నారు. సిబిఐ, కోర్టుకు ఏమీ చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సిబిఐ పేర్కొంది. వివేకా హత్య కేసులో భారీ కుట్ర ఉందని దానిపై దర్యాప్తు చేస్తున్నామని సిబిఐ వెల్లడించింది.

కౌంటర్‌లో మరోసారి సిఎం జగన్ ప్రస్తావన
హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. దాఖలు చేసిన కౌంటర్ లో సిబిఐ సిఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని బయట ప్రపంచానికి తెలియక ముందే సిఎం జగన్‌కు తెలుసని కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా సిబిఐ కోర్టులోనూ చెప్పింది. దీంతో మరోసారి జగన్ ప్రస్తావనను సిబిఐ తెచ్చినట్లయింది.

అనారోగ్యం కారణంగా బెయిలివ్వాలని భాస్కర్ రెడ్డి వాదనలు
భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును న్యాయవాది ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని సిబిఐ అధికారులు ఆరెస్ట్ చేశారని న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు అన్నారు. ఆరోపణలు మాత్రమే సిబిఐ పరిగణలోకి తీసుకుందని, భాస్కర్‌రెడ్డి సమాజంలో పలుకబడి ఉన్న వ్యక్తి అని, ఒక సీనియర్ సిటిజన్‌ను అక్రమ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి భాస్కర్‌రెడ్డి అని, ఆయన నేరం చేశారనడానికి ఎక్కడా సరైన సాక్ష్యాలు లేవన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రస్థావించలేదన్నారు.

లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని సునీత లాయర్‌కు కోర్టు ఆదేశం
ఈ కేసు విషయంలో ఇంప్లీడ్ అయ్యేందుకు గతంలో వైఎస్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను 9వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News