Tuesday, April 30, 2024

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

- Advertisement -
- Advertisement -
Who is the Congress candidate for Huzurabad
సెప్టెంబర్ 30న క్లారిటీ.. అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం…

హైదరాబాద్:  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ఇంతవరకు నిర్ణయించలేదు. అక్టోబర్ 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణికం ఠాగూర్ హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో దిగారు. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటిమి పాలైన పాడి కౌశిక్‌రెడ్డి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొత్త అభ్యర్థి అన్వేషణలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. సురేఖతో పాటు కృష్ణారెడ్డి పేర్లు కూడా ఆ పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత అభ్యర్తి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల సమయంలో వచ్చిన ఓట్లను నిలబెట్టుకోవడంతో పాటు క్యాడర్‌లో మనోధైర్యం నింపే అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

దామోదర రాజనర్సింహా స్పందన
19 మంది దరఖాస్తు.. తుది జాబితాలో నలుగురు…

ఈ అంశంపై టిపిసిసి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటివరకూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారని రాజనర్సింహా వెల్లడించారు. దీనిపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి టిపిసిసికి నివేదిక అందించినట్లు ఆయన తెలిపారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చామని ఆయన వివరించారు. ఈ నెల 30న భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ సభ ఉందని, ఆ సభ అనంతరం హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తామని వివరించారు.

స్థానిక, స్థానికేతర సమస్యని అధిగమించేదెలా?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో టిఆర్‌ఎస్, బిజెపిని ఫాలో కావాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ను కోరారు. ఈటల రాజేందర్‌తో తలపడేందుకు టిఆర్‌ఎస్ కూడా స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ కోసం స్థానికులు కాకుండా స్థానికేతరులను బరిలోకి దింపితే ఇబ్బందులు వస్తాయని ఠాగూర్‌కు కొందరు నేతలు సూచించారు. ఇక టిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితబంధుకు చెక్ చెప్పేలా హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థిని ఎంపిక చేయాలని కొందరు కోరారు.

దీంతో ఆ దిశగా ఆలోచించాలని మాణికం ఠాగూర్ నేతలకు సూచించారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో దళిత అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం దక్కనుంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన విధంగా ఫలితాలు సాధించాలంటే కొండా సురేఖ వంటి వారే ఉండాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి ఈ విషయంలో అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించాలని యోచిస్తున్నారు. మరి.. చివరి నిమిషంలో కాంగ్రెస్ ప్లాన్ మారుతుందా? లేక రేవంత్‌రెడ్డి అనుకున్నట్లుగా జరుగుతుందా? అనేది వేచి చూడాలి..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News