Tuesday, April 30, 2024

మత్స్యకారుల మధ్య వైరుధ్యాలు ఎందుకు?

- Advertisement -
- Advertisement -

Why conflicts between fishermen

మిషన్ కాకతీయ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మా ణం ఫలితంగా రాష్ర్టంలో నీటివనరుల సౌల భ్యం పెరిగిన పర్యవసానంగా మత్స్యరంగం అభివృద్ధికి, త ద్వారా ఈ రంగం లో అపారమైన ఉపాధి కల్పనకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ రంగం మీద ఆధారపడిన పలు మత్స్యకార కులాల మధ్యన ఇటీవలి కాలంలో అకారణంగా పొడసూపుతున్న అనవసరపు వైరుధ్యాలు ఈ రంగం సర్వతోముఖాభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో చేస్తున్న ఇతోధిక ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. రాష్ర్టంలో మత్స్యరంగం మీద ప్రధానంగా ఆధారపడిన ముదిరాజ్, గంగపుత్రులతో పాటు వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపకులాలకు సంబంధించిన సుమారు 50 లక్షల జనాభాలో లక్షలాది మం ది యువతరం భవిష్యత్తు మీద ఈ వైరుధ్యాల పర్యవసానాలు ప్రభావం చూపనున్నాయి. ఈ విపరిణామాలు ఇదే పద్ధతిలో మరికొంతకాలం కొనసాగితే తెలంగాణ మత్స్య పారిశ్రామిక రంగంలో ప్రధానమైన ఈ రెండు మత్స్యకార వృత్తి కులాలు తరతరాలుగా తాము అనుభవిస్తున్న ఆధిపత్యాలను వదులుకోవాల్సిన అనివార్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు కనిపించడం లేదు!

గతంలో ఏ ముఖ్యమంత్రి కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిండు శాసనసభ వేదిక మీద నుండి తెలంగాణ రాష్ర్ట మత్స్యరంగం భవిష్యత్తు మీద తన ప్రభుత్వానికున్న ఆలోచనలను, తాము అమలులోకి తీసుకురానున్న ప్రణాళికలను, రాష్ర్టంలో మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్యపరిశ్రమ అభివృద్ధికి తీసుకోబోయే చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సుమారు గంటన్నరపాటు సోదాహరణంగా వివరించారు. తెలంగాణ మత్స్యరంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పైన ప్రస్తావించిన ప్రధానమైన రెండు మత్స్యకార కులాల మధ్యన నెలకొని ఉన్న వైరుధ్యాలను వదులుకుని, సంఘటితంగా, ఐకమత్యంతో ప్రభుత్వ ప్రయత్నాలకు సంపూర్ణ సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ వేదిక నుండి విన్నవించారు. జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ రెండు కులాల వారికే మత్స్య సహకార సంఘాలలో ప్రతి ఒక్కరికీ సమానావకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ర్టంలో అప్పటి రెండున్నర లక్షల టన్నుల వార్షిక చేపల ఉత్పత్తిని భవిష్యత్తులో పదకొండు లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరుకునే విధంగా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేదికగా స్వయంగా ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగానే ఈ రాష్ర్ట ప్రభుత్వం గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ర్టంలో మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన అనేక చర్యలను చేపట్టి అమలు పరుస్తున్నది. రాష్ర్టంలో మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలోకి తీసుకుపోవడానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రణాళికను, విధి విధానాలను రూపకల్పన చేసేందుకుగాను తొమ్మిది మంది మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం సూచనల ప్రకారం రాష్ర ్ట ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రధానంగా రాష్ర్టంలో పెరిగిన నీటివనరుల సౌలభ్యాన్ని పూర్తిస్థాయిలో చేపల పెంపకానికి ఉపయోగించుకుని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా రాష్ర్టంలోని మత్స్యకారుల్లో ఆర్థిక స్వావలంబనను సాధించేందుకుగాను సుమారు వెయ్యి కోట్ల రూపాయల భారీ నిధులతో ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ పేరు మీద ఒక ప్రత్యేక పథకాన్ని అమలుపరిచింది.

ఈ మొత్తం వెయ్యి కోట్ల నిధులను కేవలం మత్స్య సహకార సంఘాల సభ్యులకు మాత్రమే అందేలా పకడ్బందీ చర్యలను తీసుకున్నది. రాష్ర్టంలో పెరిగిన నీటి వనరుల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మించిన రిజర్వాయర్లు, వాటి ద్వారా అందుబాటులోకి వచ్చిన చెరువులు, ఇతర చిన్న నీటి వనరులన్నింటినీ పూర్తి స్థాయిలో చేపల పెంపకానికి వినియోగించుకునే లక్ష్యంతో మత్స్య సహకార సంఘాల సభ్యత్వ నిబంధనలను సవరించింది. తద్వారా కొత్త సొసైటీల ఏర్పాటుకు, వాటిల్లో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు వెలుసుబాటును కల్పించింది. రాష్ర్టంలో ఎంపిక చేసిన చెరువుల్లో గడచిన ఐదు సంవత్సరాలుగా వరుసగా ప్రభుత్వమే తమ స్వంత ఖర్చులతో మత్స్య సహకార సంఘాల ద్వారా ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తున్నది.

తెలంగాణ రాష్ర్టంలో మత్స్యరంగంలో మీద ఆధారపడిన సాంప్రదాయ మత్స్యకార కులాలకు సంబంధించిన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ (నియమని బంధనలను అనుసరించి) మత్స్య సహకార సంఘాలలో సభ్యత్వం కల్పించేవిధంగా దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలనే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే మత్స్యకార కులాలకు సంబంధించిన ప్రధానమైన రెండు కులాలలో గంగపుత్ర కులం నుండి ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సవరించిన నిబంధనలను అనుసరించి మత్స్యసహకార సంఘాలలో కొత్త సభ్యత్వాలను చేర్చుకునే విషయంలో ఈ పరిణామాలు రాష్ర్టప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టి వేస్తున్నాయి.రాష్ర్టంలో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకున్న సుమా రు 4634 మత్స్యసహకార సంఘాలలో దాదాపు 70 శాతాని కి పైగా ముదిరాజుల నాయకత్వంలోనే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా రీత్యా కూడా గంగపుత్రుల కంటే ముదిరాజుల జనాభా అనేక రెట్లు అధికంగా ఉండటం వల్ల సహజంగానే మత్స్య సహకార సంఘాలలోనూ వారి సంఖ్య సింహభాగాన్ని కలిగి ఉన్నది.

18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ మత్స్య సహకార సంఘాలలో సభ్యత్వం కల్పించడం వల్ల ముదిరాజుల సంఖ్య మరింతగా పెరిగేందుకు అవకాశం కలుగుతుందని గంగపుత్రులు వ్యక్తం చేస్తున్న ఆందోళన వెనక ఇదే అసలు కారణంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో రాష్ర్ట ప్రభుత్వం మత్స్యసహకార సంఘాల సభ్యత్వాలకు సంబంధించిన నిబంధనలు సడలించిన సందర్భంలోనూ గంగపుత్రుల నుండి ఇట్లాంటి వ్యతిరేకతలే వ్యక్తమయ్యాయి. అయితే నిండు అసెంబ్లీలో రాష్ర్ట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తామంతా కట్టుబడి ఉన్నామని, కొత్తగా సభ్యత్వం ఇచ్చే సందర్భాలలో మొదటి అవకాశాలు గంగపుత్రులకు కల్పించిన తర్వాతనే తమకు ప్రాధాన్యత ఇచ్చినా తమకు అభ్యంతరాలు లేవని ముదిరాజ్ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. కానీ మత్స్య సహకార సంఘాలలో ముదిరాజులకు అసలే సభ్యత్వాలు ఇవ్వరాదనే గంగపుత్రుల మొండివాదన సహేతుకం కాదని ఈ నాయకులు అంటున్నారు. మత్స్యకార కులాలకు సంబంధించిన ఈ రెండు కులాల మధ్యన సామరస్య పూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇందులో ఒక వర్గం అనుసరిస్తున్న మొండివైఖరి కారణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని మత్స్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే సిఎం సూచన మేరకు ఈ రెండు కులాల నుండి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పది మంది చొప్పున నాయకులతో ఇటీవలనే రాష్ర్ట మత్స్యశాఖ ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ఇరువర్గాల మధ్యఐక్యత ను నెలకొల్పేందుకు అడ్డంకిగా మారిన ముఖ్యమైన అంశాలపై పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలను కనుక్కోవాలనే ప్రయత్నాలను ప్రారంభించారు.

ప్రపంచీకరణ, సరళీకరణ, యాంత్రీకరణల పర్యవసానంగా దేశ వ్యాప్తంగా కుల వృత్తులన్నీ నానాటికీ కుంచించుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఔదార్యం ఫలితంగా చేపల పెంపకం ఒక కులవృత్తిగా ఇంకా మనగలుగుతున్నదని, ఈ వృత్తిపైనే తరతరాలుగా వంశపారంపర్యంగా ఆధారపడి జీవిస్తున్న ప్రధానమైన ఈ రెండు సాంప్రదాయ మత్స్యకారకులాలు అనవసరపు వైరుధ్యాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకురావడం ఉభయులకూ శ్రేయస్కరం కాదని ఈ రెండు కులాలకు చెందిన స్వతంత్ర ఆలోచనాపరులు భావిస్తున్నారు. చేపల పెంపకం సరికొత్తపద్ధతిలో ‘అక్వారంగం’గా మారిపోయి, మత్స్యకార కులాలతో సంబంధంలేని అగ్రకుల భూస్వాములకు ఆదాయవనరుగా రూపాంతరం చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని పరిణామాలను గుణపాఠంగా స్వీకరించకపోతే తెలంగాణ మత్స్యరంగం అనివార్యంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి జారిపోయి, తెలంగాణలోని లక్షలాది మంది సాంప్రదాయ మత్స్యకారులు తమ ఉనికిని కోల్పేయే ప్రమాదం పొంచిఉందని వీరు హెచ్చరిస్తున్నారు!

పిట్టల రవీందర్
(‘తెలంగాణ ఫిషరీస్ సొసైటీ’ వ్యవస్థాపక అధ్యక్షులు)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News