Sunday, April 28, 2024

సహజ మేధను కృత్రిమ మేధ ఆక్రమిస్తుందా?

- Advertisement -
- Advertisement -

కళాకారులు, సంగీత విద్వాంసులు, రచయితలు తమ భావాలను, అసలు రచనలను కాపాడుకోవడానికి కాపీరైట్స్ అనేవి కీలకాంశాలుగా ఉంటున్నాయి. కాపీరైట్ అనేది సాహిత్యం, సంగీతం, సినిమాటోగ్రఫీ, కళాఖండాలు లాంటి వాటికి రక్షణ కల్పించే ఒక మేధో సంపత్తి హక్కు. గ్రంథాలు, సంగీతం, పెయింటింగ్స్, శిల్పం, సినిమాలు మొదలైన వాటితో పాటుగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు, డేటాబేస్‌లు, ప్రకటనలు, టెక్నికల్ డ్రాయింగ్స్ లాంటివి కాపీరైట్ పరిధిలోకి వస్తాయి. అయితే కృత్రిమ మేధ (ఎఐ) ఆగమనంతో కాపీరైట్ చట్టం కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం ఏదయినా ఒక వస్తువు కాపీరైట్ రక్షణకు అర్హత పొందాలంటే అది అసలైనది, సృజనాత్మకమైనది అయి ఉండాలి. ఒక వస్తువుకు కాపీరైట్ రక్షణ లభ్యతను పరిశీలించాలంటే వాస్తవికత అనేది ప్రధాన అంశంగా ఉండాలి. అయితే కృత్రిమ మేధ రూపాలు అనేవి 1957 నాటి ఇండియన్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 2(డి) (వి) ప్రకారం ఒక వ్యక్తి చేత అనువైన రూపంలోకి సృష్టించబడే వర్క్ నుంచి వచ్చే లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్‌ఎల్‌ఎం). ఇండియన్ కాపీరైట్ చట్టం చాట్ జిపిటి లాంటి ఎఐ టూల్స్‌నుంచి సృష్టించబడే కంటెంట్‌కు యజమానిగా, ఒక రచయితగా కృత్రిమ మేధను స్పష్టంగా గుర్తించలేదు. ఈ చర్యలో ఉండే వ్యక్తిని కోర్టులు, చట్టాలు సహజమైన వ్యక్తిగా మాత్రమే గుర్తించాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాపీరైట్ వర్క్‌ను వ్యక్తులకోసం మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు. కృత్రిమ మేధ వ్యవస్థలను ఈ వర్క్‌ల సృష్టికర్తలుగా గుర్తించడం లేదు. ఎందుకంటే కృత్రిమ మేధ వ్యవస్థ ఒక వర్క్‌ను అసలైన వర్క్‌లాగా సృష్టించవచ్చునేమో కానీ ఇప్పుడున్న కాపీరైట్ చట్టాలు మానవ సృష్టికర్తల నుంచి రాని వర్క్‌లకు కాపీరైట్ రక్షణను స్పష్టంగా ఇవ్వడం లేదు. లాభదాయకమైన కృత్రిమ మేధ వర్క్‌లను తయారు చేయడానికి తమ కాపీరైట్ వర్క్‌లను చట్ట విరుద్ధంగా కంపెనీ ఉపయోగించుకుంటోందని రచయితలు నికోలస్ బస్బేన్స్, నికోలస్ గేజ్‌లు ఇటీవల దాఖలు చేసిన కేసు కృత్రిమ మేధ వర్క్‌లు, దాని యాజమాన్య హక్కులపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. అంతేకాకుండా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల దాఖలు చేసిన కేసు సంప్రదాయ జర్నలిజం, ఎఐకు చెందిన యాజమాన్య హక్కులు, కాపీరైట్‌లకు సంబంధించి తేనెతుట్టెను కదిపినట్లయింది.

తమ చాట్ బోట్‌లో శిక్షణ ఇచ్చేందుకు, ఎఐ ఆధారిత సొల్యూషన్స్ ఇవ్వడం కోసం ఓపెన్ ఎఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ సంస్థకు చెందిన పలు ప్రచురణలను అనుమతి లేకుండా, ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఉపయోగించుకుంటున్నాయనేది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆరోపణ. అయితే చాట్‌బోట్‌లో శిక్షణ ఇవ్వడం కోసం ఏ విషయాన్ని ఎంత మేర ఉపయోగించుకుంటున్నారు, అలాగే దాని నుంచి వచ్చే ఫలితం ఒకే మాదిరిగా ఉందా లేక అంతకన్నా మెరుగ్గా ఉందా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే లక్షల సంఖ్యలో సోషల్ మీడియా సమాచారం వ్యాఖ్యలు, బ్లాగ్ పోస్టులు, వికిపిడియా వ్యాసాలు, కుటుంబ వంటకాలను సంబంధిత వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోకుండా ఉపయోగించి ఓపెన్ ఎఐ ఇచ్చే చాట్ జిపిటి శిక్షణపైనా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

విషయం, కాపీరూట్‌కు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న మరో ఆసక్తికర పరిణామమొకదాన్ని పరిశీలిస్తాం. ప్రపంచ ప్రఖ్యాత కార్టూన్ క్యారెక్టర్లలో ఒకటి, వాల్ట్ డిస్నీకి చెందిన అత్యంత మనోహరమైన మిక్కీమౌస్‌కు చెందిన ప్రారంభ వెర్షన్ ప్రజలకు అందుబాటులోకి రావడం. 1928లో తొలిసారి ఒక చిన్న స్టీమ్‌బోట్ విల్లీలో కనిపించిన ఈ చిత్రం కాపీరైట్ గడువు 2024 జనవరిలో ముగియడంతో దాన్ని ఇప్పుడు ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండానే ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. చాలా సంవత్సరాలుగా కనిపిస్తున్న కొత్త మిక్కీకి మాత్రం ఇప్పటికీ కాపీరైట్ రక్షణ ఉంది. మిక్కీ మౌస్‌కు సంబంధించిన పాత్రలపై వాల్ట్‌డిస్నీ సంస్థకు జీవిత కాలపు యాజమాన్య హక్కులు ఉన్నాయి.

మిక్కీకి సంబంధించి ఆ తర్వాత వచ్చిన అన్ని మార్పులు, దానికి సంబంధించిన నమోదిత ట్రేడ్ మార్కులపై వాల్ట్ డిస్నీ కాపీరైట్ హక్కులను కలిగి ఉండడంతో చాలా మంది పోటీదారులు, ఔత్సాహిక కళాకారులు ఎవరు కూడా దాన్ని సవాలు చేయడానికి సిద్ధపడడం లేదు. చివరగా, సృష్టించిన కంటెంట్‌కు సంబంధించిన యాజమాన్య హక్కులను ప్రాథమికంగా సంబంధిత ప్లాట్‌ఫామ్ కలిగి ఉన్నప్పటికీ, కాపీరైట్ యాజమాన్య హక్కును మాత్రం విషయాన్ని సృష్టించడానికి ఎవరైతే తోడ్పడ్డారో వారికి బదిలీ చేయబడుతుందని చాట్ జిపిటి, ఇతర ఎఐ ప్లాట్ ఫామ్‌లు, నిబంధనలు, షరతులు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల మనిషి లేదా మిషన్ ఎవరు సృష్టించినప్పటికీ ‘విషయం (కంటెంట్) అనేది రాజు అయితే కాపీరైట్ అనేది ఎప్పటికీ రాజ్యంగానే ఉంటుంది’ అని నేను స్పష్టం చేయదలచుకున్నాను.

శుభజిత్ సాహా
(హెడ్ లీగల్ అండ్ ఐపిఆర్, రిసల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News