Tuesday, April 30, 2024

‘మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది’: ఉద్ధవ్ థాకరే

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర పరువు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విమర్శించారు. రాజకీయంగా, కరోనా వైరస్ నివారణ పరంగా తీవ్రస్థాయిలో దాడికి గురవుతున్న సిఎం విమర్శకులపై ఆదివారం ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు జరుగుతున్నదంతా మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు , మరాఠాల స్థయిర్యం చెదరగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నం అని, దీనిని తాను ఓ భారీ స్థాయి కుట్రగానే పరిగణిస్తున్నానని చెప్పారు. ఎటువంటి రాజకీయ తుపాన్లు వచ్చినా ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కరోనావైరస్‌ను కూడా సమగ్రరీతిలో తిప్పికొడుతామని ఆయన టీవీల ద్వారాప్రజానీకాన్ని ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య పది లక్షల మార్క్ దాటింది. ఇది ఓ మహమ్మారి అని, దీనిని నివారించే విషయంలో తమ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని ఉద్ధవ్ తెలిపారు. నటి కంగనా రనౌత్ బంగళా కూల్చివేత తరువాత తలెత్తిన విమర్శలు, దీనిపై రాజుకున్న రాజకీయ దుమారం గురించి కూడా ఉద్ధవ్ ప్రస్తావించారు. సుశాంత్ సింగ్ మరణం విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదనే విమర్శలు తలెత్తాయి. కేసును నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసు యంత్రాంగాన్ని కదిలించిందనే విమర్శలు వెలువడ్డాయి. వీటిన్నింటిపైనా సిఎం స్పందించారు.

కరోనా సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నట్లు, ఇప్పుడు వచ్చిపడ్డ రాజకీయ సవాళ్లను కూడా తగు విధంగా తిప్పికొడుతానని ప్రకటించారు. రాజకీయదుమారానికి సరైన జవాబు ఇవ్వాలంటే తాను ముఖ్యమంత్రి పదవి మాస్క్‌ను తీసివేసి మాట్లాడాల్సి ఉంటుందని, అప్పుడే పెద్దతలకాయల నోళ్లు మూతపడుతాయని అన్నారు. తాను మాట్లాడటం లేదంటే తన వద్ద సరైన సమాధానాలు లేవని అనుకోరాదని, ఒక్కసారి చెప్పడం ఆరంభిస్తే ఇతరులు తట్టుకోలేరని అన్నారు. రాజకీయ దుమారాలను తగు విధంగా రాజకీయంగానే ఎదుర్కొంటానని తెలిపారు. ఇక కరోనా విషయంలో ప్రజానీకం నిర్లక్షం వహించరాదని, ఏమి కాదులే అనే చులకన భావం తగదని అన్నారు. మాస్క్‌లు వేసుకోండి, భౌతిక దూరం పాటించండి, ముఖాముఖీ కలయికలు వద్దు, గుంపులుగా చేరడం ప్రమాదకరం అన్నారు. ఈ సందర్భంగా సిఎం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ బిగైన్ అగైన్ గురించి మాట్లాడారు. కరోనా వైరస్ ఇప్పటికీ ఉధృతంగానే ఉందని, గ్రామీణ మహారాష్ట్రలో వ్యాపిస్తోందని అన్నారు. అంతటా రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ముందుగా కేసులు నిర్థారణ అయితే కోలుకోవడం లేదా నివారణ తేలిక అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ దశలో వివిధ వర్గాలకు పలు సహాయక చర్యలు చేపట్టిందని , నిసర్గ సైక్లోన్ బాధితుల కోసం రూ 700 కోట్ల మేర పంపిణీ జరిగిందన్నారు. కరోనా నివారణకు ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని ఈ దిశలో మై ఫ్యామిలీ మై రెస్పాన్స్‌బుల్టి కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. మరాఠా కోటాపై సుప్రీం స్టే అనూహ్యం అని వ్యాఖ్యానించారు. కోవిడ్, తుపాన్లు, వరదలు ఇప్పుడు వచ్చిపడుతున్న రాజకీయ దుమారం వీటన్నింటినీ తాను ప్రజల మద్దతుతోనే ఎదుర్కొని తీరుతానని ప్రకటించారు.

Will face all political storms among with Corona: Uddhav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News