Saturday, April 27, 2024

సంక్షేమానికి కత్తెరేస్తే పోరుబాట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సాహసం చేయలేని అన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం నిజామాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశానికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, ఎంపి కె.కేశవరావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు, గృహలక్ష్మి, బిసి బంధు, గొర్రెల పంపిణీ వంటి కా ర్యక్రమాల అమలును నిలిపివేసే కుట్రను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేని దళిత కుటుంబాల అ భివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని తాము ప్రారంభించామని చె ప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసి న కాంగ్రెస్, ఎన్నికల సందర్భంగా దళిత బంధును రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి, దాన్ని మరిచిపోయిందని విమర్శించారు. ఇప్పటికే ఎంపిక చేసిన దళితబంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. దళిత బంధు కోసం లబ్ధిదారులు బ్యాంకుల్లో ప్రారంభించిన అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందని అన్నారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోవడం లేదని వాపోయారు.

నియోజకవర్గానికి మూడు వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా తమ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్‌ను అందించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని కెటిఆర్ మండిపడ్డారు. ఈ విధంగా పేదలు, దళితులు, బిసిల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ప్రతి హామీని నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తాం…
కేవలం ఎన్నికల కోసం అడ్డగోలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేత పత్రాలు, అప్పుల పేరు తో నాటకాలు ఆడుతుందని కెటిఆర్ విమర్శించారు. ఇప్పటికే మంత్రి భట్టి అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 6 గ్యారెంటీల పేరుతో తప్పించుకోవడానికి చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కెటిఆర్ తెలిపారు. గతం లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఎలాంటి లైన్‌లో నిలబెట్టకుండానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను వారి ఇంటి ముందుకి తీసుకెళ్లి ఇచ్చిన పరిస్థితి ఉంటే, ఈ రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ లైన్‌లో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్‌లో నిలబెడుతున్నారని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం, ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని కెటిఆర్ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బిఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని వివరించారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం సాధించగలమని అన్నారు. బిఆర్‌ఎస్‌కు గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి, ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తోందని ఆరోపించారు. పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని తెలిపారు. ఈ మేరకు కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా కచ్చితంగా మార్చుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో అయినా, భవిష్యత్తులోనైనా కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితి మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News