Wednesday, May 8, 2024

విండీస్‌కు ఉత్కంఠ గెలుపు

- Advertisement -
- Advertisement -

Windies won match by 3 runs against Bangladesh

పూరన్ మెరుపులు, రాణించిన బౌలర్లు, బంగ్లాపై పొలార్డ్ సేన విజయం

షార్జా: ట్వంటీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విండీస్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా, విండీస్ ఇదే తొలి విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. చివరి ఓవర్‌లో విజయం కోసం 13 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లాదేశ్ 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రీ రసెల్ అద్భుత బౌలింగ్‌తో విండీస్‌కు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు.

ఆరంభంలోనే..

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌గా దిగిన షకిబ్ అల్ హసన్ నిరాశ పరిచాడు. ఒక ఫోర్‌తో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ మహ్మద్ నయీం కూడా విఫలమయ్యాడు. 19 బంతులు ఎదుర్కొన్న నయీం రెండు బౌండరీలతో 17 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. జేసన్ హోల్డర్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

దాస్ ఒంటరి పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముదుకు తీసుకెళ్లే బాధ్యతను లిటన్ దాస్ తనపై వేసుకున్నాడు. అతనికి సౌమ్య సర్కార్ అండగా నిలిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. దాస్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, సౌమ్య సర్కార్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు కుదురు కోవడంతో బంగ్లాదేశ్ కోలుకున్నట్టే కనిపించింది. కానీ 13 బంతుల్లో రెండు బౌండరీలత 17 పరుగులు చేసి సౌమ్య సర్కార్‌ను అకిల్ వెనక్కి పంపాడు. దీంతో 31 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అతను ఔటైనా దాస్ తన పోరాటాన్ని కొనసాగించాడు. సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీంతో కలిసి మరో మంచి పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. కానీ కీలక సమయంలో రహీం (8) ఔటయ్యాడు. రవి రాంపాల్ అద్భుత బంతితో రహీంను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 90 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను చేజార్చుకుంది.

మహ్మదుల్లా శ్రమ వృథా

అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా అద్భుత బ్యాటింగ్‌తో జట్టు గెలుపు అవకాశాలను మళ్లీ చిగురింప చేశాడు. ఇటు లిటన్ దాస్, అటు మహ్మదుల్లా సమన్వయంతో ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేశారు. కానీ కీలక సమయంలో దాస్ ఔట్ కావడంతో బంగ్లాదేశ్ కష్టాలు మళ్లీ మొదటి కొచ్చాయి. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దాస్ 4 ఫోర్లతో 44 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 31 పరుగులు చేసినా జట్టును మాత్రం గెలిపించలేక పోయాడు. విండీస్ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు తొలి విజయాన్ని అందించారు.

దక్కని శుభారంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్‌లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. లూయిస్ ఆరు పరుగులు మాత్రమే చేసి ముస్తఫిజుర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ గేల్ కూడా వెనుదిరిగాడు. గేల్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 4 పరుగులు మాత్రమే చేసి మెహదీ హసన్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే హెట్‌మెయిర్ కూడా పెవిలియన్ చేరాడు. ఒక ఫోర్‌తో 9 పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ను మెహదీ హసన్ వెనక్కి పంపాడు. దీంతో విండీస్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రోస్టన్ ఛేజ్ తనపై వేసుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఛేజ్ రెండు ఫోర్టలతో 39 పరుగులు చేశాడు.

పూరన్ విధ్వంసం..

మరోవైపు కీలక సమయంలో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న పూరన్ వరుస సిక్సర్లతో అభిమానులను కనువిందు చేశాడు. చెలరేగి ఆడిన పూరన్ 22 బంతుల్లోనే ఒక ఫోర్, మరో నాలుగు భారీ సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఇక ధాటిగా ఆడిన హోల్డర్ రెండు సిక్సర్లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ పొలార్డ్ 14 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో విండీస్ స్కోరు 142 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News