Sunday, March 26, 2023

చట్టసభల్లో మహిళకు కోటా ఎప్పుడు?

- Advertisement -

ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలోని లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష సమానత్వం కోసం నాలుగు ప్రధాన అంశా లు తీసుకొని అంచనా వేశారు. 1). ఆర్థిక భాగస్వామ్యంలో 143 వ స్థానం 2). రాజకీయ సాధికారిత అధికారంలో 48వ స్థానం 3). విద్యాభ్యాసంలో 107 వ స్థానం 4). వైద్యరంగంలో అట్టడుగు 146 వ స్థానంలో వుంది. సమానత్వ సూచీలో 135 వ స్థానంలో ఉన్న మన దేశం కంటే కేవలం 11 దేశాల మాత్రమే మన కంటే వెనుకబడి ఉన్నాయి. పొరుగు దేశమైన బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశాలు స్త్రీ, పురుష సమానత్వంలో మనకంటే ముందు ఉన్నా యి.

మన దేశంలో లోక్‌సభలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే మహిళా సభ్యులు 81మంది, రాజ్యసభలో 29మంది వున్నారు. మొత్తం మహిళా సభ్యు లు 14.9% మాత్రమే వున్నారు. మొదటి లోక్‌సభ లో మహిళా ఎంపిల సంఖ్య 22. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మహిళా సాధికారితను మాటలకే పరిమితం చేశాయి.మన పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా ఎంపిల వాటా 15%లోపే వుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా ఎంఎల్‌ఎల సగటు సంఖ్య 8 శాతం లోపే వుంది. న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో వెల్లడించిన గణాంకాలు రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని ప్రస్ఫుటం చేశాయి.

జనాభాలో సగ భాగం వున్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ చట్టం చేయడానికి రాజకీయ పార్టీల నేతలు మీనమేషాలు లెక్కిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. మహిళలకు ఒకసారి సీట్లు రిజర్వ్ చేస్తే శాశ్వతంగా తమకు అధికారం దక్కదన్న భావన మహిళా బిల్లు ఆమోదం కాకుండా అడ్డుపడుతుంది. 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అనేక పరిణామాలు అపరిమిత ఆలస్యం తర్వాత 2010లో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నాటి లోక్‌సభ కాల పరిమితి తీరిపోవడంతో ఆ బిల్లు అమలుకు నోచుకోలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ అమృతోత్సవాలు జరుపుతున్నప్పటికీ దేశ జనాభాలో సగభాగమున్న మహిళలకు శాసన నిర్మాణంలో అతి తక్కువ స్థానం ఇవ్వడం సమంజసం కాదు. తక్కువ సంఖ్యలో వున్న వారు అధికారాన్ని చెలాయిస్తూ అధిక సంఖ్యాకులైన మహిళలు, వెనుకబడిన వర్గాల వారు రాజ్యాధికారానికి దూరంగా ఉండడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సామాజిక ‘పాలన’ రాజనీతి వేత్తలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2022 లెక్కల ప్రకారం అమెరికా, ఐరోపా, సహారా ఎడారికి దక్షిణాన వుండే సబ్ సహారా, ఆఫ్రికా ప్రాంతాలలో జాతీయ పార్లమెంట్‌లో ప్రపంచ సగటు 26.2 శాతం కన్నా ఎక్కువే మహిళలు ఎంపిలుగా వున్నారు. నేపాల్‌లో 34%, బంగ్లాదేశ్ 21%, పాకిస్థాన్ 20%, భూటాన్ 17%, మన దేశం కన్నా మెరుగుగా ఉన్నాయి. ఆసియా దేశాల్లో 19.2%, అరబ్ దేశాల్లో 18.4%, పసిఫిక్ దేశాల్లో 13.5 శాతం వుంది. మన దేశంలో 10 నుండి 15% లోపు మహిళా ఎంపిలు వున్నారు. ప్రపంచం మొత్తం మీద కేవలం రెండు దేశాల్లో మాత్రమే పార్లమెంట్లో 50% కంటే ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం కలిగి వున్నారు. 2016 జూన్ గణాంకాల ప్రకారం రువాండా దేశంలో 63.8%, బోలివియాలో 53.1% వుండగా, 30 % కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం గల దేశాల సంఖ్య పెరిగింది.

స్త్రీలకు పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించాలి. ప్రజా జీవితంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక నిర్ణయాలలో, శాసన నిర్మాణంలో మహిళలకు క్రియశీల ప్రాతినిధ్యం కల్పించాలి. స్త్రీలకు పురుషులతో పాటు నాయకత్వానికి సమాన అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తూ ప్రవేశపెట్టిన చట్టాలు సమర్థవంతంగా అమలు చేయాలి. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో టికెట్లు ఇవ్వడానికి పార్టీలపరంగా విధి విధానాలు, నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయ పార్టీలు అనుబంధ విభాగాలలో పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీస బేరర్లలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి. మహిళా సంఘాలు, స్వశక్తి మహిళా గ్రూపులు, డ్వాక్రా మహిళలు ప్రతి గ్రామ పంచాయితీ స్థాయిలో వున్న తల్లుల సంరక్షణ సంఘాలు, పొదుపు సంఘాల ప్రతి నెలా జరిగే సమావేశాల్లో మహిళా సాధికారిత సాధన, మహిళలు రాజకీయాల పట్ల చర్చించి అవగాహన పెంచుకోవాలి.

ప్రతి గ్రామంలో మహిళల చేత మద్యపాన నిషేధ కమిటీలు ఏర్పాటు చేసి మద్యరహిత సమాజ నిర్మాణానికి ప్రజలను చైతన్యపరచాలి. మహిళా లోక చైతన్యమే మహిళకు శ్రీరామరక్ష.మహిళలు వివక్ష, మహిళలను కించపరిచే అన్ని రకాల వివక్షలను రూపు మాపాలి. స్త్రీలను చిన్నచూపు చూసే సమాజ పరిస్థితులు మారాలి. మహిళల పట్ల గౌరవం పెరగాలి. మహిళల పట్ల పురుషుల ఆలోచన వైఖరిలో మార్పు రావాలి. మహిళలు మానవ నిర్మాత అనే స్పృహ పెరగాలి. లింగ సమానత్వం, సమాన వేతన చట్టం, గృహ హింస చట్టం, ఉమెన్ ట్రాఫికింగ్ చట్టం, అత్యాచారాల నిరోధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, హిందూ కోడ్ బిల్లును అమలు చేయాలి. మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు అరికట్టాలి. దిశ, నిర్భయ చట్టం అమలుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి.

పోలీస్ స్టేషన్‌లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకొన్న మహిళా కమిషన్స్ ఏర్పాటు చేసి మహిళకు సత్వర న్యాయం జరిగే వ్యవస్థను బలోపేతం చేయాలి. జాతీయ మహిళా విధానం 2001ను అమలు చేయాలి. ఆడ, మగ అనే వివక్ష పాటించకుండా స్త్రీ, పురుషులు ఇద్దరూ సమాజ ప్రగతి రథానికి చక్రాల లాంటి వారని సమాజం భావించాలి. సాంప్రదాయకంగా మహిళలు ఇంటికి, ఇంటి వ్యవహారాలకు పరిమితం కావాలన్న భావన కుటుంబాలు విడనాడాలి. స్త్రీ పురుష సమానత్వం, సమాన అవకాశాల కల్పన కుటుంబం నుండే ప్రారంభం కావాలి. నూతన విద్యా విధానంలో లింగ వివక్ష స్త్రీ, పురుష సమానత్వం, సమాన అవకాశాల మీద పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి విద్యార్థి దశలోనే లింగ సమానత్వ సాధనకు ఉపకరించే విద్యా పాలన సంస్కరణలు అమలు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News