Thursday, May 2, 2024

కాలుష్య కోరల్లో జంతులోకం

- Advertisement -
- Advertisement -

World Animal Day 2020 in Telugu

ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూమి కేవలం మానవుడు సొత్తు కాదు. అన్ని రకాల జంతువులు, మొక్కలకు భూమిపై బ్రతికే హక్కు ఉంది. అయితే మన అత్యాశ, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో జరుగుతున్న అభివృద్ధి, జరుగుతున్న వినాశనం మిగతా జీవజాలానికి ఉరి బిగిస్తోంది. పారిశ్రామికీకరణతో ఇబ్బడిముబ్బడిగా వెలువడుతున్న విషవాయువులు భూమ్మీద ఉష్ణోగ్రతను పెంచేస్తున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని జంతురక్షణ కరువవుతోంది. ఇప్పటికే విచ్చలవిడిగా వేటాడటం, కళేబరాలకు పంపటం, అడవులను నరికి వేయడం, కార్చిచ్చులవల్ల జంతువుల ఉనికికి పెను ప్రమాదం ఏర్పడింది. మనిషి స్వార్ధానికి అవి ఆహారం లేక చిక్కిశల్యం అవుతున్నాయి. మన విలాసాలకు బలవుతున్నయి. మన సౌఖ్యానికి అవి దూర తీర ప్రాంతాలకు వలస పోతున్నాయి..

మూలిగే నక్కపై తాటికాయలా జంతువుల ఉనికికి భూతాపం శాపంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మార్చి 24, 1925న జర్మనీలోని బెర్లిన్‌లో జంతు ప్రేమికుడు హెయిన్‌రిచ్ జిమ్మర్‌మన్ ‘వరల్ ఏనిమల్ డే’ను నిర్వహించారు. ఆనాటి ఆ కార్యక్రమానికి దాదాపు 5 వేల మంది హాజరయ్యారు. ఆ తర్వాతి కాలంలో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని అక్టోబర్ 4కి మార్చారు. ఆరోజు జంతు, పర్యావరణ ప్రేమికుడు ఫ్లోరెన్స్ కు చెందిన ప్రాన్సిస్ అసిసి జన్మదినాన్ని పురస్కరించుకున్ని ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. తొలినాళ్లలో కేవలం జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, చెకోస్లొవెకియా మాత్రమే దీన్ని ఆచరించాయి. జంతు ప్రేమికుడు జిమ్మర్‌మన్ కృషి కారణంగా ఆ తర్వాత అనేక దేశాలకు ఇది విస్తరించింది. జంతువుల సంరక్షణ, ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రతి ఏటా అన్ని దేశాలు జంతు దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జంతువుల స్థాయిని, గౌరవాన్ని మెరుగుపరచడం ప్రపంచ జంతు దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా జంతు సంక్షేమంకోసం కృషి చేస్తున్న వ్యక్తులనూ, సంస్థలనూ ఒకే వేదిక పైకి చేర్చి జీవవైవిధ్యంలో భాగమై, మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధిచేయడం, జంతువులకు సరియైన గౌరవాన్ని అందజేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

జంతు ప్రేమికుల దినోత్సవంగా పిలుచుకొనే ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతోపాటు జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు స్‌ంరక్షణకు నిధులు సేకరిస్తారు. ప్రతి జీవికి భూమి పై స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని , శారీరకంగా, మానసికంగా మనోధైర్యంతో కూడిన జీవితాన్ని సాధించిలనే లక్ష్యంగా ఈ సంవత్సరం జంతు దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి.ఈ జీవావరణంలో ఉన్న ప్రతి జీవికి ఒక లెక్క ఉంది విషయంలో జరుగుతున్న ప్రతి గ్రహానికి ఓ గతి ఉంది. భూగ్రహం సరిపోలేదని అంతరిక్షానికి ఆశ పడుతున్న మనిషి మాత్రమే జీవకోటి పట్ల విషాన్ని చిమ్ముతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాడు.. తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. దీంతో జంతు ప్రపంచ కలవరం చెందుతుంది..

కాలుష్య కోరల్లో జంతు ప్రపంచం ఆకలయితేనే ఇతర జంతువుని వేటాడే లక్షణమున్న ఒక పులి బతికి ఉందంటే 100 చదరపు కిలోమీటర్ల అడవి పచ్చగా జీవంతో ఉన్నట్లే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. కాని వాతావరణ మార్పుల కారణంగా భూమి మీద దాదాపు లక్ష జీవ జాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. వన్యప్రాణుల అక్రమ రవాణా పెరిగిపోతుండటంతో జంతువులు సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఇందుకు నిదర్శనమే జంతువుల నుంచి తయారు చేసే వస్తువుల అక్రమ వ్యాపారం 7 నుంచి 10 బిలియన్ డాలర్లు సుమారు రూ. 35 నుంచి 50 వేల కోట్లు ఉంటుందని అంచనా. మనం విడుదల చేసే కర్బన ఉద్గారాలు అనేక జంతువులపైనే కాక వాటి పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బ తీస్తుంది. వాతావరణ మార్పులు తట్టుకునేందుకు అవి జట్టు కట్టుకునే కాలాన్ని, చోటును మార్చుకుంటున్నాయి. జంతువుల వలస మార్గాలను కూడా భూతాపం మార్చేస్తుంది. ధ్రువాలు, హిమనీనదాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుట, మంచు కొండలు కరగడం, విస్తరించడం, సముద్రాల ఉష్ణోగ్రత పెరగడం లాంటి అనేక ప్రకృతి విపత్తులు వాతావరణ మార్పులతో జీవుల పరిణామ క్రమంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూకంపాలు, తుఫాన్లు సంభవించి జంతువులు పలు సమస్యలును ఎదుర్కొంటున్నాయి. కాలుష్య సాగరాలైన నదులు ఏరులు, వాగులు జంతువులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నయి.

జన్యు మార్పిడి పంటల వల్ల వ్యవసాయ రంగంలో వాడే రసాయనిక క్రిమి సంహారక మందులతో అనేక జంతువులు విషపూరిత ఆహారానికి బలవుతున్నాయి. కబేళాలకు తరలించటమేకాక రెస్టారెంట్లు, డాబాలు, విందులు వినోదాలలో మాంసాహారం, జంతు సంబంధ ఉత్పత్తుల కోసం పెంపుడు జంతువులు బలయితున్నవి. ఆధునిక సాంకేతిక జీవన విధానంలో రోజు రోజుకీ పశుపెంపకం తగ్గిపోతుంది. ఉన్న జంతువులను మందులతో వాటి జీవితకాలాన్ని హరించి వేస్తున్నారు. సెల్‌ఫోన్, కంప్యూటర్ రంగంలో నెట్ వినియోగం వల్ల అధికంగా వెలువడే రేడియేషన్ వల్ల సున్నితమైన జంతువుల అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని జంతువుల్లో మెదడు పరిణామం, సంతానోత్పత్తి ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని రకాల కాలుష్యాలతో జంతువుల్లో విచిత్రమైన ప్రవర్తనలు చోటు చేసుకొంటున్నాయి. బాణాసంచా కాల్చడంవల్ల కొండలు, గుట్టలు త్రవ్వకాలతో పాటు కలగే విపరీత శబ్దాలకు సున్నితమైన జంతువులు భయభ్రాంతులకు గురవటమే కాక వాటి నివాసాలను వదిలేసి జనసంచారంలోకి పోతున్నాయి.

విచ్చలివిడిగా వాడి పారేసిన సంచుల్లో ఉన్న ఆహార పదార్థాలను తినటంతో కొన్ని లక్షల జంతువుల మృత్యువాత పడుతున్నాయి. అందుకు నిదర్శనాలే మూగజీవాల కడుపులో నుండి బయట పడే కిలోల కొద్దీ ప్లాస్టిక్ ఉండలు. అణు విద్యుత్ కర్మాగారాలు, సెజ్‌ల నిర్మాణం స్థిరాస్తి వ్యాపారాలతో అనేక జంతువుల నివాసానికి ముప్పు ఏర్పడి వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నేడు. మనిషి తన అవసరాల కోసం అడవులను నరకటమేకాక పెరుగుతున్న జనాభా, వర్షాభావ పరిస్థితులు సుదీర్ఘ వేసవికాలం, విధానపరమైన లోపాలు అడవుల క్షీణతకు ప్రధాన కారణాలు. అడవుల్లో సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు వన్య ప్రాణుల మనుగడకు శాపంగా మారాయి విద్యుత్ మంటలు, చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి, పిడుగు పడటం వల్ల అడవిలో ఏదో ఒక చోట నిప్పంటుకుని మొత్తం అడవి కాలిపోతుంది.

దీంతో జంతువులు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. మానవ తప్పిదాల వల్ల భారీ విస్తీర్ణంలో పచ్చని దట్టమైన అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఏటా అరవై లక్షల నుంచి కోటి 40 లక్షల హెక్టార్ల మేర అడవులు అగ్నిప్రమాదాల బారిన పడుతున్నాయి. దీంతో అరుదైన వన్యప్రాణుల సంపద నాశనం అవుతున్నది. 2019లో అమెజాన్ ఆస్ట్రేలియా, 2018లో కాలిఫోర్నియా కార్చిచ్చు ఎంతో నష్టాన్ని కలిగించాయి. జీవ వైవిధ్యానికి నెలవుగా మారిన అమెజాన్ అడవుల్లో 2019లో 40 వేల అగ్నిప్రమాదాలు సంభవించాయి. అణ్వాయుధాల నుంచి వెలువడుతున్న రేడియో ధార్మికశక్తి ఫలితంగా జంతుజాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అణ్వాయుధ ప్రయోగం జరిగితే ధరిత్రిపై అసలు జీవరాశే మిగలదు.

ఒక జాతిలోని అన్ని జీవులు మరణిస్తే ఆ జాతిని అంతరించిపోయిన జాతిగా పేర్కొంటారు. పరిస్థితులను మెరుగు పరచకపోతే సమీప భవిష్యత్తులో అంతరించిపోయే దుర్భరమైన జాతి దుర్బలమైనవి, సంఖ్యాపరంగా పర్యావరణం భక్షక అంశాల వల్ల అంతరించిపోయే అవకాశం ఉన్నవి. ఎండేంజర్డ్ (అంతరించిపోయే అవకాశం ఉన్నవి) జాతులుగా, తమ ఉనికిలో 80 శాతం తగ్గిపోయిన అత్యంత ప్రమాదంలో ఉన్న జంతువులను క్రిటికల్లీ ఎండేంజర్డ్ (తీవ్రంగా అంతరించిపోయే అవకాశం ఉన్నవి)గా పరిగణిస్తారు. అందుకే 2016లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జంతువులను ప్రేమిద్దాం కనుమరుగు కాకుండా కాపాడుకుందాం అని ఐక్య రాజ్య సమితి ‘గో వైల్ ఫర్ లైఫ్ ‘అనే నినాదం ఇచ్చింది

బిష్ణోయిలే ఆదర్శం

500 సంవత్సరాల క్రితం ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషి మనుగడ సాధ్యం అని నమ్ముతూ మార్వాడికి చెందిన గురు జంబేశ్వర్ 29 సూత్రాలను ప్రబోధించాడు. బిష్ణోయ్ అంటే 29 అని అర్థం. బిష్ణోయి ప్రధాన సూత్రాలైన ‘చెట్లను నరక కూడదు’, ‘జంతువులను చంపకూడదు’ అనే నినాదాలు నాటి చిప్కో ఉద్యమానికి నాంది పలికాయి. గతంలో జోద్పూర్ సమీపంలో కృష్ణ జింకను వేటాడి నందుకు సల్మాన్ పై కేసు, కోర్టు, జైలు చుట్టూ తిరగడానికి కారణమైన వాళ్ళు దేశంలోని తొలి పర్యావరణ ప్రేమికులు బిష్ణోయిలే.

కె. లక్ష్మీనారాయణ- 9989864764

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News