Sunday, April 28, 2024

సమరోత్సాహంతో భారత్.. నేడు నెదర్లాండ్స్‌తో చివరి పోరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆతిథ్య టీమిండియా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో 8 విజయాలు సాధించిన భారత్ మరో గెలుపుపై కన్నేసింది. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఆరంభం నుంచే భారత్ అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఇటు గిల్ అటు రోహిత్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది.

అందరి కళ్లు కోహ్లిపైనే..
మరోవైపు ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. సౌతాఫ్రికాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకం సాధించాడు. ఇదే సమయంలో వన్డేల్లో 49 శతకాలతో సచిన్ రికార్డును సమం చేశాడు. ఇక నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో శతకం సాధించి 50 సెంచరీలను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. కోహ్లి ఫామ్‌ను గమనిస్తే ఈ ఫీట్‌ను అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నెదర్లాండ్స్‌పై శతకం సాధిస్తే సచిన్ రికార్డును తిరగ రాస్తాడు.

అంతేగాక వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలిచింది. శ్రేయస్ అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షమి, బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజాలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్ కూడా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌కు సిద్ధమైంది. సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును అనుభవం ఆ జట్టుకు ఉంది. దీంతో నెదర్లాండ్స్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News