Sunday, April 28, 2024

పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!

- Advertisement -
- Advertisement -

నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల యత్నానికి పాల్పడతారా? పారదర్శకత, విశాల దృక్పథం నెలకొని వున్న వర్తమాన ప్రపంచంలో భారత్‌ను తప్పుగా చూపించడానికి ఏ వైపు నుంచైనా కుట్ర జరిగినా అది వెంటనే పటాపంచలైపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రజాస్వామిక అద్దం గతంలో కంటే ఇప్పుడు స్వచ్ఛంగా వున్న మాట వాస్తవం. అందులో మసిపూసి మారేడు కాయ చేసే కుత్సితుల పన్నాగాలు పని చేయవు. పేరుకి ప్రజాస్వామ్యమే అయినా వాస్తవంలో ఇండియాలో నడుస్తున్నది నియంతృత్వమేననే అభిప్రాయం 2014లో ప్రధాని మోడీ ప్రభుత్వం అవతరించినప్పటి నుంచి అనేక అధ్యయనాలు చెబుతూనే వున్నాయి.

తాజాగా మన పత్రికా స్వేచ్ఛ ర్యాంకు దారుణంగా పడిపోయిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ నిగ్గు తేల్చింది. బుధవారం నాడు ఈ సంస్థ విడుదల చేసిన తన 21వ నివేదిక ప్రకారం గత ఏడాదిలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో మన దేశం 11 ర్యాంకులు కోల్పోయి 150 నుంచి 161కి పడిపోయింది. అదే సమయంలో పాకిస్తాన్ 150 ర్యాంకులో నిలబడి పత్రికా స్వేచ్ఛలో మన కంటే మెరుగైన స్థానంలో వున్నది. మరింత ఆశ్చర్యపోవలసిన విషయమేమిటంటే కరడుగట్టిన నియంతలుగా పేరు గడించుకొన్న తాలిబాన్ల పాలనలోని అఫ్ఘానిస్తాన్ కూడా పత్రికా స్వేచ్ఛలో 152 ర్యాంకు సాధించుకొని మన కంటే బాగనిపించుకొన్నది. ఇండియాకు అతి సమీపంలోనే వున్న భూటాన్ 90వ ర్యాంకులో వుండగా, శ్రీలంక కూడా మన కంటే గొప్పగా 135వ స్థానంలో వుంది. ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే మన కంటే రెండు ర్యాంకులు తక్కువగా 163 వదిగా నిరూపణ అయింది. జర్నలిస్టులకు భద్రత విషయంలో మన పరువు మరింతగా భ్రష్టు పట్టిపోయింది.

ఈ విషయంలో ఇండియా 172వ ర్యాంకుకు మహా పతనం చెందింది. మొత్తం 180 దేశాల్లో ఇండియా 172 వద్ద నిలిచిందంటే మన కంటే అధ్వానంగా కేవలం ఎనిమిది దేశాలే వున్నాయన్న మాట. జర్నలిస్టులకు భద్రత సూచీ ఆయా దేశాల్లో వార్తలను సేకరించే వారికి , వాటిని ప్రచురించే వారికి, వ్యాఖ్యానించే వారికి ఎంత మేరకు శారీరక హాని, మానసిక వ్యథ, ఉద్యోగాలు కోల్పోడం వంటి ప్రమాదాలు లేకుండా వున్నాయనే దానిని బేరీజు వేసి వాటి స్థాయిలను నిర్ణయించేది. మామూలుగా పత్రికా స్వేచ్ఛ విషయంలో 11 ర్యాంకులు పడిపోయిన ఇండియా జర్నలిస్టుల భద్రత విషయంలో మరి 11 ర్యాంకులు దిగజారిపోడం గమనించవలసిన విషయం. పత్రికా స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వాతంత్య్రం. దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్వేచ్ఛగా అభిప్రాయాన్ని ప్రకటించే స్వేచ్ఛ. అలా ప్రకటించదలచుకొన్న వారికి రక్షణ కరవైతే పత్రికా స్వేచ్ఛ లేనట్టే, ఆ మేరకు ప్రజాస్వామ్యం అడుగంటినట్టే.

ఎన్‌డిటివి యాజమాన్యాన్ని ప్రధాని మోడీ సన్నిహిత మిత్రుడు, హిండెన్‌బర్గ్ సంస్థ వెలికి తీసిన భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి బాధ్యుడు అయిన గౌతమ్ అదానీ సొంతం చేసుకొన్న తక్షణమే అప్పటి వరకు అందులో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టు రవీష్ కుమార్ రాజీనామా సమర్పించి వైదొలిగారు. 48 ఏళ్ళ రవీష్‌కు ఆ సంస్థతో వున్న అనుబంధం 26 ఏళ్ళ సుదీర్ఘ కాలానికి చెందినది. ఆయన వెంట మరి కొందరు కూడా ఎన్‌డిటివిని విడిచి వెళ్ళారు. మోడీ ప్రభుత్వానికి సన్నిహితంగా వున్న వారు మీడియా సంస్థలను స్వాధీనం చేసుకోడమనేది దేశంలో హక్కులకు, మొత్తంగా ప్రజాస్వామ్యానికి వాటిల్లనున్న పెను ముప్పుకి సూచికలని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్‌డిటివిని అదానీ చేపట్టడం, అంబానీలు కూడా మీడియా మీద పట్టు సాధించుకోడం దేశంలో ప్రజోద్యమాలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు తలెత్తనున్న ప్రమాదంలో భాగమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని తప్పుడు వార్త అని ముద్ర వేసి నిషేధింప చేయడానికి గత జనవరిలో ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలు దేశంలో మీడియా స్వేచ్ఛకు ఎదురు కానున్న క్లిష్ట పరిస్థితులకు నిదర్శనమని చెప్పవచ్చు. గుజరాత్ మారణ హోమంలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ పాత్రను ఎత్తి చూపిన డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దేశంలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరగడాన్ని కూడా పత్రికా స్వేచ్ఛకు కలిగిన ముప్పులో భాగంగానే పరిగణించాలి. ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చిన 2014లో మన పత్రికా స్వేచ్ఛ ర్యాంకు 140 కాగా, ఇప్పుడది 161కి పడిపోయింది. దేశంలో అన్ని స్వేచ్ఛలున్నాయని చెబుతూనే దేశద్రోహ చట్టం, నేరస్థ పరువు నష్టం చట్టం వంటి వాటిని కొనసాగించి తమ విధానాలను జల్లెడ పట్టే మీడియా మీద, ప్రతిపక్ష నేతల మీద ప్రయోగించడం ఎటువంటి పత్రికా స్వేచ్ఛ అనుకోవాలి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News