Friday, April 26, 2024

క్వార్టర్ కోసం కరెంట్ పోల్ ఎక్కిన మందుబాబు

- Advertisement -
- Advertisement -

Alcohol

 

హైదరాబాద్ ః సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సమీపంలో ఓ మందుబాబు ఆదివారం సాయంత్రం కరెంట్ స్తంభంపైకి ఎక్కి క్వార్టర్ మందు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హల్ చల్ చేశాడు. ముషీరాబాద్ సమీపంలోని డీ మార్డ్ వద్ద ఇలియాస్ అనే వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి క్వార్టర్ మందు ఇవ్వంది దిగేప్రసక్తి లేదని మొండికేశాడు. తనకు మందు బాటిల్ ఇప్పించాలని, లేని పక్షంలో పక్కనే ఉన్న హైటెన్షన్ వైరు పట్టుకుంటానని బెదిరిస్తూ పోలీసులకు భయపెట్టాడు. విషయం గ్రహించిన స్థానికులు, వాహన చోదకులు పెద్ద ఎత్తున కరెంటు స్తంభం వద్దకు చేరుకుని కిందకు రావాలని కేకలు వేశారు. ఆనోటా ఈనోటా సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్తంభంపై ఉన్న ఇలియాస్‌ను కిందికి రావాలంటూ పోలీసులు బతిమాలినా మందుబాబు ఏమాత్రం వినలేదు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించి ఆ లైన్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కోరారు.

దీంతో పోలీసుల అభ్యర్థనతో విద్యుత్ అధికారులు ఆ మార్గంలో కరెంట్‌ను కట్ చేశారు. కాగా కరెంటు స్తంభం 30 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న మందుబాబు ఇలియాస్ మద్యం ఇస్తేనే దిగుతానని మొండిపట్టుపట్టాడు. స్తంభం పైనుంచి పొరపాటున మందుబాబు కిందపడితే చనిపోతాడని భావించిన పోలీసులు స్థానికుల సహాయంతో కింద పరదాలను అడ్డు పెట్టారు. పైనుంచి జారి పడినా మందుబాబుకు ఏమీ కాకుండా విశాలమైన ప్లాస్టిక్ పరదాలతో వలయం ఏర్పాటు చేశారు. దాదాపు 40 నమిషాల పాటు. మందుబాబు ఎంతకీ కిందికి దిగిరాకపోవడంతో ఇక లాభం లేదని పోలీసులు భావించారు. వెంటనే సమీపంలో ఉన్న వైన్స్ షాపులో ఒక క్వార్టర్ కొని తీసుకొచ్చారు.

అయినప్పటికీ మందుబాబు ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ల బాటిల్ తీసుకురావాలని మరో డిమాండ్ చేశాడు. మందుబాబు తాజా డిమాండ్ మేరకు పోలీసులు జంబో గ్లాస్, లీటరు నీళ్ల బాటిల్ తీసుకొచ్చి ఇలియాస్‌కు చూపించడంతో కిందకు దిగే యత్నం చేశాడు. స్తంభం దిగి వస్తానని, కాకపోతే కిందికి వచ్చాక తనను ఏమీ అనకూడదని చివరాకరి డిమాండ్‌తో పాటు షరతు విధించాడు. దానికి కూడా పోలీసులు అంగీకరించి సురక్షితంగా కిందకు దిగాలని కోరారు. మందు బాబు విధించిన అన్ని షరతులకు పోలీసులు ఒప్పుకోవడంతో ఇలియాస్ మెల్లగా స్తంభం పై నుంచి కిందికి దిగాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు క్వార్టర్ మందు, గ్లాసు, నీళ్ల బాటిల్ మందుబాబు చేతిలో పెట్టి వెళ్లిపోయారు.

Young man climbing the Current pillar for the Alcohol
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News