Friday, April 26, 2024

పెరిగిన బాల్య వివాహాలు

- Advertisement -
- Advertisement -

About 50% rise in child marriage cases in 2020

తల్లిదండ్రుల పేదరికం
ఏకాంతం ఒంటరితనం
2020 మిగిల్చిన మరో ప్రశ్న

న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2020 దేశంలోని ముక్కుపచ్చలారని బాలల జీవితాలపై పర్చుకున్న కోవిడ్ ఇతర నీలినీడలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. బోలెడంత బతుకు అంతా ఎంతో ముందున్న దశలో ఈ ఏడాది అత్యధిక బాల్య వివాహాలు జరిగాయి. అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఈ బాల భారతపు పెళ్లిళ్లు దాదాపు 50 శాతం పెరిగాయి. కోవిడ్ మిగిల్చిన మరింత పేదరికం, బాలల ఒంటరితనం వంటి కారణాలతో ఈ పసి జీవన బంధాలు ఏర్పడటం ఇక ముందు తలెత్తే మరింత కీలక జీవన సామాజిక పరిణామానికి దారితీస్తుందని విశ్లేషకులు తెలిపారు. గడిచిన ఏడాది మొత్తం మీద 785 బాల్యవివాహాల కేసులు బాల్యవివాహాల నిషేధ సంబంధిత చట్టం పరిధిలో నమోదయ్యాయని నేరాల నమోదు ప్రక్రియ సంస్థ ఎన్‌సిఆర్‌బి వెలువరించిన గణాంకాలతో స్పష్టం అయింది. అంతకు ముందు ఏడాది 2019లో బాల్యవివాహాల సంఖ్య 523. 2018లో ఇది 501గా ఉంది. ఓ వైపు అధికంగా బాల్య వివాహాలు జరగడం ఓ పరిణామం అయితే , ఇవి జరిగినట్లు తెలిపే ఫిర్యాదులు లేదా సమాచారం ఉదంతాల సంఖ్య కూడా పెరిగింది.

మరో వైపు దేశంల గత ఏడాది నెలకొన్న కొవిడ్ , కుటుంబాల దీనావస్థల నడుమ మరెన్నో బాల్య వివాహాలు జరిగినా అవి వెలుగులోకి రాకుండా ఉంటాయనే విషయం కూడా కలవరం కల్గిస్తోంది. భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్లలోపు మహిళలు, 21 ఏళ్ల లోపు మగవారికి జరిగే పెళ్లిళ్లను బాల్యవివాహాలుగా పరిగణిస్తారు. గత ఏడాది కర్నాటకలో అత్యధికంగా 184 బాల్య వివాహాలు జరిగాయి, తరువాత అసోం 138, తమిళనాడు 77, తెలంగాణలో 62 బాల్య వివాహాలు జరిగినట్లు ఫిర్యాదుల క్రమపు రికార్డులతో తేలింది. సాధారణంగా పేదరికం, పిల్లలను పోషించే శక్తి లేకపోవడంతో దొరికిన సంబంధాలు చేసి బాల్యపు దశలోనే పెళ్లి పూర్తి చేసి పంపించడం జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు బాల్య వివాహాలకు కారణాలు మారాయని, చిన్నలకు పెద్దలు చేసిన పెళ్లిళ్లు, చిన్నవారే ప్రత్యేక పరిస్థితులలో తమంతట తాము చేసుకున్న పెళ్ళిళ్లు తలెత్తాయని, ఈ విధంగా ఇప్పుడు ఈ వివాహాలను బాల్య వివాహాలు బాలల స్వీయ వివాహాలుగా వర్గీకరించాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధ్యయన సంస్థలు తెలిపాయి.

బాల్యం దాటి యవ్వనపు దశలోకి వచ్చే వారికి ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు ఏకాంతపు పరిస్థితి, అందుబాటులో ఉండే సెల్ ఫోన్లు , ఆకర్షణీయ శక్తులతో బాలికలు ప్రేమలో పడటం, ఇంటి నుంచి పారిపోవడం , నచ్చిన వారితో పెళ్లి చేసుకుని ఉండటం లేదా గడపడం జరుగుతోంది. ఇది భౌతిక ఆకర్షణకు సంబంధించిన విషయం అయితే గత ఏడాది కోవిడ్ సృష్టించిన లాక్‌డౌన్లు, ఎటువంటి పని దొరకకపోవడంతో కుటుంబంలో ఎక్కువ మందిని పోషించే శక్తి లేని తల్లిదండ్రులు , కుటుంబ పెద్దలు తమ గుడిసెలు లేదా రేకుల షెడ్ల ఆవాసం నుంచి ఒక్క జీవి అయినా దూరంగా వెళ్లి బతుకగల్గితే అది వారికి తనకూ మేలు చేస్తుందని ఆశించి , ఏదో విధంగా గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపినట్లు వెల్లడైంది.

కోవిడ్ దశలో స్కూళ్ల మూత పిల్లలకు చదువులు చెప్పించలేని స్థితితో బడీడు పిల్లలని కూడా చూడకుండా వారిని పెళ్లిళ్ల పేరిట గడప దాటించిన ఉదంతాలు ఉన్నాయి. బాలల అక్రమ రవాణా నిరోధకం, వారిపై అకృత్యాల నివారణకు ఏర్పాటు అయిన ఇండియన్ లీడర్‌షిప్ ఫోరంలో ఒకటిగా ఉన్న స్వచ్ఛంద సంస్థ సంజోగ్ వ్యవస్థాపక సభ్యులు రూప్ సేన్ ఇప్పటి బాల్య వివాహాల ఘట్టాల వెనుక దాగి ఉన్న అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఇంతకుముందటిలాగానే బాల్యవివాహాల తంతు సాగుతూ వచ్చింది. అయితే మునుపటితో పోలిస్తే ఇప్పుడు వీటి గురించి సమాచారం వెలుగులోకి రావడం ఎక్కువైందని, ఇప్పటికీ నిర్థారణకు రాని ఇటువంటి వివాహాలు కోకొల్లలుగా ఉంటాయని బాలల విషయాల నిపుణులు విశ్లేషకులు కొందరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News