Thursday, May 2, 2024

నేడు లక్ష మందికి టీకా

- Advertisement -
- Advertisement -

1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ
సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు
అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్ 
టీకా రీయాక్షన్‌తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్
మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి రానున్న 4 లక్షల డోసులు

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యశాఖ మరింత వేగవంతం చేసింది. నేడు(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి టీకాలు వేయాలని లక్షం పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1034 సెంటర్లలో ఈరోజు టీకా పంపిణీ జరగనుంది. ఒక్కో సెంటర్ లో 100 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అంటే అన్ని సెంటర్లలో 1,03,400 మంది తొలి డోసును తీసుకోనున్నారు. ఈమేరకు ఇప్పటికే 55,270 కొ విషీల్డ్ డోసులు రీజనల్ సెంటర్లకు వెళ్లగా, సోమవారం సాయంత్రం కోఠి సెంట్రల్ స్టోరేజ్ కేంద్రం నుంచి 33 జిల్లాలోని కోల్డ్‌చైన్‌లకు 1,14,730 డోసులు వెళ్లాయి. అంతేగాక ఈ రోజు డోసు తీసుకునే వారి ఫోన్లకు మెసెజ్‌లు కూడా వెళ్లాయని అధికారులు అంటున్నారు. లబ్ధిదారులంతా ఆ సందేశంలోని కేంద్రాలకు మాత్రమే రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే 104 కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలని వైద్యశాఖ సూచించింది.
సోమవారం 335 సెంటర్లలో వ్యాక్సినేషన్ పూర్తి….
రాష్ట్రంలో సోమవారం 335 సెంటర్లలో వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,750 మందికి టీకాలు ఇవాల్సి ఉండగా, 13,666 మంది టీకాను తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే 82 శాతం మంది లబ్ధిదారులు స్వయంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకున్నట్లు డిహెచ్ డా శ్రీనివాసరావు తెలిపారు. అయితే సోమవారం కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో 15 మందికి స్పల్ప రీయాక్షన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిలో వాంతులు, కళ్లు తిరగడం, దద్దర్లు, చర్మం ఎర్రబడటం, టీకా వేసిన చొట రక్తం గడ్డకట్టడం వంటివి జరిగినట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికీ సీరియస్ పరిస్థితులు లేవు. స్పల్ప సమస్యలు తేలిన వారంతా జనగాం, మహబూబ్‌నగర్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారని వైద్యశాఖ పేర్కొంది. మరోవైపు గద్వాల జిల్లాలో 2 గంటల వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావడం గమనార్హం. ఆ జిల్లాలో 250 మంది లబ్ధిదారులు కొవిన్‌లో ఎంట్రీ కాగా, వారంతా మధ్యాహ్నాం వరకు టీకా తీసుకొని ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు, క్రిటికల్ కేర్ విభాగం హెచ్‌ఓడి డా కిరణ్ మాదాల టీకా తీసుకొని అందరిలో భరోసానింపారు. అంతేగాక ఫీవర్ ఆసుపత్రిలో(2 గంటల వరకు) 120 మంది, నిలోఫర్‌లో97, ఉస్మానియాలో 87 మంది లబ్ధిదారులు టీకాను తీసుకున్నారు. మిగతా టీచింగ్ ఆసుపత్రిల్లోనూ వ్యాక్సినేషన్ సక్సెస్‌పుల్‌గానే జరిగిందని అధికారులు చెబుతున్నారు.
సెంట్రల్ ఉద్యోగులూ తీసుకున్నారు…
కరోనా నియంత్రణకు సెంట్రల్ ఉద్యోగులూ టీకా తీసుకున్నారు. మన రాష్ట్ర పరిధిలో ఇప్పటి వరకు కొవిన్‌లో సుమారు 15 వేల మంది సెంట్రల్ ఉద్యోగులు నమోదు అయ్యారు. వీరిలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఇఎస్‌ఐ, రైల్వే విభాగాల్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నారు. అయితే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్మీ విభాగంలో సేవలందించే 1700 మంది హెల్త్ కేర్ వర్కర్లు టీకా తీసుకోగా, 121 మంది ఎయిర్‌ఫోర్స్ హెల్త్ సిబ్బంది, 24 మంది ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, 595 మంది రైల్వేలో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
వచ్చే వారం నుంచి ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్….
వచ్చే వారం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టార్‌లోనూ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 175 కేంద్రాల్లో ఈ పంపిణీ జరగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ పేర్కొంది. అయితే ఈ కేంద్రాల్లో పబ్లిక్ హెల్త్‌కి చెందిన వ్యాక్సినేటర్లు, మానిటరింగ్ ఆఫీసర్లు ఉంటారని డిహెచ్ తెలిపారు. ప్రతి వయల్‌కి లెక్క తెలిసేలా నిబంధనలు కూడా ఇచ్చామని అధికారులు అంటున్నారు.
రీయాక్షన్‌తో ఓ మహిళ గాంధీలో అడ్మిట్….
ఉప్పల్ పిహెచ్‌సిలో కొవిషీల్డ్ టీకా తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్ నవీనా(29 ఏళ్లు)కు రీయాక్షన్ వచ్చింది. తొలి రోజు టీకా తీసుకోగానే ఆమేకు వాంతులు, శరీరం బలహీనపడటంతో వైద్యులు వెంటనే గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె టెంపరేచర్, బిపి, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా రాజరావు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు వైద్యం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆహారం తీసుకోకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.
3.1 నిష్ఫత్తిలో టీకా పంపిణీ….
రాబోయే రోజుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురికి కొవిషీల్డ్, ఒకరికి కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కేంద్ర సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కోటి కొవిషీల్డ్, 50 లక్షలు కొవాగ్జిన్ టీకాలను కేంద్రం తొలి డోసు కింద కొనుగోలు చేసింది. వీటిని ప్లస్ 2 నుంచి ప్లస్ 8 ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేశారు. మరో రెండ్రోజుల్లో సెకండ్ డోసు వ్యాక్సిన్లు రానున్నట్లు అధికారులు తెలిపారు.
సతాయిస్తున్న కొవిన్ సాప్ట్‌వేర్….
రాష్ట్రంలో కొవిన్ సాప్ట్‌వేర్ సతాయిస్తుంది. దేశ వ్యాప్తంగా ఒకే సర్వర్ ఉండటంతో టెక్నికల్ సమస్యలు వస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. తొలి రోజు నుంచి ఈ సమస్యలు వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా లాగిన్ కాకపోవడం, ఎంట్రీ అయిన వివరాలు చూపకపోవడం, లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లకపోవడం, పిన్ సమస్యలు, వస్తున్నట్లు వైద్యశాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో సోమవారం టీకా వేసుకున్న వారేవరికి ఆదివారం రాత్రి వరకు మెసెజ్‌లకు వెళ్లకపోవడం గమనార్హం. అయితే ముందస్తు జాగ్రత్తతో రాష్ట్ర వైద్యశాఖ మ్యాన్‌వల్‌గానూ వివరాలు సేకరించడంతో ఆ కేంద్రంలో వ్యాక్సిన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక కేంద్రాల్లో ఇవే సమస్యలు తలెత్తాయి. గాంధీ ఆసుపత్రిలో సోమవారం 200 మందికి టీకా వేయాలని లక్షం పెట్టుకోగా, కేవలం 24 మందికి మాత్రమే వేశారు. మరోవైపు గాంధీలో రిజిస్ట్రర్ అయిన లబ్ధిదారులెవరూ రాకపోవడంతో కొన్ని టీకా వయల్స్ మూతలు తీసి 4 గంటలకు పైగా ఉన్నట్లు సమాచారం. వాస్తవంగా మనకు వచ్చిన వయల్స్ ఆరు నెలల ఎక్స్‌ఫైర్ డేట్‌తో రాగా, మూత తెరిస్తే కేవలం 4 గంటల్లోపూ ఎక్స్‌ఫైర్ అవుతుంది.
నాలుగైదు రోజుల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ…
మరో నాలుగు రోజుల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ చేసేందుకు వైద్యశాఖ ప్లాన్ చేసింది. ఈమేరకు మరో నాలుగు రోజుల్లో మన రాష్ట్రానికి 4 లక్షల డోసులు రానున్నట్లు ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఈనెల 22వ తేది వరకు పోలీస్, శానిటేషన్, మున్సిపల్, శానిటేషన్ వర్కర్ల వివరాలను కొవిన్‌లో ఎంట్రీ చేస్తామని అధికారులు అంటున్నారు.
రేపట్నుంచి బులిటెన్ రూపంలో వ్యాక్సిన్ అప్టేట్స్…
రాష్ట్రంలో కరోనా బులిటెన్ రూపంలోనే మంగళవారం నుంచి వైద్యశాఖ వ్యాక్సిన్ నివేదికను విడుదల చేయనుంది. ప్రజలకు జాగ్రత్తలతో పాటు, టీకా పొందిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితులు, ఏ జిల్లాలకు చెందిన వారు, ఇప్పటి వరకు ఎంత శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు, అనే వివరాలను ఆ నివేదికలో పొందుపరచనున్నట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

1 lakh vaccine distribution across Telangana Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News