Sunday, May 12, 2024

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నిధులివ్వాలి

- Advertisement -
- Advertisement -

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నిధులివ్వాలి

2020-21 సంవత్సరానికి ఆర్థిక సంఘం సిఫారసులు అమలు చేయనందున తెలంగాణ రూ. 723 కోట్లు నష్టపోయింది
ఆ సొమ్మును వెంటనే విడుదల చేయాలి
ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను యథాతథంగా ప్రతి ఏడాది మంజూరు చేయాలి
కేంద్రం వసూలు చేస్తున్న సెస్సు, సర్‌చార్జీలను పన్నుల వాటాలో కలపడం లేదు
వాటిని రద్దు చేసి పన్ను రేట్లను పెంచి రాష్ట్రాలకు అదనంగా నిధులు వచ్చేలా చేయాలి
జిఎస్‌టిలో రెండు శాతం అదనపు రుణాలకు అవకాశం కల్పించాలి
రాష్ట్రాల్లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించాలి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో వీడియో
సదస్సులో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంసీహెచ్‌ఆర్డీ నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమావేశంలో పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను బడ్టెట్‌లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయడం సంప్రదాయంగా వస్తోందని, అందులో కొన్నింటిని కేంద్రం అంగీకరించలేదని హరీష్‌రావు పేర్కొన్నారు. తద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ విషయంలో చేసిన సిఫారసు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్టం రూ.723 కోట్లు నష్టపోయిందని, దీనిని వెంటనే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇవ్వాలని చేసిన సిఫారసులను కేంద్రం యధాతధంగా ప్రతి ఏడాది అమలు చేయాలన్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల విషయంలో చేసే సిఫారసులను అమలు చేసే ఈ సంప్రదాయాన్ని తదుపరి బడ్జెట్‌లలో కొనసాగించాలన్నారు.
గడచిన ఏడాది, ఈ సంవత్సరం కలిపి రూ. 900 కోట్లు
కేంద్రం వసూలు చేస్తోన్న సెస్, సర్ ఛార్జీ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కలపకపోవడం వల్ల రాష్ట్రాలు
ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. అటువంటి సెస్, సర్ ఛార్జీలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల రేట్లను పెంచి రాష్ట్రాలకు అధికంగా నిధులు వచ్చే విధంగా చేయాలన్నారు. కొవిడ్ కారణంగా రాష్ట్రాలకు జీఎస్టీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునే వెసలుబాటు కల్పించాలన్నారు. రాష్ట్రాల్లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించాల్సి ఉందని, ఈ వెసులుబాటును 2021-, 22 సంవత్సరానికి ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం అందించాల్సి ఉందన్నారు. గడచిన ఏడాది, ఈ సంవత్సరం కలిపి రూ. 900 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సాయాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించాలని మంత్రి హరీష్‌రావు విజ్ణప్తి చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశమంతటా ఉచితంగా పంపిణీ చేయాలి
మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకం యాభై శాతం జిల్లాలకు మాత్రమే కేంద్రం వర్తింపజేస్తోందని, గత బడ్జెట్ ప్రసంగంలో గౌరవ ఆర్థిక మంత్రి వంద శాతం జిల్లాలకు ఈ రాయితీ విస్తరిస్తామని హమీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా వడ్డీ రాయితీ పథకాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేసి, ఇప్పటి వరకు విడుదల చేయాల్సిన బకాయిల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. బీహార్‌లో ప్రకటించిన విధంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను దేశమంతటా ఉచితంగా పంపిణీ చేయాలని, వికలాంగులు, వృద్ధులకు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏళ్ల నుంచి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఎన్‌ఎస్‌ఏపీ పథకం కింద సాయం అందిస్తుందని, ఈ సాయాన్ని కనీసం వేయి రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జిఆర్‌రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Nirmala Sitharaman video conference with state ministers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News