Tuesday, April 30, 2024

మోర్బీ బ్రిడ్జ్ బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారం : గుజరాత్ హైకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్‌లో గత ఏడాది మోర్బీ బ్రిడ్జి కూలిన సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వంతున నాలుగు వారాల్లోగా చెల్లించాలని ఒరేవా గ్రూపునకు బుధవారం గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమోటాగా ఈ కేసు విచారణను స్వీకరించిన కోర్టు మంగళవారం విచారిస్తున్న సమయంలో అజంతా మ్యాన్యుఫేక్చరింగ్ సంస్థ (ఒరేవా గ్రూప్)ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్షవంతున తాత్కాలిక ఆర్థిక సాయం కింద ప్రకటించింది. అయితే ఇది చాలదని, కంపెనీ తప్పనిసరిగా మృతుల కుటుంబీకుల్లో ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు వంతున సాయం అందించాలని కోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వుల్లో కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంతవరకు బాధితులకు రూ.10 లక్షల వంతున నష్టపరిహారం అందించినట్టు వివరించింది.

బాధితుల తరఫున కోర్టులో వాదించిన అడ్వకేట్ కె.ఆర్. కోష్తి అనేక కుటుంబాలు తమను పోషించే దిక్కును కోల్పోయాయని, ఆయా కుటుంబాల పిల్లలు, మహిళలు తమంత తాము పోషించుకోవలసి వస్తోందని వివరించారు. దీనిపై కోర్టు ప్రమాదం వల్ల అనాధలైన ఏడుగురు పిల్లల బాధ్యత వహించాలని ఉత్తర్వులో సూచించింది. వారు తమ కాళ్లపై తాము నిలబడేవరకు వారి చదువులకు ఖర్చు పెట్టాలని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సూచించింది. ఒరేవా గ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫాక్చరింగ్ లిమిటెడ్ సంస్థ ఆ బ్రిడ్జిని అజమాయిషీ చేస్తోంది. బ్రిటిష్ కాలంలో మచ్చూ నదిపై నిర్మించిన ఆ సస్పెన్షన్ బ్రిడ్జి గత ఏడాది అక్టోబర్ 30న కూలిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సోనియా గోకాని, జస్టిస్ సందీప్ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్రిడ్జి అజమాయిషీలో లోపాలు ఉన్నాయని , సరైన సమయంలో రిపేర్లు చేయలేదని ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిట్ తన రిపోర్టులో పేర్కొంది. బ్రిడ్జి కూలిపోయిన ప్రమాదంలో సుమారు 135 మంది మరణించారు. 56 మంది గాయపడ్డారు. ఒరేవా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ జయ్‌సుఖ్ పటేల్‌ను జనవరి 31న అరెస్టు చేశారు. గుజరాత్ లోని కోర్టు ముందు ఆయన సరెండర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News