Saturday, May 4, 2024

11 మంది హరితమ్మలకు రూ 10కోట్ల లాటరీ

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళలో చెత్త ఏరివేసే పారిశుద్ధ మహిళా కార్మికులకు రూ పదికోట్ల లాటరీ తగిలింది. 11 మందితో కూడిన ఈ లక్ష్మికళల ఆడవారి బృందం మొత్తం కలిపి రూ 250 పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌తో వీరి బతుకు మలుపు తిరిగింది. వీధుల్లో తిరుగుతూ వ్యర్థాలను శుభ్రం చేసే వీరికి విధి తనదైన రీతిలో ఆదరించినట్లు అయింది. కష్టం అయినా నష్టం అయినా కలిసికట్టుగా పంచుకునే వీరు అంతా కలిసి రెండువందల యాభై రూపాయలు పోగు చేసుకుని ఈ టికెట్ కొన్నారు. జాక్‌పాట్ కొట్టేశారు. కేరళలోని మల్లాప్పురం ప్రాంతంలోని పరప్పనన్‌గడి మున్సిపాల్టీలో ఈ మహిళలు హరిత కార్మిక సేన (హెచ్‌కెఎస్) సభ్యులుగా ఉన్నారు. వానావందురు, ఎండా చలి లెక్కచేయకుండా వీరు పట్టణంలోని ఇళ్ల నుంచి తీసి వేసుకుని వెళ్లడం తమ జీవనాధారం చేసుకున్నారు.

మున్సిపాల్టీ పరిధిలో 57 మంది సభ్యులతో ఈ సేన పనిచేస్తోంది. ఇందులో కష్టాలు సుఖాలు కలిసి తెలియచేసుకునే ఈ 11 మంది బృందం గత రెండున్నర ఏళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తూ ఉంది. తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ వీరు ఇతరులు ఎవరూ చేయనంతగా ఎవరికి తీసిపోని విధంగా పర్యావరణ హితంలో తాము సైతం అనే రీతిలో పనిచేస్తున్నారు. వీరిని పనిదేవత జీవనాధారంతో ఆదుకోగా, పనిలో పనిగా వీరిని ఇప్పుడు అదృష్టదేవత తలుపుతట్టింది. వీరు ఎంతకూ నమ్మలేనంత రీతిలో పట్టలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ మహిళలు తలో పాతిక రూపాయలు తమవికావనుకుని రూ 250 పోగుచేసుకుని ఈ వానాకాలపు బంపర్ టికెటు కొన్నారు. వీరి టికెట్‌కు లాటరీ తగిలింది. తాము అంతా కోటీశ్వరీలమవుతున్నప్పటికీ తమ జట్టు పయనం ఆగదని, ఇక ముందు కూడా ఇదే విధంగా ఈ తాము నమ్మిన తమ ‘చెత్త’ వృత్తిలోనే కొనసాగుతామని వీరంతా కలిసికట్టుగా తెలిపారు.

లాటరీ విజేత బృందం తమ టికెటును సమిష్టిగా తీసుకువెళ్లి స్థానిక పంజాబ్ బ్యాంకుకు తీసుకువెళ్లారు. డబ్బు డిపాజిట్‌కు రంగం సిద్ధం అయింది. లక్కు అనేది ఈ విధంగా అత్యంత అర్హులైన వారికి వచ్చి దక్కిందని స్థానిక మున్సిపల్ ఛైర్మన్ ఉస్మాన్ తమ ఆనందం వ్యక్తం చేశారు. కలిసివచ్చిన అదృష్టంతో తమకు దక్కే డబ్బును ఈ మహిళలు తమదైన రీతిలో సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. చక్కటి ఇల్లు, పిల్లలకు సరైన విద్య, అప్పులు తీర్చేయడం చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News