Sunday, May 5, 2024

కొత్తగా 119 బిసి గురుకుల జూనియర్ కళాశాలలు

- Advertisement -
- Advertisement -

కొత్తగా 119 బిసి గురుకుల జూనియర్ కళాశాలలు
టెన్త్ వరకు ఉన్న బిసి గురుకులాలు ఇంటర్‌కు అప్‌గ్రేడ్
దరఖాస్తుకు ఈ నెల 15 వరకు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 119 బిసి గురుకుల జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించిన బిసి గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 12వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపిసి, బైపిసి, ఎంఇసి, హెచ్‌ఇసి, సిఇసి గ్రూపులలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. బిసి గురుకుల సొసైటీ పరిధిలో 68 బాలుర, 70 బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
ప్రవేశ పరీక్షపై సందిగ్దం
బిసి గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నట్లు బిసి గురుకుల సొసైటీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎస్‌సి గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రద్దు చేయగా, బిసి గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కళాశాలల్లో కూడా పదవ తరగతి గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవేశ పరీక్ష నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

119 New BC Gurukul Junior Colleges in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News