Saturday, April 27, 2024

అసోంలో బాల్య వివాహాల నేరం కింద మూడు రోజుల్లో 2278 మంది అరెస్టు!

- Advertisement -
- Advertisement -

గౌహతి: అసోం రాష్ట్రంలో బాల్య వివాహాలపై అక్కడి పోలీసులు మూడో రోజు కూడా దాడులు నిర్వహించారు. ఇప్పటికీ మూడు రోజుల్లో అంటే ఆదివారం నాటికి 2278 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో దాదాపు 4074 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా ఇప్పటి వరకు ఇంత మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. బిశ్వనాథ్‌లో 139 మందిని, బర్పెట్ 130, ధుబ్రీ 126 మందిని అరెస్టు చేసినట్లు వారు తమ ప్రకటనలో తెలిపారు. ఇక బక్సాలో 123 మందిని, బోంగయిగావ్‌లో 117 మందిని, హోజాయ్‌లో 117 మందిని అరెస్టు చేశారు.

అత్యధిక బాల్య వివాహాల ఎఫ్‌ఐఆర్‌లు ధుబ్రిలో నమోదయ్యాయి. ఇదిలావుండగా తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2026 వరకు బాల్యవివాహాల నిరోధక డ్రైవ్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లి వయస్సురాని వారికి పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులను హెచ్చరించి వదిలిపెట్టినట్లు ఆయన చెప్పారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలను పెళ్లాడే వారిని నాన్‌బెయిలబుల్ నేరం కింద బుక్ చేస్తున్నామని, ఇక 14 నుంచి 16 ఏళ్ల వయస్సు అమ్మాయిలను వివాహమాడుతున్నవారిని బెయిలబుల్ సెక్షన్ల కింద బుక్ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలను వివాహమాడేవారిని పోక్సొ చట్టం కింద బుక్ చేసే ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. 14 నుంచి 18 లోపు వయస్సు ఉన్న బాలికలను వివాహమాడేవారిపై బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 కింద కేసును నమోదు చేస్తున్నారు. వారిని అరెస్టు చేయడమే కాదు, వారి వివాహాన్ని కూడా రద్దు చేస్తున్నారు. ఒకవేళ వరుడు 14 ఏళ్ల లోపువాడైతే అతడిని సంస్కరణ గృహానికి పంపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అసోంలో అత్యధిక మాత, శిశు మరణాల రేటు ఉంది. అక్కడ 31 శాతం వివాహాలు నిర్ధారించిన వయస్సుకన్నా తక్కువ వయస్సు ఉన్న వారి బాల్య వివాహాలే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News