Sunday, April 28, 2024

రాష్ట్రంలో అత్యధికంగా 253 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

Six Corona Positive Cases in Boduppal

ఒకే ఫ్యామిలీలో 19 మందికి

జహీరాబాద్‌లో మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి వైరస్

ఎనిమిది మంది మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలోనే 179 మందికి పాజిటివ్
ప్రముఖులకు కొవిడ్ తాకిడి, జనగామ ఎంఎల్‌ఎతో పాటు ఆయన సతీమణి,
గన్‌మన్, వంట మనిషికీ వైరస్, ఎర్రోళ్ల గన్‌మన్‌కు పాజిటివ్, క్వారంటైన్‌కు ఎస్‌సి కమిషన్ చైర్మన్
సెల్ఫ్ క్వారంటైన్‌లో పలువురు ప్రజాప్రతినిధులు
అప్రమత్తమైన కొందరు మంత్రులు, ఎంపిలు
మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండోసారి నెగెటివ్

మన తెలంగాణ/జహీరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు కు భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా శనివారం 253 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. ఇందులో అధికగా జిహెచ్‌ఎంసి పరిధిలో 179 కేసు లు నమోదు కాగా, సంగారెడ్డిలో 24, మేడ్చల్‌లో 14, రంగారెడ్డిలో 11 పాజిటివ్ కేసులు వచ్చినట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు తాజా బులిటెన్‌లో వెల్లడించారు. కేసుల సంఖ్య ప్రతి రోజు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రజలు రాష్ట్రంలో ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రయాణాలు చేస్తున్నారని, ఈ సమయంలో మాస్క్, భౌతిక దూరం పాటించకపోవడంతోనే వైరస్ వేగంగా విస్తరిస్తోందని బులిటెన్‌లో పేర్కొన్నారు.

అదే సమయంలో శనివారం ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతూ చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కొవిడ్ 19 కేసులు 4737 కు చేరుకుంది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 182కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన కేసులు 4288 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, సడలింపుల తరువాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 449 ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2352 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2203 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రజాప్రతినిధులకు పాకిన వైరస్
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ సోకింది. జనగాం ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదిరెడ్డికి పాజిటివ్ రావడంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన సతీమణి, గన్‌మెన్, పనిమనిషికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వారిలో ఎవరిలో లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్ అయ్యారు. అలాగే మంత్రి హరీశ్‌రావు పిఎకు పాజిటివ్ రావడంతో మంత్రితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న అధికారులు, టిఆర్‌ఎస్ శ్రేణులు కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రాం రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హోం క్వారంటైన్ అయ్యారు. ఎస్‌సి కమిషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్‌మెన్‌కు కూడా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దీంతో కమిషన్ కార్యాలయాన్ని వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఛైర్మెన్ కూడా హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. టిమ్స్ సూపరింటెండ్, భువనగిరి జడ్‌పి సిఇఒ దంపతులు, వరంగల్ ప్రజాప్రతినిధులు కూడా క్వారంటైన్‌కు వెళ్లనున్నారు.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తున్నందున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. తమను ప్రత్యక్షంగా కలవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదేనంటూ ఫోన్‌ల ద్వారా తమని, తమ సిబ్బందిని సంప్రదించి ఆయా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రౌండ్ ది క్లాక్ ఫోన్‌లో నిరంతరం అందుబాటులో ఉంటామని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉండగా జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్‌కు రెండో సారి నిర్వహించిన కరోనా పరీక్షలోనూ నెగిటివ్‌గా తేలింది. దీంతో జిహెచ్‌ఎంసి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. డ్యూటీలో ఉన్న బొంతు కారు డ్రైవర్‌కు ఇటీవల పాజిటివ్ రావడంతో ఆయనకు తిరిగి పరీక్షలు జరపాల్సి వచ్చింది.

ఒకే కుంటుంబంలో 19మందికి వైరస్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైర్స్ సోకింది. పట్టణానికి చెందిన ఓ మహిళ (55) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జూన్ 9న ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన రోజు రాత్రే జహీరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం నుంచి సేకరించిన షాంపిల్స్‌కు కోవిడ్ టెస్టులు చేయగా పాజిటివ్ అని రిపోరట్స్ లో తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మృతురాలి కుటుంబీకులు, బంధువులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మందికి కరోనా టెస్టులు చేయ గా 19 మందికి పాజిటివ్ అని శుక్రవారం రాత్రి రిపోర్ట్ వ చ్చింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కరో నా సోకిన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో అంత్యక్రియల్లో పాల్గొన్న దాదాపు 40 మంది వివరాలను సేకరిస్తున్నారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించనున్నారు. కరోనాతో మహిళ మృతి చెందిన ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకలపై నిషేధం విధించారు.

అధికారుల పట్టిపీడిస్తున్న కరోనా
కరోనా మహమ్మారి రాష్ట్రంలోని పలువురు అధికారులను పట్టి పీడిస్తోంది. తాజాగా యాదాద్రి సిఇఒ దంపతులకు వైరస్ సోకింది. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన విధులకు సెలవు పెట్టి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. భార్యకూ జ్వరం రావడంతో ఇద్దరికీ పరీక్షలు చేయగా పాజిటివ్ అని వచ్చింది. సికింద్రాబాద్ లోని రైల్వే డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ కు కరోనా సోకింది.అధికారిణిని పలు సందర్భాల్లో కలిసిన 9 మంది రైల్వే అధికారులను హోం క్వారంటైన్ లో ఉండాలని రైల్వే శాఖ ఆదేశించింది. ఇక కరోనాపై పూర్తి అవగాహన ఉన్న వైద్యుల కూ వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఒక్క ని మ్స్ లోనే 30 మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు, చెస్ట్ హాస్పిటల్ వైద్యులతో సహా ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. శిక్షణ పొందుతున్న ఐపిఎస్ లు, వార్తలు అందిస్తున్న జర్నలిస్టులు కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు వైరస్ సోకడం గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న కేసులను బట్టి అర్థమవుతోంది. రానున్న రోజుల్లో వైరస్ మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం సామాజిక బాధ్యతగా భావించాలని అంటున్నారు. మాస్క్ అసౌకర్యంగా అనిపించినా కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే ధరించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

వైద్యులపై దాడులొద్దు
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు చేయడం మంచి పద్దతి కాదని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసి తెలిపారు. బాధితుల కుటుంబీకులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దన్నారు.

253 New Corona Cases Register in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News