Saturday, April 27, 2024

ఉక్కుపాదం అవసరమా?

- Advertisement -
- Advertisement -

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టాలనే మహా సంకల్పాన్ని భుజాన వేసుకొని ‘యముండ’ అంటూ అరెస్టులకు పాల్పడుతున్నది. ఈ చర్య బయటికి ఎంత ఆదర్శమైనదిగా కనిపిస్తున్నా వాస్తవంలో ఎన్నో కుటుంబాలను చెప్పనలవికాని కష్టాలకు గురి చేస్తున్నది. ముస్లిం మైనారిటీల మీద గురి పెట్టి ఈ అరెస్టులు సాగుతున్నట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి. మూఢాచారాల నిర్మూలన బలప్రయోగంతో సాధ్యమౌతుందా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా మాత్రమే అంతమొందించడం వీలయ్యే ఇటువంటి సామాజిక రుగ్మతలను భయభ్రాంతులను చేసే పోలీసు చర్యల ద్వారా తుదముట్టించగలమనుకోడం భ్రమ. బాల్య వివాహాలపై రాష్ట్ర వ్యాప్త చర్య తీసుకోడానికి నిర్ణయించామని ముఖ్యమంత్రి శర్మ జనవరి 23న ప్రకటించారు. 14 ఏళ్ళ లోపు వయసు బాలికలను పెళ్ళాడిన పురుషులపై పోక్సో చట్టం కింద, 1418 సంవత్సరాల వయసులోని బాలికలను పెళ్ళి చేసుకొన్న వారిపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసులు పెడతామని ప్రకటించారు.

ఈ వివాహాలకు సంబంధించి ఇంత వరకు 4074 కేసులు నమోదయ్యాయని బాధ్యులు 8000 మందిగా తేలిందని వారిలో సగం మందికి హెచ్చరికలతో సరిపుచ్చి మిగతా 4000 మందిని అరెస్టు చేయదలచామని ముఖ్యమంత్రి చెప్పారు. దానితో ఈ నెల 5 నుంచి పోలీసులు విరుచుకుపడ్డారు. ఇంత వరకు 2763 మందిని అరెస్టు చేశారు. ఈ వివాహాలు జరిపిస్తున్న ముల్లాలు, కాజీలు, పూజారుల మీదనే దృష్టి పెట్టి చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి చెప్పి వున్నారు. అయితే అరెస్టు అయిన వారిలో భర్తలు కూడా వున్నారని తెలుస్తున్నది. దాని వల్ల ఆయా కుటుంబాల్లో ఘోర విషాదం చోటు చేసుకొంటున్నది. అరెస్టుకు భయపడి ఇళ్ళు విడిచిపెట్టి పారిపోతున్నారు. భర్తను అరెస్టు చేస్తారనే భయంతో 18 ఏళ్ళ వయసులోని గర్భవతి ఆసుపత్రికి వెళ్ళకుండా ఇంట్లోనే గడిపినందున అకాల మరణానికి గురైంది. చివరి దశలో ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా దుర్మరణం పాలైంది. ఇటువంటి మరెన్ని దారుణోదంతాలు జరిగిపోయాయో నెమ్మదిగాగాని బయట పడవు. వాస్తవానికి అసోంలో బాల్య వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని, కేవలం రాజకీయ స్వప్రయోజన దృష్టితోనే ఈ అరెస్టులు జరుపుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.

అసోంలో బాల్య వివాహాల దురాచారం వున్న మాట వాస్తవమేగాని బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌ల తరాతనే అసోం వుంటుందని వారు అంటున్నారు. అసోంలో 200506లో 38.6 శాతంగా వున్న బాల్య వివాహాలు 201516 నాటికి 33.7 శాతానికి తగ్గాయని, 201920 నాటికి 31.8 శాతానికి పడిపోయాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు చెప్పాయి. 1519 వయసులోని గర్భవతుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో బాల్య వివాహాల సమస్యను వున్నట్టుండి ముందుకు తెచ్చి కొంప మునిగిపోతున్నట్టు అరెస్టులకు పాల్పడడం ఎంత మాత్రం సహేతుకం, సమంజసం కాదు. అసోంలో ముస్లింలు, ఆదివాసీలు, తేయాకు తోటల కార్మికులు, వలస కార్మికుల కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయని చెబుతున్నారు.

ఆడ పిల్లను పోషించడం ఆమెకు తగిన భద్రత కల్పించడం కష్ట సాధ్యం కావడం వల్లనే బాల్య వివాహాలు జరిపిస్తున్నారనేది కాదనలేని ఒక కఠోర వాస్తవం. దారిద్య్రం, చదువుకోకపోడం వంటి సమస్యలు దీని మూలంలో వున్నాయి. అందుచేత ప్రభుత్వాలు బాలికలకు ఉచిత విద్యను అందించడం అనేది అత్యవసరమైన పరిష్కారం. బాలికలను చదివించడం వల్ల చదువు పూర్తి అయ్యేంత వరకు వారికి పెళ్ళి చేయాలన్న యోచన ముందుకు రాదు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగావకాశాలు కలిగి ఆ బాలికలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే స్థితిని పొందుతారు. అసోం ప్రభుత్వం ఈ వైపు దృష్టి పెట్టిన జాడ లేదు. పోషకాహార లేమితో బాధపడుతున్న బాలలు అధిక సంఖ్యలో వున్న మన దేశంలో ఈ సమస్య ముందుగా బాలికలనే బలి తీసుకుంటుంది.

అందుచేత వారికి చదువుతో పాటు తగిన ఆహారం అందించగలిగితే అది వారి పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. తాము మాత్రమే నిర్వర్తించవలసిన ఈ బాధ్యతలను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే గుర్తించడం లేదు. అసోం వంటి చోట్ల అధికారంలో వున్న బిజెపి బాల్య వివాహాలు వంటి సమస్యలను తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోడం విడ్డూరం కాదు. గతంలో పౌరసత్వాన్ని ఒక పెద్ద సమస్యగా చిత్రించి ముస్లింల మీద సునిశిత బాణంగా ఎక్కుపెట్టిన అసోం రాష్ట్రంలో బాల్య వివాహం కూడా రాజకీయ స్వార్థపరత్వానికి సాకుగా వినియోగపడడం విశేషం కాదు. అందుచేత ఉన్నత ఆదర్శాన్ని అమలు చేస్తున్నామనే పేరిట సాగే అరెస్టు, ఇతర నిర్బంధకాండ తప్పనిసరిగా ఖండించదగినవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News