Wednesday, May 15, 2024

ప్లిస్కోవాకు జెలెనా షాక్

- Advertisement -
- Advertisement -

ప్లిస్కోవాకు జెలెనా షాక్
మూడో రౌండ్‌లో ఒస్టాపెంకో, జకోవిచ్, కెనిన్, దిమిత్రోవ్ ముందుకు

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితం నమోదైంది. రెండో కరోలినా ప్లిస్కోవా (చెక్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. లాత్వియాకు చెందిన మాజీ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకోతో జరిగిన మ్యాచ్‌లో ప్లిస్కోవా ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), 18వ సీడ్ గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా) తదితరులు రెండో రౌండ్‌లో విజయం సాధించారు. కాగా తొమ్మిదో సీడ్ డానిల్ షపావలోవ్ (కెనడా) రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. మహిళల విభాగంలో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా), ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇక ఒస్టాపెంకోతో జరిగిన రెండో రౌండ్‌లో ప్లిస్కోవా ఓటమి చవిచూసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన ఒస్టాపెంకో ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడైన ఆటతో విజృంభించిన ఒస్టాపెంకో 64, 62తో విజయం సాధించింది.

మరోవైపు క్విటోవా కూడా అలవోక విజయంతో మూడో రౌండ్‌కు చేరుకుంది. ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్‌తో జరిగిన పోరులో క్విటోవా జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన క్విటోవా 63, 63తో జయభేరి మోగించింది. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిన క్విటోవా ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కెనిన్ విజయం సాధించింది. రుమేనియా క్రీడాకారిణి అన్నా బొగ్డాన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో కెనిన్ 36, 63, 62తో గెలుపొందింది. తొలి సెట్‌లో కెనిన్‌కు షాక్ తగిలింది. బొగ్డాన్ అద్భుత ఆటతో సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత చెలరేగి ఆడిన కెనిన్ వరుసగా రెండు సెట్‌లు గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుంది. 8వ సీడ్ అరినా సబాలెంకా (బెలారస్) కూడా మూడో రౌండ్‌లో ప్రవేశించింది. రష్యా క్రీడాకారిణి డారియా కటాస్కినాతో జరిగిన మ్యాచ్‌లో సబాలెంకా 76, 60తో జయభేరి మోగించింది.
నొవాక్ అలవోకగా
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. లిథువేనియా ఆటగాడు బెరాన్‌కిస్‌తో జరిగిన పోరులో జకోవిచ్ 61, 62,62తో విజయం సాధించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన జకోవిచ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో దిమిత్రోవ్ జయకేతనం ఎగుర వేశాడు. రష్యా ఆటగాడు అండ్రెజ్ మార్టిన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో దిమిత్రోవ్ 64, 76, 61తో గెలుపొందాడు. ఇతర పోటీల్లో బుస్టా (స్పెయిన్), 15వ సీడ్ కచనోవ్ (రష్యా) విజయం సాధించారు. కాగా, తొమ్మిదో సీడ్ డానిల్ ఇంటిదారి పట్టాడు. స్పెయిన్ ఆటగాడు రొబెర్టొ చేతిలో డానిల్ కంగుతిన్నాడు.

2nd Seed Pliskova out from French Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News