Sunday, May 5, 2024

ఆరు నెలల తరువాత సురక్షితంగా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ /జియుక్వాన్ : చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ఆరునెలల పాటు పాలుపంచుకున్న ముగ్గురు వ్యోమగాములు ఆదివారం తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. షెంఝో 15 వ్యోమనౌకలో వ్యోమగాములు ఫెయి జున్‌లాంగ్, డెంగ్ క్వింగ్‌మింగ్, ఝాంగ్ లూ ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.33 గంటలకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ ముగ్గురు వ్యోమగాములు నవంబర్ 29న షెన్‌జౌ 15 వ్యోమనౌకలో అంతరిక్షపరిశోధన కేంద్రానికి వెళ్లారు. వీరి అంతరిక్ష మిషన్ విజయవంతమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్‌ఎ) ప్రకటించింది.

ఈ ముగ్గురు ఆరోగ్యం గానే ఉన్నారని ఏజెన్సీ ప్రకటించింది. సురక్షితంగా చేరుకున్నాక వీరిని ఒక విమానంలో బీజింగ్ తీసుకువచ్చి క్వారంటైన్‌లో వైద్య పరీక్షలు చేశారు. వీరి స్థానంలో బయలు దేరి మే 30న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములకు వీరు వీడ్కోలు పలికి బయలుదేరారు. అంతరిక్షకేంద్రంలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు కొత్త వ్యోమగాములు ఐదు నెలల పాటు అక్కడ ఉంటారు. చైనా అంతరిక్ష కేంద్రం పూర్తిగా సిద్ధమైతే రష్యా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్) మాదిరిగా చైనాకు కూడా సొంత అంతరిక్షకేంద్రం అందుబాటు లోకి వస్తుంది. రష్యా ఐఎస్‌ఎస్ 2030 నాటికి నిరుపయోగమౌతుందని చెబుతున్నారు.

తమకు అప్పగించిన బాధ్యతలు సమర్ధంగా నెరవేర్చామని, మాతృభూమికి తిరిగి రావడం ఆనందంగా ఉందని మిషన్ కమాండర్ ఫెయిజున్ లాంగ్ చెప్పారు. చైనా 2005 అక్టోబర్‌లో షెంజో 6 వ్యోమనౌక ద్వారా చేపట్టిన తన రెండో అంతరిక్షమిషన్ లో కూడా ఫెయిజున్ లాంగ్ పాల్గొన్నారు. వ్యోమగామి డెంగ్ 25 ఏళ్ల ప్రిపరేషన్ తరువాత అంతరిక్షం లోకి వెళ్లడానికి అవకాశం లభించింది. తానెప్పుడూ కలల్లోని శక్తిని , పట్టుదలను నమ్ముతానని డెంగ్ పేర్కొన్నారు. నా వయసెంత అన్నది ప్రధానం కాదని, దేశానికి అవసరమైనందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. మరో వ్యోమగామి ఝాంగ్ ఉద్వేగానికి గురయ్యారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు తన మాతృభూమిని , స్వంత నగరాన్ని కిటికీ లోంచి చూడడానికి ప్రయత్నించేవాడినని తన అనుభూతి వివరించారు.

కక్ష్య లోనే స్వయం ఆరోగ్య పరీక్ష
ఈ ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు తమ ఆరోగ్యాన్ని తామే పర్యవేక్షించుకునే ప్రయోగాలను నెరవేర్చుకోవడం ప్రపంచం లోనే మొట్టమొదటిసారి, చైనా స్వయంగా అభివృద్ధి చేసిన టుఫోటాన్ మైక్రోస్కోప్ సాయంతో తమ చర్మకణాల తాలూకు 3 డి ఇమేజెస్‌ను పొందగలిగారు. ఈ విధమైన కక్ష అంతర పరిశీలన ప్రయోగాలు నిర్వహించడం కక్షలో ఉండే వ్యోమగాముల వైద్య పరీక్షలకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అదే విధంగా మెంగ్షియన్ స్పేస్ ల్యాబ్‌లో జ్వలన పరీక్ష విజయవంతంగా చేయగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News