Monday, April 29, 2024

అద్భుత ఘటన.. 40 రోజులు అమెజాన్ అడవుల్లో చిన్నారుల జీవన్మరణ పోరాటం

- Advertisement -
- Advertisement -

బొగొట: దక్షిణ అమెరికాలోని కొలంబియా ప్రాంతపు దట్టమైన అమెజాన్ అడవులలో అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించే అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. 40 రోజుల క్రితం జరిగిన ఓ విమాన ప్రమాదంలో బతికిబయట పడ్డ నలుగురు పిల్లలను సైనికులు ఇప్పుడు సజీవంగా కనుగొన్నారు. ఈ కొలంబియా పిల్లలు తిరిగి దొరకడం దేశమంతటా పండుగకు దారితీసింది. ఇప్పుడు తిరిగి క్షేమంగా కనుగొన్న పిల్లల్లో ఓ 11 నెలల పసిబిడ్డ కూడా ఉండటం అందరిని అబ్బురపర్చింది. తరచూ వానలు పడే అమెజాన్ అటవీ ప్రాంతంలో గల్లంతు అయిన నలుగురు పిల్లలు కేవలం 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ. ఈ ప్రాంతంలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి ఓ కుటుంబం మే 1వ తేదీన తమ ఫ్యామిలీ ప్రైవేటు విమానంలో బయలుదేరింది.

ఈ క్రమంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ సింగిల్ ఇంజిన్ సెసినా విమానంలో పిల్లలు వారి తల్లి, గైడ్, పైలట్ ఉన్నారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం కూలిపోతూ రాడార్ నుంచి అదృశ్యం అయింది. దీనితో వీరికోసం ఆపరేషన్ హోప్ పేరిట 150 మంది సైనికులతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తల్లి, పైలట్, గైడ్‌ల శవాలు దొరికాయి. కానీ పిల్లల జాడ తెలియలేదు. క్రూరమృగాలు, భయానక వాతావరణ పరిస్థితులు ఉండే అడవులలో పిల్లల కోసం భారీ స్థాయిలో గాలింపులు జరిగాయి. ఇక వీరి జాడపై నమ్మకాలు సడలుతున్న సమయంలో సైనికులకు ఈ చిన్నారులు కన్పించారు. 40 రోజుల పాటు ఈ పిల్లలు అడవులలో తిరిగాల్సి వచ్చింది. 11 నెలల తమ తోటి పసికందును మిగిలిన ముగ్గురు కాపాడుతూ వచ్చారు. గాలింపుల దశలో హెలికాప్టర్లలో సైన్యం పలు ప్రాంతాలలో ఆహార పొట్లాలు, పాలు, నీటి బాటిల్స్, దుప్పట్లు జారవిడుస్తూ రావడంతో పిల్లలు వీటిని సేకరించుకుంటూ, అడవి మృగాలు, పాముల నుంచి కాపాడుకుంటూ వచ్చారు.

వీరు ఇన్నిరోజులు ఈ అడవులలో సజీవంగా ఉండటం ఓ విచిత్రం అని సైనిక సిబ్బంది తెలిపింది. పిల్లలున్న చోటికి సైనిక పటాలం చేరి, వారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ చిరంజీవులను ఇక్కడి అడవులే రక్షించాయి. వీరు తమ దేశానికి చెందిన అడవిబిడ్డలు, ఈ కొలంబియాకు నిజమైన వారసులు అని కొలంబియా ప్రెసిడెంట్ గుస్టవో పెట్రో తెలిపారు. వీరు తిరిగి దక్కడం తమకు పర్వదినం అని దేశవ్యాప్తంగా జనం కేరింతలు కొట్టారు. ఈ పిల్లలు తమలోని చిన్నారికి పాలు పడుతూ ఆమె ఎడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గడిపిన తీరు, రాత్రి పూట ఎటువంటి భయానికి గురి కాకుండా గడపటం ఇవన్నీ కూడా కొలంబియాలో ఇప్పుడు అంతా మాట్లాడుకునే విషయాలు అయ్యాయి. తమ ప్రయత్నాలు ఫలించాయని, ఇది యుద్ధంలో గెలిచిన తరువాతి విజయం కన్నా గొప్పదని సైనిక వర్గాలు స్పందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News