Saturday, May 11, 2024

నేపాల్ లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్ : హిమాలయ పర్వత శ్రేణుల్లోని పశ్చిమనేపాల్ దోతీ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున 2.12 గంటల ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి ఇంతవరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు అని డీఎస్‌పి భోలా భట్టా వివరించారు. దోతీ జిల్లా లోని ఖప్టాడ్ నేషనల్ పార్కు సమీపాన భూకంపం 10 అడుగుల లోతులో కేంద్రీ కృతమైందని నేషనల్ సెయిస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. అంతకు ముందు రెండుసార్లు ఆ ప్రాంతంలో భూమి కంపించింది. మంగళవారం రాత్రి 9.07 గంటల ప్రాంతంలో 5.7 తీవ్రతతో ఒకసారి,9.56 గంటల ప్రాంతంలో 4.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తెల్లవారు జామున భూకంపం సంభవించినప్పుడు ఆ ఆరుగురు తమ ఇళ్లల్లో నిద్రిస్తున్నారు. భూకంపానికి ఎనిమిది ఇళ్లు కూలిపోడంతో వీరు చనిపోయారని నేపాల్ హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర పొఖరెల్ వెల్లడించారు.

పుర్విచౌక్ ప్రాంతంలో మరో ముగ్గురు గల్లంతయ్యారని, బహుశా కూలిపోయిన ఇళ్ల శిధిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ పేర్కొన్నారు. జాడ తెలియని వారి కోసం నేపాల్ ఆర్మీ గాలిస్తోంది. భూకంప కేంద్రానికి 160 కిమీ దూరంలో ధంగాధి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేబా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నేపాల్‌లో పార్లమెంట్‌కు , అసెంబ్లీకి నవంబర్ 20 న ఎన్నికలు జరగనున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని దేబా సంతాపం తెలిపారు. గాయపడిన వారికి వెంటనే ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని దోతీ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. నేపాల్ ఆర్మీ, పోలీస్‌సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.బాధితులకు అత్యవసరంగా కావలసిన ఆహారం, శిబిరాలు ఆర్మీ సమకూరుస్తోంది.

ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ల్లో భారీ ప్రకంపనలు
మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో ఢిల్లీలో కూడా 6.3 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్ ప్రాంతాల్లో పది సెకండ్ల పాటు ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఏం జరుగుతోందో తెలియక ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి చేరుకున్నారు. ఉత్తరాఖండ్ పితోర్‌ఘడ్ కేంద్రంగా బుధవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూమి కంపించిందని భూకంప పరిశీలన కేంద్రం వెల్లడించింది. భూ ప్రకంపనలు చోటు చేసుకున్న అరగంట లోపే ఈ అంశం ట్విటర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దాదాపు 20 వేల ట్వీట్లు చేశారు.

6 killed after Earthquake hits Nepal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News