Thursday, May 2, 2024

విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

- Advertisement -
- Advertisement -

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య
ఇద్దరు మహిళా మావోలు మృతి
అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట
హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీసుస్టేషన్ పరిధిలోని తీర మెట్ల ప్రాంతం గోధుమలంక గూడెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున మావోయిస్టు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈక్రమంలో మృతుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సందె గంగయ్య ఉన్నట్లు పోలీసులు అధికారులు ధృవీకరించారు. కాగా ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు సైతం ఉన్నారని తెలియడంతో గ్రేహౌండ్స్, పోలీసులు హెలీకాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే… గోధుమలంక గూడెం మంప అటవీ ప్రాంతంలో 30 మంది వరకు మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో అలర్ట్ అయిన మావోయిస్టులు వెంటనే పోలీసులపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఎన్ కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టులలో కీలక నేత సందె గంగయ్య అలియాస్ అశోక్ డిసిఎం కేడర్ స్థాయి నాయకుడు మృతి చెందాడు.
రాజమౌళి సోదరుడు సందె గంగయ్య
ఒకప్పటి పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ జోన్ కమిటీ కార్యదర్శి సందె రాజమౌళి ప్రసాద్‌కు సోదరుడు (పెద్దనాన్న కుమారుడు) సందె గంగయ్య విశాఖ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన రాజమౌళి గతంలో జరిగిన ఓ ఎన్ కౌంటర్‌లో మరణించిన విషయం విదితమే. అదేవిధంగా సందె గంగయ్య సోదరుడు ఒకరు కూడా పీపుల్స్ వార్‌లో పని చేసి ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తాజాగా జరిగిన ఫైరింగ్‌లో గంగయ్యతో పాటుగా రణధీర్, సంతు హతమయ్యారు. వీరిద్దరూ కూడా పెద్ద కేడర్‌లో వారేనని సమాచారం. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మహిళా మావోయిస్టులను లలిత, పాయకెగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో ఘటనా స్ధలంలో ఎకె 47 తుపాకీ సహా, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక కార్బన్, 303 తుపాకులు మూడు లభించాయి. మరోవైపు మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో పోలీసు వర్గాలు అప్రమత్తం కావడంతో పాటు అదనపు బలగాలను తరలించి కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి.

Encounter in Visakhapatnam
అగ్రనేతల కోసం వేట:

మంప పోలీసుస్టేషన్ పరిధిలోని తీర మెట్ల ప్రాంతం గోధుమలంక గూడెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున మావోయిస్టు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల సమయంలో అగ్రనేతలు అక్కడే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోధుమలంక అటవీ ప్రాంతంలో దాదాపు 30 మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచరం మేరకు మంగళవారం రాత్రికే అక్కడికి గ్రౌహౌండ్స్ బలగాలు చేరుకున్నాయి. ఈక్రమంలో సమాచారం అందుకున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు గ్రౌహౌండ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అగ్రనేతల ఆచూకీ కోసం హెలీకాఫ్టర్‌లతో పాటు డ్రోన్ కెమెరాల సాయంతో వేట సాగిస్తున్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ముగ్గరిని పోలీసులు రహస్యంగా వైద్య సేవలందిస్తున్నట్లు తెలియవచ్చింది.
పోలీసుల ప్రకటన ః
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కి సంబంధించి విశాఖ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు ఫైరింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారని ప్రకటించారు. మృతులను రణదేవ్, డాక్టర్ అశోక్, సంతు, లలిత, పాయక్‌గా గుర్తించామని మరొక మహిళ మావోయిస్టు వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఫైరింగ్‌లో చాలామంది గాయపడినట్లు సమాచారం ఉందన్నారు.

6 Maoists killed in Encounter in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News