Sunday, April 28, 2024

ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

709 Indian students repatriated from Ukraine

మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన మొదటి విమానంలో 219 మంది ముంబైకు శనివారం సాయంత్రం చేరుకోగా రెండో విమానంలో 250 మంది ఆదివారం తెల్లవారు జాము 2.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 709 మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడం శనివారం నుంచి ప్రారంభమైంది. ఆదివారం ఢిల్లీ విమానాశ్రయానికి మూడో విమానం చేరగానే కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విద్యార్థులందరికీ గులాబీలు అందించి స్వాగతం పలికారు. “మీరంతా చాలా కష్ట సమయంలో ఉన్నారని నాకు తెలుసు. ఈ కష్టకాలంలో మీరు వేసే ప్రతి అడుగుతో ప్రదాని మోడీతో పాటు 130 కోట్ల భారతీయులు ఉన్నారని తెలుసుకోండి” అని జ్యోతిరాదిత్య తిరిగివచ్చిన విద్యార్థులకు దైర్యం చెప్పారు.

ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీతో మన ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని, అక్కడ చిక్కుకుపోయిన ప్రతి భారతీయ విద్యార్థి స్వదేశానికి క్షేమంగా వస్తారని ఆయన తెలిపారు. రష్యా ప్రభుత్వంతో కూడా చర్చిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై విద్యార్థుల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. మహారాష్ట్ర లోని సోలాపూర్‌కు చెందిన సురియా సుభాష్, కేరళ లోని తిరువనంతపురంకు చెందిన విపిన్ యాద్, తదితరులు తాము ఉక్రెయిన్ రొమేనియా సరిహద్దుల్లో శుక్రవారం 12 గంటల పాటు నిరీక్షించవలసి వచ్చిందని, అక్కడ చిక్కుకున్నవారి పరిస్థితి చాలా దీనంగా ఉందని వివరించారు. తమను అక్కడ నుంచి తమ ప్రాణాలను భారత ప్రభుత్వం కాపాడిందని వారు కృతజ్ఞతలు తెలియచేశారు. తిరిగి వచ్చిన వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ కు చెందిన విద్యార్ధులు ఉన్నారు. స్వదేశానికి చేరుకోవడం సంతోషంగానే ఉన్నా తమ చదువుల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని వారు కలవరం చెందుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News