Monday, May 6, 2024

దేశ జనాభాలో 88 శాతం ఆదాయం నెలకు రూ.25 వేల లోపే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురు సభ్యులుండే ఒక కుటుంబం రెండు పూటలా కడుపునిండా తిని జీవించాలంటే కనీసం నెలకు పాతికవేల రూపాయలు అవసరం అవుతాయి. కానీ దేశ జనాభాలో ఎంతమంది నెలకు అంత సంపాదిస్తున్నారంటే చెప్పడం కష్టమే. ప్రభుత్వ లెక్కలకు, వాస్తవానికి పొంతన ఉండదనేది జగద్విదితం. రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారమే దేశ జనాభాలో 38.6 శాతం మంది ఏడాదికి లక్ష రూపాయలు, అంతకన్నా తక్కువ ఆదాయంలో జీవిస్తున్నారు. అంటే నెలకు సగటున రూ.8,333 ఆదాయంతో వీరంతా బతుకు బండిని ఈడుస్తున్నారు. ఇంత తక్కువ ఆదాయంతో వారు కనీసం రెండు పూటలా కడుపునిండా తిండి తినడం కూడా కష్టమేనని ఎవరికైనా అర్థమవుతుంది. ఇక లక్షనుంచి మూడు లక్షల రూపాయలు అంటే నెలకు రూ.25 వేలు ఆదాయం ఉండే వారి సంఖ్య 49 శాతంగా ఉంది. వీరంతా కూడా అల్పాదాయ వర్గాల కిందికే వస్తారు. ఇక మూడు నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండే వారి సంఖ్య కేవలం 8.5 శాతం మందే ఉన్నారు.

వీరి ఆదాయం నెలకు సగటున రూ.41 వేలు. వీరిని దిగువ మధ్య తరగతి వర్గంగా భావించవచ్చు. ఇక ఐదు లక్షలు అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉండే వారే దేశ జనాభాలో 4 శాతం మంది మాత్రమే ఉన్నారు. అంటే వీరంతా మధ్య ఆదాయ వర్గం కిందికి వస్తారు. ఈ ఆర్‌బిఐ సర్వే ప్రకారం దేశ జనాభాలో 88 శాతం మంది నెలకు రూ.25 వేల లోపు ఆదాయంతోనే జీవితాలు నెట్టుకు వస్తున్నారు. ఇక దేశ జనాభాలో వేతన జీవులు దాదాపుగా 28 శాతం మంది ఉంటే స్వయం ఉపాధి పొందే వారు లేదా సొంత వ్యాపారాలు చేసుకునే వారు, రోజు వారీ కూలీలు దాదాపు 30 శాతం ఉన్నారు. వీరంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం తమ హయాంలో దేశంలో పేదరికం తగ్గిపోయిందని, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని గొప్పలు చెప్పుకొంటోంది. ప్రభుత్వం మాటలు నిజమా, ఆర్‌బిఐ సర్వే నిజమా అనేది దేశంలోని సామాన్య జనాన్ని అడిగితే తెలుస్తుంది. కేవలం 4 శాతం ఉండే సంపన్నుల సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందినట్లవుతుందా అని వారు ప్రశ్నిస్తూనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News