ఎటిపి టీమ్
చాంపియన్ సెర్బియా
సిడ్నీ: మాజీ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ అద్భుతంగా రాణించి తమ దేశం సెర్బియాకు తొలి ఎటిపి టీమ్ చాంపియన్‌షిప్‌ను అందించాడు. ఆదివారం ఇక్కడ స్పెయిన్‌తో జరిగిన ఫైనల్లో జకోవిచ్ తన చిరకాల ప్రత్యర్థి స్పానిష్ బుల్ రఫాల్ నాదల్‌ను సింగిల్స్‌లో చిత్తు చేయడంతో పాటు ఆ తర్వాత డబుల్స్‌లో ట్రోయిక్కీతో కలిసి స్పానిష్ జంట పాబ్లో కారెనో బుస్టా, ఫెలిసియానో లోపెజ్ జోడీని చిత్తు చేసి సెర్బియాకు కప్ అందించాడు. తొలుత జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన రాబర్టో బటిస్టా అగట్ సెర్బియాకు చెందిన దుసాప్ లజోవిక్‌ను 7 5, 6 1 స్కోరుతో ఓడించి తమ దేశానికి ఆధిక్యత సాధించి పెట్టాడు.
అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో జకోవిచ్ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు నాదల్‌ను 6 2, 7 6 స్కోరుతో ఓడించి స్కోరును సమం చేశాడు. అనంతరం జరిగిన నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో జకోవిచ్, ట్రోయిక్కీ జోడీ, స్పానిష్ జోడీపై 6 3, 6 4స్కోరుతో విజయం సాధించడంతో కప్ సెర్బియా పరం అయింది. అన్నిటికన్నా మించి నాదల్‌పై సునాయాస విజయం సాధించడం ద్వారా జకోవిచ్ త్వరలో ప్రాపంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్ రేస్‌లో తానూ ఉన్నానని ప్రత్యర్థులకు హెచ్చరిక చేసినట్లయింది.