Tuesday, April 30, 2024

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

- Advertisement -
- Advertisement -

Gujarath

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా గుర్తించని పాలనలో వాళ్ళ ఉనికి అపాయంలో పడింది. గోద్రా అనంతర, ఢిల్లీ మారణ హోమాల్లో ఇది రుజువైంది. 2002 ఫిబ్రవరి 28లో అహ్మదాబాద్, గుల్బర్గ్ సొసైటీలో కాంగ్రెస్ పార్లమెంటు పూర్వ సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ ఇంటిలో 68 మంది ముస్లింలు భయంతో దూరారు. ఆయన ముఖ్యమంత్రి మోడీతో సహా పోలీసు ఉన్నత అధికారులకు వందకు పైగా ఫోన్లు చేశారు. ఎవరూ స్పందించలేదు. సాయంత్రం పోలీసులు చెప్పే దాకా నాకు ఈ విషయం తెలియదని మోడీ నిజం పలికారు. హైందవ మూక జాఫ్రీ ఇంటి గోడను గ్యాస్ బండలతో పేల్చి ఇంటిలో ప్రవేశించింది. 68 మందిని పాశవికంగా చంపింది. జాఫ్రీని వేళ్ళు, చేతులు, కాళ్ళు నరికి చిత్రహింసలు పెట్టి మంటల్లో తోశారు.

   గోద్రా సంఘటనలకు, 2,000 మంది హత్యలకు, వందల ముస్లిం వనితల అత్యాచార హత్యలకు, కోట్ల ఆస్తి ధ్వంసానికి ముఖ్యమంత్రి మోడీ రెచ్చగొట్టే ఉపన్యాసాలు, చర్యలే కారణం. అయినా ఆయన నిర్దోషి. 26.02.2020 రాత్రి గం.11.30 కు మౌజ్పుర్, గోండా చౌక్ లో ఒక ఇంటిలో 16 మంది ముస్లింలు చిక్కుకున్నారని, హైందవ గూండాలు ఇంటిలో దూరటానికి ప్రయత్నిస్తున్నారని, ఏ క్షణంలోనైనా వారిని చంపవచ్చని బందీల్లో ఒకరు ఎన్.డి.ఎ. పాలక కూటమి భాగస్వామి పక్షం శిరోమణి అకాలీదళ్ రాజ్యసభ సభ్యుడు నరేశ్ గుజ్రాల్‌కు ఫోన్ చేశారు. ఈయన మాజీ ప్రధాని ఇంద్రకుమార్ గుజ్రాల్ కొడుకు. ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఫిర్యాదు నమోదయింది. జాఫ్రీ కేసు లాగే ఈయన ఫిర్యాదు పై కూడా పోలీసుల చర్య శూన్యం. అయితే ఇరుగు పొరుగు హిందువులు ఆ 16 మందిని కాపాడారు. ఇది 18 ఏళ్లలో మోడీయానికి వ్యతిరేకంగా తయారైన పరిపక్వత పరిణామం. రెండు ఘటనల్లో పాత్రధారి, సూత్రధారి ముఖ్యమంత్రి, ప్రధాని హోదాల్లో ఒక్కరే. అప్పుడు రైలుపెట్టె తగలబెట్టారు. ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని సవరించారు. నాడు దాడి చేసినవారు హిందు మూకలే. నేడూ మారు వేషాల్లో వాళ్ళే. నాటి బాధితులు ముస్లింలే. నేడు ముస్లిం, హిందువులు ఇద్దరి ప్రాణాలు పోయాయి, ఆస్తులు, వాహనాలు తగలబడ్డాయి. నాడు రాజధర్మం మరిచారు. నేడు రాజ్యాంగాన్నే మరిచారు. నేడు ఫాసిస్టు, ఫాసిస్టు వ్యతిరేక శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. జాఫ్రీ ప్రతిపక్షానికి చెందినవారు. గుజ్రాల్ మిత్రపక్ష నాయకుడు. హైందవ పాలక క్రూరత్వ రూపం మారింది. మిత్రపక్ష విచక్షణ, సామాజిక మానవత్వం పెరిగాయి.

ఈశాన్య ఢిల్లీ గోకుల్పురి హిందు ఆధిపత్య ప్రాంతం. తండ్రి కొడుకులు మోహిందర్, అమర్జిత్ సింఘ్‌లు అక్కడి నుండి ద్విచక్ర వాహనాలలో 80 మంది ముస్లింలను ముస్లిం ప్రాంతం కరదాంపురి కి చేర్చారు. ఇక్కడి అల్లర్లలో 40 మందికి పైగా చనిపోయారు. హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ ఇక్కడే మరణించారు. ముస్లింల కొట్లు, ఇల్లు, మసీదుల ధ్వంసం, ఆస్తుల దోపిడీ జరిగింది ఇక్కడే. వాళ్ళ మతం చూడలేదు. వాళ్ళంతా నా పిల్లలనుకున్నాను. అందరూ బాగుండాలని, మానవత్వం గౌరవించబడాలని మా కోరిక అని 53 ఏళ్ల మోహిందర్ సింఘ్ అన్నారు. 1984 సిక్కుల ఊచకోతను 15 ఏళ్ల వయసులో ఈయన ప్రత్యక్షంగా చూశారు. గుణపాఠంగా కక్ష, ప్రతీకారాలు కాకుండా మానవత్వం పెంచుకున్నారు. ఫిబ్రవరి 24 సాయంత్రానికి గోకుల్పురిలో హైందవ మూకలు పెద్ద సంఖ్యలో గుమిగూడాయి.

జైశ్రీరాం, నరేంద్ర మోడీ జిందాబాద్, దేశద్రోహులను కాల్చి చంపండి అన్న నినాదాలతో హోరెత్తించారు. ముస్లింలు ఉద్రిక్తత, భయాందోళనలకు గురయ్యారు. స్థానిక మసీదులో తలదాచుకున్నారు. ఆ రాత్రికి ఆ మసీదు కాలింది, దోపిడీకి గురైంది. ముస్లింలు అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. హైందవ మూకలు రోడ్లు దిగ్బంధించాయి. మోటార్ సైకిల్, స్కూటీలపై అడ్డదారుల గుండా సింఘ్‌లు వారిని రక్షించారు. సాయుధ ముఠాలు ముస్లింల ఆస్తుల, వాహనాల వివరాలను స్మార్ట్ ఫోన్ యాప్‌ల ద్వారా తెలుసుకున్నాయి. స్థానికులు చూపగా మోడీ పార్టీకి చెందిన బయటివారు గోకుల్పురి ముస్లింల ఇళ్లను, అంగళ్లను రెండు రోజుల పాటు దోచుకున్నారు. మంటలకు ఆహుతి చేశారు. పెట్రోల్ బాంబులతో కట్టడాలు పేల్చారు. హిందువుల్లో అత్యధికులు ఈ మారణకాండను హర్షించలేదు. మానవ ధర్మం పాటించినందుకు హైందవ మూక ఏ క్షణంలోనైనా మాపై దాడి చేయవచ్చునని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన సింఘ్ భయపడుతున్నారు. ఈ సంఘటనతో ప్రఖ్యాత ఢిల్లీ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారిందని ఇండియన్ పోలీసు ఫౌండేషన్ ఛైర్మన్ ప్రకాశ్ సింఘ్ బాధపడ్డారు.

భారత్ డిసెంబర్‌లో ఆమోదించిన పౌరసత్వ చట్టం అత్యంత ఆందోళనకరమైంది. ముస్లింలపై దాడిని పోలీసులు ఆపకుండా తమాషా చూడటం బాధ్యతారాహిత్యం. ప్రభుత్వ పక్షపాతం అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి అధికారి మిచెలి బాచెలెట్ వ్యాఖ్యానించారు. తన తప్పులను ఎత్తిచూపిన వారిని పాకిస్థాన్ పొమ్మని ఎద్దేవా చేస్తారు. విదేశీ విజ్ఞులు సలహా చెప్పినా ఇది మా అంతర్గత అంశం అంటారు. విదేశాల్లో హిందువులు మత వేధింపులకు గురవుతున్నారని వారికి మా పౌరసత్వం ఇస్తామనటం విదేశీ జోక్యం కాదా? విదేశీ హిందువుల ఉద్ధరణకు కంకణం కట్టుకున్న మోడీ, -షా జంట 20 కోట్ల భారతీయ ముస్లింలను చంపిస్తోంది. వాళ్ళ ఇల్లు, అంగళ్లు, ఆస్తులు, మసీదులు దోపిడీ, దహనాలకు గురవుతోంటే తమాషా చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు భారత రాజధానిలో ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా అధికార పక్ష హైందవ మూక ముస్లింల దమనకాండకు పాల్పడటాన్ని ‘అంతర్జాతీయ మత స్వేఛ్ఛ పై అమెరికా కమిషన్’ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.

  డెమొక్రాటిక్ సభ స్పీకర్ నాన్సీ పెలోసి నియమించిన కమిషనర్ అరుణిమ భార్గవ ముస్లింలపై దాడిని పోలీసులు ఆపకపోవటాన్ని ఖండించారు. ఇది భారత సమస్య అంటూ నమ్మదగని మోడీ మత స్వేచ్ఛ మాటలను పత్రికా సమావేశంలో ట్రంప్ పొగిడారు. తమకు స్వదేశాన్ని అమ్మిన దేశ భక్తున్ని సామ్రాజ్యవాద చక్రవర్తి పొగడక తెగుడుతారా? తాము ఓట్లు, పౌరసత్వం పోయి ద్వితీయ శ్రేణి పౌరులుగా, రాజ్యరహితులుగా, నిర్బంధ శిబిరాల్లో పౌర, మానవ హక్కులు కోల్పోయి భార్యాభర్తలు వేరు చేయబడి సంతాన రహితులుగా మారతామన్న భయంతో ఆందోళన చెందుతున్న ముస్లింలను చంపిస్తున్న మోడీ వసుధైక కుటుంబాన్ని విశ్వ వేదికల ఆధిపత్యాన్ని ఎలా సాధిస్తారు? సహజంగానే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ బిజెపి ఎం.పి.లు ఢిల్లీ బాధితులను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిస్తబ్ద, నిరాసక్త పాత్ర పోషించింది. ప్రాణాలతో మిగిలిన బాధితులకు మసీదులు, దేవాలయాలే దిక్కు. మార్చ్ 4 న విద్వేష పూరిత, రెచ్చగొట్టే ఉపన్యాసాల కేసు వింటాం. కానీ ఈ ఉప న్యాసాలను, సంఘటలను కోర్టు నిరోధించ లేదు. అవి జరుగుతూనే ఉంటాయి అని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఇక ఆర్తులకు దిక్కెవరు? పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలే మార్గమని న్యాయమూర్తి సూచనా?

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News