Friday, April 26, 2024

బంగ్లాదేశ్‌లో మతహింస!

- Advertisement -
- Advertisement -

Lakhimpur kheri violence in which four farmers were killed

గత మూడు నాలుగు రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాకాండ ఆందోళనకరమైనది. అసలే మత విద్వేష మందుపాతర మీద ఉన్నట్టున్న ఉపఖండ దేశాలకు ఇది మంచి చేయదు. పైపెచ్చు ప్రజల మధ్య పరస్పర అసహనాన్ని మరింత పెంచుతుంది. తమ మత గ్రంథాన్ని అవమానించినట్టు చూపించే వీడియో వైరల్ కావడంతో రెచ్చిపోయిన ఇస్లాం మతోన్మాద మూకలు బంగ్లాదేశ్‌లో విజయదశమి, దుర్గా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకొని పలుచోట్ల హింసాకాండకు పాల్పడ్డాయి. పోలీసులకు, మూకలకు మధ్య ఘర్షణల్లో ముగ్గురు చనిపోయినట్టు చెబుతున్నారు. శుక్రవారం నాడు నౌకాలి జిల్లాల్లోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య (ఇస్కాన్) ఆలయంపై జరిగిన దాడిలో ఆ సంస్థకు చెందిన పాతికేళ్ల కార్యకర్తతో పాటు ముగ్గురు హిందువులు మరణించినట్టు సమాచారం. బంగ్లాదేశ్‌లో గల 64 జిల్లాలో 22 జిల్లాలు ఈ విద్వేషాగ్నికి ఉద్రిక్తం కావడంతో షేక్ హసీనా ప్రభుత్వం అర్ధ సైనిక దళాలను దింపి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఉన్మాదుల ఆట కట్టిస్తామని, హింసకు బాధ్యులను పట్టుకొని శిక్షిస్తామని ఆమె ప్రకటించారు. అవామీలీగ్‌కు చెందిన షేక్ హసీనా ప్రభుత్వం సెక్కులర్ సిద్ధాంతమే తన ఊపిరిగా ప్రకటించుకున్నది. బంగబంధుగా పేరొందిన బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రదాత ముజిబుల్ రెహమాన్ కుమార్తె హసీనాకు మత సామరస్యవాదిగా మంచి పేరుంది. ఆమె సెక్యులర్ భావజాలాన్ని సహించని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు సందు దొరికినప్పుడల్లా దేశంలో హింసను సృష్టించి ఆమె ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి జమాత్‌-ఎ-ఇస్లామీ సంస్థను నిర్వీర్యం చేయడంలో ఆమె ప్రభుత్వం చాలావరకు సఫలమైంది. ఈ సంస్థ బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాక్ సైన్యంతో కుమ్మక్కై చెప్పనలవికాని హింసను సృష్టించింది. దేశాన్ని ముస్లిం పాలనలోకి తీసుకెళ్లి ఇస్లామిక్ మత చట్టం షరియా ప్రకారం పరిపాలన జరపాలని కోరే ఈ సంస్థను 2013లో ఎన్నికల్లో పాల్గొనకుండా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు నిషేధించింది.

1971లో బంగ్లాదేశ్ అవతరించినప్పుడు పాల్పడిన పలు యుద్ధ నేరాలు, ఊచకోత హత్యలకుగాను ఈ సంస్థ నేతలు ముగ్గురికి ఉరిశిక్షలు పడ్డాయి. ఇటువంటి శక్తులకు ఈ ఏడాది దుర్గ ఉ త్సవాల ఘట్టం అందివచ్చిన సందర్భం అయింది. బంగ్లాదేశ్‌లో మైనా రిటీ మతస్తులపై గతంలోనూ పలుసార్లు దాడులు, హింసాకాండ చోటుచేసుకున్నాయి. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు అక్కడి ముస్లిం తీవ్రవాద, మతోన్మాద శక్తులు రెచ్చిపోయి మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై హింసా కాండ కు తెగబడ్డాయి. ఆ ఏడాది డిసెంబర్ నుంచి 1993 మార్చి వరకు ఆ హింసాకాండ సాగింది. ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంపైన భోలానాథ్‌గిరి ఆశ్రమం మీద దాడులు జరి గాయి. పాత ఢాకా నగరంలోని హిందు వ్యాపారుల నగల దుకాణాలను లూటీ చేశారు. సార్క్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఢాకా నేషనల్ మ్యూజియంపై 5వేల మంది సాయుధ మూక దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు బాష్పవా యు గోళాలు, రబ్బరు తూటాలు ప్రయోగించారు. మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఆలయాలపై దాడులు షరామామూలే. 1971నాటి యుద్ధ నేరాలకుగాను జమాత్‌-ఎ-ఇస్లామీ ఉపాధ్యక్షులు దెల్వార్ హుస్సేన్ సయీదీకి 2013లో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించినప్పుడు కూడా ఈ మూకలు రెచ్చిపోయాయి. సోషలిస్టు, సెక్యులర్ సి ద్ధాంతాల పట్ల పాలకుల్లో నిబద్ధత కొరవడినా అసలు అవి అంటేనే ఒళ్లు మండిపోయేంత ద్వేషంతో ఊగిపోయే మతోన్మాదం వారి తలకెక్కినా భిన్న వర్గాల ప్రజల మధ్య సామర స్యానికి తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. అది సహజంగానే ఆ దేశాన్నిగాని, ప్రాంతాన్ని గాని అగ్నిగుండం చేస్తుంది. ప్రజలు తమను తామే ద్వేషించుకుంటూ పగతో, హింసా యుత ఆలోచనలతో దహించుకుపోతూ వుంటారు. ప్రస్తుతం భారత ఉపఖండ ప్రాంత మంతా ఇంచుమించు ఇటువంటి దుస్థితిలో ఉందనడం అవాస్తవం కాబోదు. అప్ఘాని స్తాన్‌లో తాలిబన్ల శకం తిరిగి మొదలుకావడం దీనిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఇటు కశ్మీర్ లోయలోనూ అటు బంగ్లాదేశ్‌లోనూ చెలరేగిన మతోన్మాదం, మైనారిటీ మతస్థులపై హింసాకాండ ఎంతమాత్రం మంచి పరిణామాలు కావు. ఈ మతోన్మాద పెనుసర్పాన్ని ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎదుర్కొనే రోజు రావాలని కోరుకుందాం.

Violence During Durga Puja fest in Bangladesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News