ఇక కాజల్ పనైపోయింది అనుకుంటున్న ప్రతిసారీ కమ్‌బ్యాక్ అవుతున్న తీరు అందరికీ షాకిస్తోంది. చందమామ ఈజ్ బ్యాక్ ఎగైన్! అంటూ దూసుకొస్తోంది. సరికొత్త క్రేజీ ఆఫర్స్ తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. అది కూడా భారీ చిత్రాల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తోంది అందాల చందమామ కాజల్. ఇంతకుముందు చిరు సరసన ‘ఖైదీ నంబర్ 150’ లో నటించి కమ్‌బ్యాక్ అయ్యింది. ఆ తర్వాత పలు హిట్లు కొట్టింది. ఈ బ్యూటీ ఇప్పుడు దాదాపు ఐదు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే చిరంజీవి సరసన మరోసారి నటించే ఛాన్స్‌ని అందిపుచ్చకున్న ఈ భామ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టు తెలిసింది. తమిళ్ స్టార్ హీరో, ఇలయదళపతి విజయ్ సరసన మరోసారి ఆడిపాడబోతుంది.
ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా కాజల్ కథానాయికగా రూపొందిన ‘తుపాకి’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. విజయ్ నెక్స్ మూవీ మురుగదాస్‌తోనే ఉంటుందని ఇటీవల కోలీవుడ్ లో కథనాలొచ్చాయి. ఇది ‘తుపాకి’ సీక్వెల్ ప్రయత్నమేనట. పార్ట్ 1 తరహాలోనే హిట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయాలని మళ్లీ కాజల్‌నే ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇకపోతే కాజల్ మరో క్రేజీ సీక్వెల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్, -శంకర్ క్రేజీ కాంబినేషన్ మూవీ ‘భారతీయుడు 2’లోనూ ఆడిపాడుతోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటించేందుకు కాజల్ ఓకే చెప్పింది. దీంతోపాటు మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్లు’, హిందీలో ‘ముంబయి సాగా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్‌తో కాజల్ అభిమానులను మరింతగా మైమరపించేందుకు సిద్ధమవుతోంది.