Tuesday, May 7, 2024

భారత్‌లో కరోనా విజృంభించే స్థాయిలో లేదు : డబ్ల్యుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

Corona is not booming in India

 

న్యూయార్క్ : భారత్‌లో కరోనా విజృంభించే స్థాయిలో లేదని, అయితే మార్చి నుంచి అమలులో ఉన్న లాక్‌డౌన్ ఎత్తివేయడం వల్ల దాని ముప్పు తీవ్రమయ్యే పరిస్థితి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైకేల్ ర్యాన్ తన అభిప్రాయం వెలిబుచ్చారు. భారత్‌లో కరోనా కేసులు రెట్టింపు కావడానికి సమయం ఇప్పుడు మూడు వారాలు పడుతోందని అన్నారు. ఈ వైరస్ ప్రభావం భారత్‌లో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటోందని చెప్పారు. దక్షిణాసియాలో భారత్ లోనే కాదు, బంగ్లాదేశ్, పాకిస్థాన్, తదితర దేశాల్లో జనసాంద్రత భారీగా ఉన్నా కరోనా విజృంభణ మాత్రం లేదని, అయితే ఆ ప్రమాదం ఏర్పడవచ్చని ఆయన హెచ్చరించారు. భారత్‌లో జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ వంటి నిబంధనలు అమలు చేయడం వల్ల కరోనా వేగాన్ని అదుపు చేయడం వీలైందని, కానీ ఇతర దేశాల మాదిరిగా లాక్‌డౌన్ సడలించడంతో జనం మళ్లీ కదలడం ప్రారంభమైనందున వైరస్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.

భారీ ఎత్తున వలసలు, అర్బన్ ఏరియాల్లో జనం రద్దీ, చాలామంది కార్మికులు రోజూ పనికి వెళ్లాల్సిరావడం ఇవన్నీ భారత్‌లో ప్రత్యేక అంశాలని పేర్కొన్నారు. భారత్ వేగంగా ఇటలీని అధిగమించి ప్రపంచంలో ఆరో కరోనా బాధిత దేశంగా మారుతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 2 లక్షల కరోనా కేసులు నిర్ధారణ కావడం ఆందోళన చెందాల్సిన అంశం కాదని డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాధన్ అభిప్రాయ పడ్డారు. అయితే వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవలసి ఉందని అన్నారు. లాక్‌డౌన్‌తోపాటు ఇతర నిబంధనలను సడలించడం వల్ల ఆరోగ్యభద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల బాధ్యతగా ఆమె సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News