ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోడీకి ప్రముఖులు, దేశాధినేతలు, మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీకి రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పిఎం మోడీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ అన్నింటా విజయం సాధించాలని పుతిన్ సందేశం పంపించారు. రష్యా, ఇండియా మధ్య స్నేహ బంధానికి తాను ఎంతో విలువ ఇస్తానని, అంతర్జాతీయ వ్యవహారాలు, ద్వైపాక్షిక అంశాలు, నిర్మాణాత్మక చర్చలతో పాటు కలిసి పని చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని పుతిన్ కొనియాడారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడంలో మోడీ చేసిన సహాయ సహకారాలు వెలకట్టలేనివని ప్రశంసించారు.