Sunday, May 19, 2024

బాబా ఆమ్టే మనవరాలు షీతల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Baba Amte granddaughter Sheetal commits suicide

 

సేవా సమితి నిర్వహణపై గతంలో కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన షీతల్

చంద్రాపూర్: ప్రముఖ సామాజిక వేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత బాబా ఆమ్టే మనవరాలు షీతల్ ఆమ్టే-కరజ్గీ సోమవారం మహారాష్ట్రలోని వరోరాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబ వర్గాలు తెలిపాయి. బాబా ఆమ్టే స్థాపించిన మహారోగి సేవా సమితి నిర్వహణకు సంబంధించి ఇతర ఆమ్టే కుటుంబ సభ్యులపై ఇటీవల సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర స్థాయిలో 39 సంవత్సరాల షీతల్ విమర్శలు గుప్పించారు.

విషాన్ని ఇంజెక్ట్ చేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలపై వ్యాఖ్యానించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆమె మృతదేహాన్ని వరోరాకు 50 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్‌కు తరలించారు. నాగపూర్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు వరోరా చేరుకున్నారు. షీతల్ మృతదేహం లభించిన ఆనంద్‌వన్‌లోని గదిని పోలీసులు సీల్ చేశారు. షీతల్ చేసిన అనేక ఆరోపణలపై బాబా ఆమ్టే కుమారులు వికాస్, ప్రకాశ్, వారి భార్యలు భారతి, మందాకిని ఇటీవల వివరణ ఇచ్చారు. వికాస్ కుమార్తె అయిన షీతల్ మహారోగి సేవా సమితికి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. మానసిక ఒత్తిళ్లకు లోనైన షీతల్ తమ సేవా సంస్థ నిర్వహణపై అనుచిత ప్రకటనలు చేశారని వారు వివరణ ఇచ్చారు. దేశంలోనే అతి పెద్ద సామాజిక సేవా సంస్థ అయిన మహారోగి సేవా సమితి ట్రస్టీలు, సేవకులు, దాని నిర్వహణపై షీతల్ చేసిన ఆరోపణలు ఆవాస్తవాలని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

చంద్రాపూర్ జిల్లాలోని వరోరాలో 1959లో బాబా ఆమ్టే కుష్ఠు వ్యాధిగ్రస్తుల కోసం ఆనందవన్ ఏర్పటు చేశారు. మహారోగి సేవా సమితి దీన్ని నిర్వహిస్తుంది. ఈ ట్రస్టుకు వికాస్ ఆమ్టే కార్యదర్శిగా ఉండగా మూడేళ్ల క్రితం సిఇఓ పోస్టు సృష్టించి ఆ పదవిలో షీతల్‌ను నియమించారు. మరో రెండు ప్రాజెక్టులను కూడా సమితి చేపట్టింది. 1967లో చంద్రాపూర్ జిల్లాలోని ముల్ తహసిల్‌లోని సోమనాథ్ వద్ద, 1973లో గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్ తహసిల్‌లోని హేమల్కస వద్ద లోక్ బిరాదరి ప్రకల్ప్ కింద ఈ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. హేమల్కస ప్రాజెక్టును ఆమ్టే కుమారుడు ప్రకాశ్, ఆయన భార్య మందాకిని ఆమ్టే, వారి కుమారులు దిగంత్, అనికేత్, వారి భార్యలు అనఘా, సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రకాశ్, మందాకిని ఇద్దరూ డాక్టర్లే. మెగసెసె అవార్డు గ్రహీత అయిన బాబా ఆమ్టే 2008లో కన్నుమూశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News