Friday, May 3, 2024

టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

BCCI announced 2021-22 season schedule for Team India

కివీస్ సిరీస్‌తో శ్రీకారం, దక్షిణాఫ్రికాతో ముగింపు

ముంబై: టీమిండియాకు సంబంధించిన 2021-22 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈ సీజన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. కొత్త సీజన్‌లో సొంత గడ్డపై భారత క్రికెట్ జట్టు పలు సిరీస్‌లు ఆడనుంది. ఈ ఏడాది నవంబర్ 17న కివీస్‌తో జరిగే సిరీస్‌తో కొత్త సీజన్‌కు తెరలేవనుంది. ఇక వచ్చే సంవత్సరం జూన్ 19న దక్షిణాఫ్రికాతో జరిగే టి20 మ్యాచ్‌తో ఈ సీజన్ ముగుస్తోంది. ఇదిలావుండగా 20202021కి సంబంధించి హోమ్ సీజన్‌కు ఈ ఏడాది నవంబర్‌లో తెరపడనుంది. ట్వంటీ20 ప్రపంచకప్‌తో ఈ సీజన్ ముగియనుంది. ఇక కొత్త సీజన్ ఇదే ఏడాది నవంబర్ 17న ఆరంభమవుతుంది. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో భారత్ మూడు ట్వంటీ20 మ్యాచ్‌లతో పాటు మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక న్యూజిలాండ్ 2016 తర్వాత భారత్‌లో ఓ టెస్టు సిరీస్ ఆడనుండడం ఇదే తొలిసారి. కివీస్‌తో జరిగే డిసెంబర్ 7న ముగుస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జైపూర్, రాంచీ, కోల్‌కతాలలో టి20 మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. అంతేగాక టెస్టు మ్యాచ్‌లకు కాన్పూర్, ముంబైలు వేదికలుగా నిలువనున్నాయి.

ఇక 2022 ఫిబ్రవరిలో సొంత గడ్డపై వెస్టిండీస్‌తో భారత్ మరో సిరీస్ పోటీపడనుంది. సిరీస్‌లో భాగంగా విండీస్‌తో మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచ్‌లలో భారత్ పాల్గొంటుంది. ఫిబ్రవరి ఆరున ఆరంభమయ్యే సిరీస్‌కు 19న తెరపడుతుంది. ఇక వన్డేలకు అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతాలు వేదికలుగా ఉంటాయి. ఇక టి20 మ్యాచ్‌లకు కటక్, విశాఖపట్నం, త్రివేండ్రం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అనంతరం శ్రీలంకతో జరిగే సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. ఫిబ్రవరి 25న ప్రారభమయ్యే ఈ సిరీస్ మార్చి 18న ముగుస్తోంది. సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు, మరో మూడు టి20లు జరుగనున్నాయి.

టెస్టు మ్యాచ్‌లకు బెంగళూరు, మొహాలీలు వేదికలుగా నిలువనున్నాయి. ఇక ధర్మశాల, మొహాలీ, లక్నోలలో టి20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక జూన్ 9న దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆరంభం అవుతుంది. ఇందులో భారత్ ఐదు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, రాజ్‌కోట్, ఢిల్లీలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలావుండగా కరోనా కారణంగా కొంతకాలంగా భారత్‌లో జరగాల్సిన పలు సిరీస్‌లను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు మాములుగా మారడంతో ఐసిసి షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు భారత క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది.

BCCI announced 2021-22 season schedule for Team India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News