రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీల చరిత్రలో తొలిసారిగా దసరా సెలవులు ఇవ్వడం ఇదే ప్రధమం. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి.అన్నపూర్ణ, ఇతర ప్రతినిధుల బృందం మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిసి ఇటీవల విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సీతక్క సెలవులు మంజూరు చేయించారు. ఈ మేరకు 27 నుంచి అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు యధావిధిగా పోషకాహారాన్ని అందజేయాలని సూచించారు. అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.