Friday, September 26, 2025

లద్దాఖ్‌లో మరో జెన్‌జెడ్ విప్లవం?

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రాంతమైన లద్దాఖ్ ఆందోళనలతో భగ్గుమంటోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, భారత రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని బుధవారం (24.9.25) నాడు జనం ముఖ్యంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల డిమాండ్లు ఏమిటి? ఎందుకు ఇది నేపాల్‌లోని జెన్‌జెడ్ విప్లవం రీతిలో ఉధృతమైంది? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ లోతుగా పరిశీలించవలసి ఉంది. 2019 లో ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా లేకుండాపోయింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆ సమయంలో చాలా మంది కేంద్రం తీసుకున్న ఈ చర్యలను సమర్ధించారు. అయితే ఏడాది తరువాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఏర్పాటైన తరువాత రాజ్యాంగ హక్కుల రక్షణ కోల్పోయిందని, అన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే పెత్తనం వహిస్తోందన్న ఆందోళన చెలరేగింది. ప్రత్యక్ష కేంద్ర పాలనకు వ్యతిరేకంగా అశాంతి పెరిగింది. తమ భూమి, సంస్కృతి, వనరులను కాపాడుకోవాలన్న స్థిరమైన అభిప్రాయం విప్లవంగా రూపొందింది.

లద్దాఖ్ లోని రెండు ప్రధాన వర్గాలైన బౌద్ధ, ముస్లిం వర్గాలను కలుపుకుని లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(కెడిఎ) ఉమ్మడి పోరాటం చేపట్టాయి. 1. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పన 2. స్థానిక ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక పార్లమెంట్ స్థానానికి బదులుగా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఏర్పాటు 4. భూమి, సంస్కృతి, ఉద్యోగాల రక్షణ కోసం లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్ కింద చేర్చడం ఈ నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఆందోళనకారులు పెట్టారు. లద్దాఖ్ ప్రజలు తమ రాజకీయ స్వయం ప్రతిపత్తిని కోల్పోయారని, తమ సంస్కృతి, జీవన విధానాన్ని కాపాడుకోవాలంటే పూర్తిస్థాయి రాష్ట్రహోదా తప్పనిసరి అని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్‌లో ఆర్టికల్ 244(2), ఆర్టికల్ 275 (1) ఉన్నాయి. ఆర్టికల్ 244(2) అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పరిపాలనను నియంత్రిస్తోంది.

ఈ రాష్ట్రాల్లో గిరిజన హక్కులను రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక ఆర్టికల్ 275(1) షెడ్యూల్డ్ తెగల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు నిధులు అందజేయడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం, విద్యుత్ సరఫరా, గృహనిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. నిధుల పంపిణీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆధారంగా జరుగుతుంది. గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుకు ఈ నిధుల నుంచి కొంతభాగం కేటాయించబడుతుంది. ఇవన్నీ ఆరో షెడ్యూల్ అమలైతేనే వర్తిస్తాయి. అందుకనే లద్దాఖ్ ప్రజలు తమకు రాష్ట్ర హోదాతోపాటు ఆరో షెడ్యూల్‌ను జత చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లద్దాఖ్ లోని నిరుద్యోగ రేటు 26.5 శాతంగా ఉంది.

ఇది దేశంలోనే రెండో అత్యధిక శాతంగా చెబుతున్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రెండు పార్లమెంట్ నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లు అన్నిటిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖతో గత ఏడాది డిసెంబర్ నుంచి లేహ్ అపెక్స్ బాడీ చర్చలు జరుపుతోంది. గతంలో లేహ్ అపెక్స్ బాడీ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు కూడా. ఇప్పుడు కూడా ఆయన నిరాహార దీక్ష సాగించారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘గత ఐదు సంవత్సరాలుగా యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. యువత నిరుద్యోగులుగా మారడం, వారి ప్రజాస్వామిక హక్కులను లాక్కోవడం అనేది సామాజిక అశాంతికి కారణమని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, నేడు ఇక్కడ ప్రజాస్వామ్య వేదిక లేదు. మాకు హామీ ఇచ్చిన ఆరో షెడ్యూల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు.

పదేపదే హామీలు ఇచ్చినప్పటికీ కేంద్ర హాం మంత్రిత్వశాఖ దాదాపు రెండు నెలలుగా స్థానిక ప్రతినిధులతో చర్చలు జరపడం లేదు’ అని వాంగ్‌చూక్ ఈ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. లద్దాఖ్ ప్రజల డిమాండ్లలో కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంటరీ నియోజక వర్గాల ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నా లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించడం, ఆరో షెడ్యూల్ కింద చేర్చడం వంటి కీలక డిమాండ్లపై మాత్రం ఇంకా అంగీకరించకపోవడమే తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమను నిర్లక్షం చేస్తోందన్న అసంతృప్తి యువతలో బాగా నాటుకుంది. ఒకప్పుడు శాంతియుతంగా నిరసనలు చేసిన లద్దాఖ్‌లో ప్రస్తుతం తీవ్ర ఆందోళనలు చెలరేగడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్షమే కారణమని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. అయితే చర్చలు తిరిగి ప్రారంభించడానికి అక్టోబర్ 6న ప్రతినిధులతో సమావేశం కావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా ఏకపక్ష నిర్ణయమేనని ఆందోళనకారులు ధ్వజమెత్తుతున్నారు.

Also Read: కన్నడలో కుదరని కులాల సర్వేలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News