అమెరికాలో ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించడానికి ప్రధాన ద్వారంగా ఉన్న హెచ్-1బి వీసా, భారతీయ యువతకు గ్లోబల్ అవకాశాల కోసం అనేక సంవత్సరాలుగా ప్రధాన మార్గంగా ఉంది. 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ వీసా ముఖ్యంగా టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్య, పరిశోధన రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్-1బి వీసాలను జారీ చేస్తున్నారు. అందులో 65,000 సాధారణ వర్గానికి, 20,000 అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ లేదా పిహెచ్‌డి పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన హెచ్-1బి వీసాల 72.6 శాతం భారతీయులకే లభించింది. మొత్తం 188,123 కొత్త వీసాల్లో 131,549 భారతీయులు పొందారు.
వీసా పొడిగింపులో భారతీయుల వాటా 79%. సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, టెక్సాస్, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లోని ఐటి కంపెనీలలో భారతీయులు 3040 శాతం వరకు ఉద్యోగులను ఆక్రమిస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ వంటి దిగ్గజ సంస్థలు లక్షలాది భారతీయులను అమెరికా ప్రాజెక్టులకు పంపు తున్నాయి. తాజా మార్పులు, కొత్త విధానం భారతీయులకు సవాళ్లను తెస్తోంది. ప్రధానంగా నైపుణ్య- జీత ఆధారిత ఎంపిక విధానం అమలు చేయబడుతున్నది. ఇప్పటివరకు లాటరీ పద్ధతిలో వీసాలు కేటాయించేవి. కానీ ఇప్పుడు ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగాలకు అవకాశం తగ్గుతుంది. అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఈ భారీ ఫీజు భారం. పెద్ద ఐటి దిగ్గజాలు మాత్రమే ఈ భారం మోయగలవు.
మూడవ పక్షం ద్వారా ఉద్యోగులను వేరే ప్రాజెక్ట్‌లకు పంపడం కఠిన నియంత్రణలకు లోనవుతుంది. వీసా పొడిగింపు, వర్క్ ప్లేస్ మార్పులు, డాక్యుమెంటేషన్ కఠినతరం కావడంతో ఉద్యోగ భవిష్యత్ అనిశ్చితిగా మారుతోంది. భారతీయ ఐటి పరిశ్రమపై ప్రభావం ప్రత్యక్షం. భారతీయ ఐటి సేవల ద్వారా అమెరికాకు వచ్చే ఆదాయం 2023- 24లో సుమారు 150 బిలియన్ డాలర్లు. హెచ్-1బి పరిమితులు ఈ ఆదాయంపై, ఉద్యోగుల భవిష్యత్తుపై, పరిశ్రమ వ్యూహాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల అనుభవాలు దీన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 2024 25 అధ్యయనాల ప్రకారం, అమెరికాలో పని చేస్తున్న భారతీయుల సుమారు 40% వీసా పొడిగింపులు ఆలస్యంగా పొందుతున్నారు. భారత ప్రభుత్వం ఈ అంశంపై పలు దఫాలు ప్రతిస్పందించింది. 2017లో ప్రధాని నరేంద్ర మోడీ -అధ్యక్షుడ ట్రంప్ సమావేశంలో, 2023లో బైడెన్- మోడీ సమావేశాల్లో హెచ్-1బి సమస్య చర్చలోకి వచ్చింది. భారత్ వీసా పరిమితులు భారతీయ ఐటి పరిశ్రమకు, భారత- అమెరికా వాణిజ్య సంబంధాలకు ప్రతికూలం అని స్పష్టంగా ప్రకటించింది. అమెరికా టెక్‌రంగంలో భారతీయుల స్థానం అత్యంత కీలకమైనది. సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, టెక్సాస్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో భారతీయులు 30% ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారు.
గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల, అడోబ్ సిఇఒ శాంతను నారాయణ్, ఐబిఎం సిఇఒ అర్వింద్ కృష్ణ వంటి భారతీయ మూలాల మేధావులు అమెరికా దిగ్గజ సంస్థలను నడిపిస్తున్నారు. కొత్త పరిస్థితుల్లో భారతీయులకు సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం దేశీయ ఐటి నైపుణ్యాలను బలపరుస్తోంది. అమెరికా వీసా పరిమితుల కారణంగా ప్రతిభావంతులైన భారతీయులను స్వదేశంలోనే వినియోగించడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద హెచ్-1బి వీసా కొత్త విధానం అమెరికాలోని లక్షలాది భారతీయుల భవిష్యత్తుపై, భారతీయ ఐటి పరిశ్రమపై, అలాగే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ఒకవైపు ఆందోళన, మరోవైపు స్వదేశంలో అవకాశాల విస్తరణ -ఈ రెండింటి మధ్య భారతీయ ప్రతిభ భవిష్యత్తును నిర్ధారించనుంది.
రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494