Friday, April 26, 2024

అదానీ గ్రూప్ X హిండెన్‌బర్గ్

- Advertisement -
- Advertisement -

హిండెన్‌బర్గ్ నివేదిక భారత్‌పై దాడి, ఆరోపణలన్నీ అవాస్తవం x జాతీయ వాదం ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చొద్దు
నివేదిక చెడు ఉద్దేశంతో కూడినది, సంస్థకు విశ్వసనీయత లేదు x అనూహ్య సంపద పెరుగుదలను భారత్ సక్సెస్‌కు ఆపాదిస్తున్నారు.
వినోద్ అదానీ కంపెనీలతో తమ సంబంధం లేదు x సోదరుడు వినోద్ అదానీ డొల్ల కంపెనీల్లో అదానీ బిలియన్ డాలర్ల లావాదేవీలు
నివేదికను ప్రజల సంక్షేమం కోసం కాదు, స్వార్థం కోసమే x స్వార్థ ప్రయోజనాల కోసమే నివేదిక అనడం తప్పుదోవ పట్టించడమే
413 పేజీలతో అదానీ గ్రూప్ కౌంటర్ x 88 ప్రశ్నల్లో 66 ప్రశ్నలపై ప్రత్యేక స్పందనే లేదు

అదానీ గ్రూప్ వ్యాపారాల్లో అవకతవకలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఇచ్చిన నివేదిక భారతదేశం మార్కెట్లను కుదిపేస్త్తోంది. న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ జనవరి 24న నివేదిక ఇచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు దాదాపు 70 బిలియన్ డాలర్లు (రూ.5,70,321 కోట్లు) నష్టపోయాయి. ధనవంతుల జాబితాలో అదానీ నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. నివేదికలోని ఆరోపణలను తిరస్కరించిన అదానీ గ్రూప్ అమెరికా సంస్థపై దావా వేస్తామని హెచ్చరించింది. అంతేకాదు ప్రపంచ కుభేరుడు గౌతమ్ అదానీ 413 పేజీలతో కౌంటర్ ఇవ్వగా, దీనిపై హిండెన్‌బర్గ్ కూడా ఘాటుగానే స్పందిస్తూ, అదానీ వాదనలను తిప్పికొట్టింది. హిండెన్‌బర్గ్ నివేదిక భారతదేశంపై దాడి, గ్రూప్‌పై ఆరోపణలన్నీ అవాస్తవాలు, పచ్చి అబద్ధాలని, ఆ సంస్థకు విశ్వసనీయత లేదని గ్రూప్ సమాధానమిచ్చింది. అయితే జాతీయ వాదం ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు, కీలక ఆరోపణలపై ప్రత్యేకించి స్పందనే ఇవ్వలేదని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ రీసెర్చ్ పేర్కొంది.

హిండెన్‌బర్గ్ ……
భారతీయ ప్రజాస్వామ్యం భిన్నత్వంతో కూడుకున్నదని నమ్ముతున్నాము. భారతదేశం ఉజ్వల భవిష్యత్తుతో అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్, అదానీ గ్రూప్ వల్ల భారతదేశ భవిష్యత్తు వెనుకబడిపోతుంది. జాతీయ వాదంతో మోసం తప్పు అని చెబుతున్నాం.
నివేదికలోని 88 ప్రశ్నలకు గాను 62 ప్రశ్నలకు ప్రత్యేకించి సమాధానం ఇవ్వడంలో అదానీ గ్రూప్ విఫలమైంది. కంపెనీలో సంపద అనూహ్యంగా పెరగడం, ఆసియాలోనే అతిపెద్ద సంపన్నడి నికర విలువను భారతదేశం విజయంతో కలిపే ప్రయత్నాలు చేసిందని హిండెన్‌బర్గ్ వెల్లడించింది.

330 పేజీల్లో కోర్టు రికార్డులు, 53 పేజీల్లో ఉన్నత స్థాయి ఆర్థిక అంశాలు, సాధారణ సమాచారం, సంబంధం లేని కార్పొరేట్ చర్యల వివరాలు ఉన్నాయి. నివేదికలో ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చింది లేదని సంస్థ తెలిపింది. 413 పేజీల స్పందనలో 30 పేజీలు మాత్రమే తాము ఇచ్చిన నివేదికలో అంశాలపై దృష్టిపెట్టాయి.
రెండేళ్ల పరిశోధనలో అదానీ గ్రూప్ అనేక దశాబ్దాలుగా మార్కెట్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్, మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని గుర్తించామని హిండెన్‌బర్గ్ తెలిపింది. అదానీ గ్రూప్‌లోని అన్ని ప్రధాన లిస్టెడ్ కంపెనీలు అధిక రుణాలను కలిగి ఉన్నాయని, అన్ని గ్రూప్ కంపెనీల షేర్లు 85 శాతం కంటే ఎక్కువ విలువను కలిగి ఉన్నాయని కూడా ఈ నివేదికలో పేర్కొంది.

సెక్యూరిటీస్, విదేశీ మారక చట్టాలను కూడా అదానీ గ్రూప్ ఉల్లంఘించిందన్న వాదనకు మేము కట్టుబడి ఉన్నాం. అదానీ గ్రూప్ మా నివేదికను భారతదేశంపై దాడిగా పిలుస్తోంది. దీనితో ఏకీభవించబోమని సంస్థ పేర్కొంది. పోర్టుల నుంచి ఎనర్జీ వరకు బహుళ వ్యాపార సంస్థలు కల్గిన అదానీ గ్రూప్ అత్యధిక స్థాయిలో రుణాలు తీసుకుని, పన్నులను తప్పించుకునేందుకు అనేక సంస్థలను సృష్టించిందని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది.

ఈ నివేదిక అమెరికా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకు సృష్టించిందని, స్టాక్స్ పతనంతో లాభపడేందుకు నివేదికను రూపొందించారనే అదానీ గ్రూప్ ఆరోపణలు తప్పు అని, ఇది తప్పుదోవ పట్టించే ప్రయత్నమే అని సంస్థ తెలిపింది.
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ, ఆయన డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు లావాదేవీలు జరుపుతోందని, ఇవి అనుమానాస్పదమైనవని నివేదికలో పేర్కొన్నాం. వినోద్ అదానీ కంపెనీలకు బిలియన్ డాలర్ల నిధులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించాం. వీటి గురించి మేము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాం. కానీ వీటికి అదానీ గ్రూప్ తన 413 పేజీల స్పందనలో ఎలాంటి జవాబు ఇవ్వలేదు. మరోవైపు వినోద్ అదానీకి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తోంది. ఈ కంపెనీల వివరాలను వెల్లడించలేమని, వినోద్ కంపెనీల గురించి తమకేమీ తెలియదని అదానీ గ్రూప్ స్పందించడం విడ్డూరంగా ఉందని హిండెన్‌బర్గ్ తెలిపింది.

హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు -20 శాతం క్షీణించాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీల విలువ రూ.5 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు ఎల్‌ఐసి కూడా ప్రభావితమైన పెట్టుబడిదారులలో ఒకటి. రెండు రోజుల్లోనే ఎల్‌ఐసి రూ.18 వేల కోట్లు నష్టపోయింది.

అదానీ గ్రూప్ …….
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో వ్యాపార సామ్రాజ్యంలో పతనం చూస్తున్న అదానీ గ్రూప్ 413 పేజీల స్పందనతో తన ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది. జనవరి 24న నివేదిక ఇచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు దాదాపు 70 బిలియన్ డాలర్లు (రూ.5,70,321 కోట్లు) నష్టపోయాయి. స్టాక్‌మార్కెట్లో ఇప్పటి అనేక షేర్లు పతనం కాగా, కీలక డాలర్ బాండ్లు కూడా మరింత కనిష్టానికి పడిపోవడంతో అదానీ తన పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నివేదిక ఒక నిర్దిష్ట కంపెనీపై నిరాధారమైన దాడి కాదు, ఇది భారతదేశంపై ప్రణాళికాబద్ధమైన దాడి. ఇది భారతీయ సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, నాణ్యతపై దాడి. ఇది భారతదేశ వృద్ధి కథనం, అంచనాలపై దాడి.
సగం అసంపూర్ణ వాస్తవాలతో ఈ నివేదికను తయారు చేశారు. నివేదికలోని ఆరోపణలు నిరాధారమైనవని, పరువు తీయాలనే ఉద్దేశంతో చేసినవి. ఈ నివేదికకు ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది.- తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్‌లో సముచిత స్థానాన్ని సృష్టించడం, పెట్టుబడిదారులకు నష్టం కలిగించడం, షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ భారీ ఆర్థిక లాభాలను పొందేలా చేయడం.

హిండెన్‌బర్గ్ నివేదిక చెడు ఉద్దేశాలతో కూడినదని రుజువు అయింది. హిండెన్‌బర్గ్‌కు విశ్వసనీయతను గ్రూప్ ప్రశ్నించింది. దేశంలోనే అతిపెద్ద ఐపిఒను అదానీ గ్రూప్ ప్రారంభించడానికి ముందే ఇలాంటి నివేదికను విడుదల చేయడం ద్వారా హిండెన్‌బర్గ్ తన చెడు ఉద్దేశాలను రుజువు చేసిందని గ్రూప్ పేర్కొంది.
హిండెన్‌బర్గ్ ఈ నివేదికను ప్రజల సంక్షేమం కోసం కాదు, తన స్వార్థం కోసం విడుదల చేసిందని అదానీ గ్రూప్ తెలిపింది. దానిని జారీ చేయడంలో హిండెన్‌బర్గ్ సెక్యూరిటీస్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ చట్టాన్ని కూడా ఉల్లంఘించింది. ఈ నివేదిక స్వతంత్రమైనది కాదు, లేదా నిష్పాక్షికమైనది కాదు, సరిగ్గా పరిశోధించనూ లేదు.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎక్కడిది, దీని ఫౌండర్ ఎవరు?
న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను 2018లో నాథన్ అండర్సన్ స్థాపించారు. 1937లో హిండెన్‌బర్గ్ విపత్తు జరగ్గా, ఇది మానవ నిర్మిత విపత్తుగా పేరుంది. దీని పేరును ఈ సంస్థకు వినియోగించుకున్నారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత విపత్తులను గుర్తించడం, కంపెనీల్లో అవకతవకలు, మోసాలను, రహస్య కార్యకలాపాలను బయటపెట్టడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. పెట్టుబడులు, రుణాలు, డెరివేటివ్స్‌ను ఇది విశ్లేషించి, ఆర్థిక ఫోరెన్సిక్ రీసెర్చ్ నివేదికలు అందిస్తుంది. నాథన్ అండర్సన్ అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ట్రేడ్‌పై డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత 2004 నుంచి 2005 మధ్య ఆయన ఇజ్రాయిల్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అనేక పెట్టుబడి సంస్థల్లో పనిచేసి, ఆర్థిక సంస్థ క్లారిటీస్ప్రింగ్ స్థాఫించారు. 2018లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను ఆయన స్థాపించారు. ఈ సంస్థ అనేక కంపెనీల మోసాల గుట్టును రట్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News