Saturday, May 11, 2024

ప్రైవేట్ స్కూళ్లలో మొదలైన ప్రవేశాల సందడి

- Advertisement -
- Advertisement -

వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే ప్రవేశాలు
పేరొందిన స్కూళ్లలో ఎల్‌కెజి సీటుకు అధిక డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బడా స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరానికి అప్పుడే అడ్మిషన్ల సందడి మొదలైంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగియక ముందే వచ్చే విద్యాసంవత్సరానికి పలు పాఠశాలలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పేరొందిన పాఠశాలల్లో ఎల్‌కెజి సీటుకు అధిక డిమాండ్ ఉంటోంది. ఎందుకంటే ఒకసారి ఎల్‌కెజిలో ప్రవేశం పొందితేనే, ఆ పాఠశాలలో తర్వాత తరగతులు చదివేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నగరంలో ప్రముఖ పాఠశాలలు గత నెలలోనే దరఖాస్తులు స్వీకరించగా, ఈ నెలలో ఇంటర్వూలు నిర్వహించి ఎల్‌కెజి సీట్లు కేటాయించనున్నారు. వీటితో పాటు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లు ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాయి.

ముందుగా సీటు రిజర్వు చేసుకుంటే ఫీజులో రాయితీ ఉంటుందని చెబుతూ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. అందులో భాగంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలల్లో పనిచేస్తున్న టీచర్లకు అడ్మిషన్లపై టార్గెట్లు ఇస్తున్నారు. టీచర్లు ఎవరి ఇంట్లో పిల్లలు ఉన్నారన్న సమాచారం తెలుసుకుని వారి పిల్లలు తమ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి.. ఫలితాలు చూడండంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లలను, వారి తల్లిదండ్రులు నివాసం ఉండే వీధిలో ఉండే పిల్లలు, వారి బంధువుల పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు.
20 శాతం వరకు ఫీజుల పెంపు..?
వచ్చే విద్యాసంవత్సరం 20 శాతం వరకు స్కూల్ ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి కొంతమేర ఫీజుల పెంపు ఉంటుందని ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తల్లిదండ్రులకు తెలియజేసినట్లు సమాచారం. ఏటా కనీసం 20 నుంచి 50 శాతం ఫీజులు పెరుగుతుండగా, కొన్ని పాఠశాలలు 100 శాతం కూడా పెంచుతున్నాయి. ఫీజులు పెంచినా పిల్లలను ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు మార్చడం ఇష్టం లేక కొంతమంది తల్లిదండ్రులు అదే పాఠశాలలో తమ పిల్లల చదువు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇలా ఏటా పెరుగుతున్న ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తల్లిదండ్రుల ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆరాటాన్నీ ప్రైవేట్ పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. స్కూళ్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లన్నీ కేవలం నిరుపేదలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు కేటగిరీల వారీగా స్కూళ్లను ఎంపిక చేసుకునే పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోయినా తమ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవడమే కనీస గౌరవంగా భావిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు ఏదో ఒక పేరున్న ప్రైవేట్ స్కూళ్లో చేర్పించాలని భావించిన తల్లిదండ్రులను ప్రస్తుతం సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతలను అడ్డంపెట్టుకుని సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు దండుకుంటున్నారు. ఒకసారి తమ పాఠశాలలో చేర్పించిన తర్వాత ఎక్కడికి వెళ్లరనే ధీమాతో యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. రాష్ట్రంలో 150 నుంచి 200 వరకు సిబిఎస్‌ఇ స్కూళ్లు ఉండగా, 40 వరకు ఐసిఎస్‌ఇ స్కూళ్లు ఉన్నాయి. వీటితోపాటు 20 వరకు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News