Friday, May 10, 2024

అగ్నిపథ్.. సైన్యంలో నాలుగేళ్ల కొలువు

- Advertisement -
- Advertisement -

17 ఏళ్లు సర్వీసు చేసిన ఒక సైనికుడికి జీతం, పెన్షన్ కోసం రూ.11 కోట్లు చెల్లించవలసి వస్తే కొత్త లెక్కన నలుగురికి కలిపి అదే కాలానికి రూ. కోటిన్నర సరిపోతాయి. ప్రభుత్వంలోని పెద్దలంతా ఇది ప్రధాని మోడీ మహత్తర ఆలోచన అని, అద్భుత పథకమని, దేశ రక్షణలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో యువతకు అవకాశం దొరుకుతుందని ప్రచా రం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఇది బిజెపి కొత్తరకపు మోసమని, యువతకు తీరని అన్యాయం జరుగుతుందని దీనిని విమర్శిస్తున్నారు. విశ్రాంత మిలిటరీ అధికారులు, రక్షణరంగ నిపుణులు సైతం ఇది పనికిమాలిన, ప్రయోజనం లేని పథకమని చెబుతున్నారు. నిజానికి సైనికుడికి ఆరేడు నెలల శిక్షణ సరిపోదు. ఆయుధం పట్టే ముందు చెప్పే క్లాసులకే ఆ సమయం సరిపోతుంది. పూర్తి శిక్షణ కోసం 2 నుంచి 3 ఏళ్ల కాలం తప్పనిసరి అని యుద్ధ నిపుణులు అంటున్నారు.

6 soldiers of Army, Assam Rifles awarded Shaurya Chakra

కేంద్ర ప్రభుత్వం సైన్యంలో భర్తీకి కొత్త పద్ధతికి తెర లేపింది. దాని పేరే అగ్నిపథ్. ఈ నెల 14న కేబినెట్ కమిటీ ఆమోదం పొందగానే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో కలిసి ఈ కొత్త పథకం గురించి విలేకరులకు వివరించారు. ఆయన వివరణ ప్రకారం ఇక నుంచి సైన్యంలో ఆఫీసర్ కన్నా కింది స్థాయి ఉద్యోగాలకు ఎంపిక ఇలాగే జరుగుతుంది. ఈ విధానంలో సాయుధ బలగాల్లో చేరే వారిని అగ్నివీర్ అని పిలుస్తారు. వీరి సర్వీసు కాలం నాలుగేళ్లు మాత్రమే. అందులో ఆరు నెలల పాటు సైనిక, ఆయుధ శిక్షణ ఇస్తారు. ఈ సంవత్సరంలో 45 వేల మందిని కొత్త ప్రక్రియ ద్వారా నియమిస్తారు. ఇదంతా మూడు నెలల్లో మొదలవుతుంది. దీని కోసం 17.5 నుండి 21 ఏళ్ల మధ్య వయస్కులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత ఇంటర్మీడియేట్ మాత్రమే. చేరిన మొదటి ఏడాది రూ.4.76 లక్షల ప్యాకేజీ కింద నెలనెలా జీతంగా ఇస్తారు. నాలుగో సంవత్సరానికి ఆ ప్యాకేజీ రూ.6.92 లక్షలకు చేరుతుంది. నాలుగేళ్ల తర్వాత వారికి రూ. 11.71 లక్షలు సేవానిధిగా లభిస్తుంది. ఆ నాలుగేళ్లులో విధుల్లో రాణించిన 25% అగ్నివీరులను మాత్రమే సైన్యంలోని పర్మినెంట్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. మిగితా వాళ్లు తిరిగి ఇంటికొచ్చేసి వేరే ఉద్యోగాలు వెదుక్కోవాలి. సైన్యంలో చేరిన వారికి పర్మినెంట్ ఉద్యోగ సీనియారిటీలోనూ, జీతభత్యాల్లోనూ ఈ నాలుగేళ్లు లెక్కలోకి రావు.

సైనిక నియామకంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం సైన్యం జీతభత్యాలు, ఇతర ఖర్చులను తగ్గించుకొనడానికే అనేది దాచిపెట్టలేని సత్యం. త్రివిధ దళాలకు అధిపతిగా పని చేసిన బిపిన్ రావత్ 2020 లోనే ప్రభుత్వానికి ఈ సూచన చేశారు. కరోనా కారణంగా, డిసెంబర్ 2021లో రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంవల్ల అగ్నిపథ్ ప్రవేశం కొంత ఆలస్యమైంది. ఉన్న సైన్యానికి ఎలాంటి కోత పెట్టలేరు కాబట్టి రాబోయే త్రివిధ రక్షణ దళ జవానుల జీతభత్యాలను కట్టడిచేసి వీలైతే ఆ సొమ్ముతో ఆధునిక యుద్ధ పరికరాలను, ఆయుధాలను కొనాలని కేంద్రం ఆలోచిస్తోంది. పక్కనున్న చైనా దూకుడుకు సైనికుల సంఖ్య కన్నా అధునాతన అస్త్రాలే అవసరమని భావిస్తోంది. ఈసారి బడ్జెట్‌లో విడిగా రక్షణ, సైన్య ఆధునీకరణకు రూ. లక్షన్నర కోట్ల కేటాయింపు జరిగింది. అంతేకాక దేశంలో ఆయుధ తయారీ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74% కు పెంచింది.

ఇప్పటికే మన దేశం రక్షణ శాఖ కోసం ఎంతో సొమ్మును వెచ్చిస్తోంది. 2022 -23 బడ్జెట్లో రక్షణ శాఖకు రూ. 5,25,166 కోట్లు కేటాయించి ముందుగానే అందులోంచి ఆయుధ ఆధునీకరణకు లక్షన్నర కోట్లు పక్కనపెట్టారు. ప్రపంచ దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మన దేశమే రక్షణ శాఖకు అధిక కేటాయింపు చేస్తోంది. పదేళ్ల క్రితం ఉన్న రూ.2 లక్షల కోట్ల ఖర్చు ఇప్పుడు రూ.5 లక్షల కోట్లను దాటింది. ఈ సొమ్ములోంచి 42 % సైన్యం జీతభత్యాల చెల్లింపుకు వెళుతుంది. అందులో పెన్షన్ వాటాయే 24 % ఉంటుంది. 2022 -23 రక్షణ బడ్జెట్లోంచి సుమారు రూ. 1.20 లక్షల కోట్లు రక్షణ శాఖ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ తదితర అవసరాలకు పక్కన పెట్టారు.

ఈ భారీ ఖర్చు దృష్టితోనే సైన్యంలో 2019 నుండి లక్ష ఇరువై వేల మంది రిటైర్ అయినా కేంద్రం కొత్త నియామకాలు చేపట్టలేదు. చివరకు అగ్నిపథ్ పేరిట ఈ రకపు నియామకాలతో ముందుకొచ్చింది. దీని వల్ల ఆర్థికంగా కేంద్రానికి ఎంతో లాభం కలుగుతుంది. 17 ఏళ్లు సర్వీసు చేసిన ఒక సైనికుడికి జీతం, పెన్షన్ కోసం రూ.11 కోట్లు చెల్లించవలసి వస్తే కొత్త లెక్కన నలుగురికి కలిపి అదే కాలానికి రూ. కోటిన్నర సరిపోతాయి. ప్రభుత్వంలోని పెద్దలంతా ఇది ప్రధాని మోడీ మహత్తర ఆలోచన అని, అద్భుత పథకమని, దేశ రక్షణలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో యువతకు అవకాశం దొరుకుతుందని ప్రచా రం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఇది బిజెపి కొత్తరకపు మోసమని, యువతకు తీరని అన్యాయం జరుగుతుందని దీనిని విమర్శిస్తున్నారు. విశ్రాంత మిలిటరీ అధికారులు, రక్షణరంగ నిపుణులు సైతం ఇది పనికిమాలిన, ప్రయోజనం లేని పథకమని చెబుతున్నారు. నిజానికి సైనికుడికి ఆరేడు నెలల శిక్షణ సరిపోదు. ఆయుధం పట్టే ముందు చెప్పే క్లాసులకే ఆ సమయం సరిపోతుంది. పూర్తి శిక్షణ కోసం 2 నుంచి 3 ఏళ్ల కాలం తప్పనిసరి అని యుద్ధ నిపుణులు అంటున్నారు. ఇంటర్మీడియట్ చేసినవాళ్లు అగ్నిపథ్‌లో చేరి నాలుగేళ్లు తరవాత ఇంటికొస్తే చదువులో తమ ఈడు వాళ్ళ కన్నా వెనుకపడతారు. అయితే వీరి సర్వీసు కాలంలో చదువు కొనసాగేలా ఇగ్నో లాంటి ఓపెన్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటామని ప్రభుత్వం అంటోంది.

అధిక సమయం విధుల్లో గడుపుతూ, ఎప్పుడెక్కడ ఉంటామో తెలియని స్థితిలో, పగలు, రాత్రి, అడవి, మైదానం ఇలా తేడాలేని డ్యూటీ చేస్తూ వీరు చదువు కొనసాగించడం సాధ్యమా అనిపిస్తుంది. నాలుగేళ్ల తరవాత ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యత ఉంటుందని నోటిమాటగా అధికారులు అంటున్నారు. ఈ విషయంలో చట్టపర భద్రత తప్పనిసరి. అగ్నివీరులకు ఏ ఏ ఉద్యోగాలలో ఎంత శాతం కేటాయిస్తారనే అధికారిక స్పష్టత ఉండాలి. లేకపోతే బయటికి వచ్చాక దీని కోసం ఎదురు చూస్తూ కూచోవలసి వస్తుంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఈ ఎంపికలో అవకాశం ఉంటుందని నియామక అధికారులు చెబుతున్నారు.
అయితే టూరిస్టు సైనికులు ఉండరని, ఇది చెల్లుబాటుగాని పద్ధతి అని ప్రాథమికంగానే దీనిని కొట్టిపారేస్తున్న నిపుణులు కూడా ఉన్నారు. సైనిక విధులంటే చుట్టపు చూపుగా వచ్చిపోయే పనులు కావని, ఈ విధానం సైన్యాన్ని కించపరచడమేనని విశ్రాంత సైనికాధికారులు అంటున్నారు. సంపూర్ణ శిక్షణ తరవాత సైనికుడు ఈ దేశ రక్షణ తన జీవితాశయమనే భావనలోకి వస్తాడు. దాని కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధపడి పని చేస్తాడు.

కాలం గడుస్తున్న కొద్దీ విధుల్లో ఆరితేరుతూ ఎటువంటి సాహసానికైనా అడుగు ముందుకేస్తాడు. ఇవన్నీ అగ్నివీరుల విధానం వల్ల సాధ్యపడదని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ విధానం ప్రకటించగానే సైన్యం చేరడానికి అన్ని విధాలా సిద్ధపడుతున్న యువకులు సైనిక ఉద్యోగం నాలుగేళ్ళ ముచ్చట అని తెలిసి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురి అయ్యా రు. నాలుగేళ్లు తర్వాత తమ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన కూడా మొదలయ్యింది. బీహార్‌లో యువత రైళ్లను, రహదారుల్లో వాహనాలను అడ్డుకొని తమ నిరసనలను తెలియజేస్తున్నారు. నాలుగేళ్ల కాలాన్ని రెండింతలు చేసి కనీసం 50% మందికి పర్మినెంట్ చేసి మిగితావారికి బయటి ఉద్యోగాల భరోసా కల్పిస్తే కొంతలో కొంతైన న్యాయముంటుందని ఓ రక్షణరంగ నిపుణుడి సలహా. దేశరక్షణ కోసం సైన్యం చేరేవారికి నిరుత్సాహ పరిచేలా ఈ పథకం ఉందని మాజీ యుద్ధవీరులు అంటున్నారు. యువత నిరసనలను, విజ్ఞుల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచించుకోవలసిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News