Saturday, April 27, 2024

దేశదేశాల్లో మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు, ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణశిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే, మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ వేయడంలేదు. మరణ శిక్షల్లోనూ కఠినమైన పద్ధతి, నొప్పిలేకుండా ప్రాణాలను తీసే విధానాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలు నేరాలకు అత్యంత కఠినమైన శిక్ష మరణ దండన.అయితే అంతర్జాతీయ స్థాయి ముద్దాయికి విధించే శిక్షలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న సత్సంబంధాలకు అనుగుణంగా అమలు పద్ధతి కొనసాగడమో లేదా క్షమాభిక్ష పెట్టడమో జరుగుతూ ఉంటోంది. అయినా ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలవుతున్న మరణ శిక్షల విధానాలేంటో, ఇప్పటి వరకూ ఎంత మంది మరణ శిక్షకు బలైయ్యారో చూద్దాం..! ఇటీవల అమెరికాలో ఒక హత్య కేసులో నేరం రుజువైన దోషికి నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి మరణ శిక్షను అమలు చేశారు. ఇలా ప్రపంచంలో నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అనుభవించిన మొదటి వ్యక్తి ఆయనే. అలబామా ప్రభుత్వం కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి మరణ శిక్షను అమలు చేసింది.

1998 నాటి హత్య కేసులో కెన్నెత్ యూజిన్ స్మత్‌కు అలబామా కోర్టు మరణ శిక్ష విధించింది. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి 36 మందిని కాల్చి చంపినందుకు ఉరిశిక్ష పడింది. అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేసినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షల సంఖ్య పెరుగుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం 55 దేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది. వాటిలో 9 దేశాల్లో ఎక్కువ మందిని హత్య చేయడం, యుద్ధ నేరాలకు పాల్పడడం వంటి అతి తీవ్రనేరాలు చేసిన వారికి మరణశిక్ష విధిస్తున్నారు. మరో 23 దేశాల్లో మరణశిక్ష వున్నప్పటికీ గత పదేళ్లలో ఎవరికీ మరణ దండన విధించలేదు. మరణ శిక్షల అమల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెబుతోంది. అయితే మరణ శిక్షలకు సంబంధించి చైనా అధికారికంగా వివరాలు విడుదల చేయకపోవడం వల్ల ఆ సంఖ్య ఎంత ఉంటుందనేది చెప్పడం సాధ్యం కాదు. చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 2022లో 883 మరణశిక్షలు అమలైనట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. 2017 నుంచి ఇప్పటి వరకు మరణశిక్షల అమలులో ఇదే అత్యధికం. 2022లో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో 2,016 మందికి మరణ శిక్ష పడినట్లు ఆ సంస్థ తెలిపింది.

మరణశిక్ష అమలుకు ముందు చాలా మంది ఖైదీలు ఏళ్ల తరబడి, కొన్నిసార్లు దశాబ్దాలుగా జైళ్లలోనే గడుపుతూనే వున్నారు. అధికారిక గణాంకాలు, మీడియా కథనాలు, మరణశిక్షపడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, వారి ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ గణాంకాలు రూపొందించింది. 2021లో 18 దేశాలు మరణ శిక్షలు అమలు చేస్తే, 2022లో 20 దేశాలు అమలు చేశాయి. అధిక సంఖ్యలో మరణశిక్ష అమలు చేసిన దేశాల్లో చైనాతో పాటు ఇరాన్, సౌదీఅరేబియా, ఈజిప్ట్, అమెరికా ఉన్నాయి.2022లో ఇరాన్ ముగ్గురికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. నేరాలకు పాల్పడినప్పుడు 18 ఏళ్లలోపు వయసు ఉన్న ఐదుగురికి ఇరాన్ మరణశిక్ష అమలు చేసిందని పేర్కొంది. ప్రపంచంలోని 11 దేశాలు ప్రతి సంవత్సరం మరణశిక్షను అమలు చేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రధానంగా పేర్కొంది. అందులో చైనా, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా, వియత్నాం, యెమెన్ ఉన్నాయి. ఉత్తర కొరియా కూడా మరణ శిక్షను ఏటా అమలు చేసే అవకాశం ఉందని ఆమ్నెస్టీ తెలిపింది. కానీ ఈ విషయాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. సౌదీ అరేబియా గత 30 ఏళ్లలో కంటే, 2022లో ఎక్కువ మందికి మరణశిక్ష అమలు చేసింది.

గత కొన్నేళ్లుగా మరణశిక్ష విధించని ఐదు దేశాలు బహ్రెయిన్, కొమొరోస్, లావోస్, నైగర్, దక్షిణ కొరియా 2022లో మరణశిక్ష విధించాయి. 2021 నుంచి అమెరికాలో మరణశిక్షల అమలు సంఖ్య పెరిగినప్పటికీ, 1999లో నమోదైన గరిష్ఠ సంఖ్య కంటే తక్కువే. 2022లో ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ నేరాల్లో 325 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.ఇరాన్ -255 మందికి, సౌదీ అరేబియా 57 మందికి, సింగపూర్ 11మందికి దాదాపు 20 ఏళ్ల తర్వాత, 2023లో ఒక మహిళకు మరణశిక్ష అమలు చేశారు. సరిడెవి డిజామన్ అనే ఆ మహిళ 2018లో హెరాయిన్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలారు. ప్రస్తుతం 112 దేశాల్లో మరణశిక్ష అమల్లో లేదు. ఇలాంటి దేశాల సంఖ్య 1991లో 48గా ఉండేది. 2022లో ఆరు దేశాలు మరణశిక్షను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేశాయి. కజకిస్తాన్, పపువా న్యూ గినియా, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. అతి తీవ్ర నేరాలకు మాత్రమే మరణశిక్ష అమలు చేస్తామని ఈక్వటోరియల్ గినియా, జాంబియా తెలిపాయి. హత్య, ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన 11 నేరాలకు తప్పనిసరి మరణశిక్షను ఎత్తివేస్తూ 2023 ఏప్రిల్లో మలేషియన్ పార్లమెంట్ నిర్ణయించింది.

2023 జులై లో మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని ఘనా పార్లమెంట్ తీర్మానించింది. 2022 డేటా ప్రకారం తలనరికి మరణ శిక్షను అమలు చేసే ఏకైక దేశం సౌదీ అరేబియా. దానితోపాటు ఉరి తీయడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, కాల్చి చంపడం వంటి పద్ధతులు కూడా అక్కడ అమల్లో ఉన్నాయి. అమెరికాలోని అలబామా స్టేట్ నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి కెన్నెత్ స్మిత్‌కి మరణశిక్ష అమలు చేసింది. అలబామాతో పాటు అమెరికాలోని మరో రెండు రాష్ట్రాలు నైట్రోజన్ గ్యాస్ వినియోగాన్ని ఆమోదించాయి. ఎందుకంటే, విషపు ఇంజెక్షన్లలో వినియోగించే మందులను సమకూర్చుకోవడం కష్టతరంగా మారింది. అమెరికాలో మరణ శిక్షల అమలు తగ్గేందుకు మందుల కొరత దోహదం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News