Wednesday, April 24, 2024

మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్న అమెజాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే సిద్ధమవుతోంది. సిఎన్‌బిసి నివేదిక ప్రకారం, అమెజాన్ మరోసారి 9000 మంది ఉద్యోగులను తొలగించనుంది. వచ్చే కొద్ది వారాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుందని కంపెనీ ప్రకటించినట్టు సమాచారం. ఈ కోతలు ఎక్కువగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఎడబ్లుఎస్), అడ్వర్టైజింగ్, ట్విచ్, పిఎక్స్‌టి(పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ)లో ఉండనున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రకటించిన 18 వేల మంది ఉద్యోగులను తొలగించింది. గత వారం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా రెండో రౌండ్‌లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సిఇఒ) మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

నాలుగు నెలల క్రితమే మెటా 11 వేల మందిని తొలగించింది. ఇప్పటికే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 13 శాతం ఉద్యోగులను తొలగించగా, ఇప్పుడు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోత పెట్టనుంది. మెటాలో పునర్నిర్మాణ పనులు విస్తరించడం, తక్కువ ప్రాధాన్యత ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు వంటి అంశాలు లేఆఫ్‌కు కారణమని కంపెనీ వెల్లడించింది. వార్షికంగా ఖర్చులను 5 బిలియన్ డాలర్ల మేరకు తగ్గించేందుకు జుకర్‌బర్గ్ కట్టుబడి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది. దీనిలో 40 శాతం కోతలు 2023లో జరిగాయని లేఆఫ్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News