Saturday, May 4, 2024

రెండో రాజధాని వెనక కుట్ర

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో దానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో కొంత మంది ఆంధ్రా మేధావులు హైదరాబాద్‌ని రెండో రాజధాని చేయాలని, ఇది అంబేడ్కర్ ఆశయం అని చెప్పిండ్రు. అట్లాగే మొన్న నెక్లెస్ రోడ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ రెండో రాజధానిగా చేయాలనేది అంబేడ్కర్ అభిమతం అని ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి నిరోధకులు కొందరు హైదరాబాద్‌ని రెండో రాజధాని చేయాలని నినదించే అవకాశమున్నది. అయితే తెలంగాణవాదులు దీని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి. ఈ డిమాండ్‌ని తిప్పికొట్టాలి. హైదరాబాద్ రెండో రాజధాని నిర్ణయానికి తలవంచితే అది తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమే!.

70 ఏండ్ల కింద అంబేడ్కర్ ఈ ప్రతిపాదన చేసిన తర్వాత సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌ని రెండో రాజధానిగా చేసినట్లయితే దక్షిణాది వారికి దగ్గరగా ఉంటుందనేది ఒక అంశం. అట్లాగే హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఇప్పటికే ఢిల్లీ కన్నా మెరుగైన రెడీమేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మీదు మిక్కిలి చవకగా కూడా దొరుకుతున్నాయి. ఒక్క పార్లమెంటు కట్టుకుంటే సరిపోతుంది. అని అంబేడ్కర్ ఆనాడు అభిప్రాయపడ్డారు. ఫ్లయిట్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత దూరం అనేది పెద్ద సమస్య కాదు. అట్లాగే అటు చండీఘడ్ నుంచి ఇటు కలకత్తా వరకు హైదరాబాద్ దూరమే అవుతుంది. ప్రధానమైన విషయమేమిటంటే అంబేడ్కర్ ఈ ప్రతిపాదన చేసిన 1955లో హైదరాబాద్‌లో నిజంగానే కొన్ని లక్షల ఎకరాల ‘సర్ఫేఖాస్’ భూములు హైదరాబాద్ పరిపాలనా విభాగానికి అందుబాటులో ఉండేవి. బొల్లారం ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగు భూమి కొనాలన్నా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. అట్లాగే బొల్లారం స్థలం మిలిటరీకే సరిపోవడం లేదు.

బొల్లారం మిలిటరీ స్థలంలో జాతీయ రహదారి నిర్మించేందుకు జాగా కేటాయించాలని డిమాండ్ చేస్తే దానికి వందల కొర్రీలు వేసి కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ మిలిటరీ అడ్డుకుంటున్నది. అట్లాంటి సమయంలో రాజధానికి అవసరమైన ఖాళీ జాగా దొరికే పరిస్థితి లేదు. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య రాజధానిగా ఢిల్లీకి పేరున్నది. ఆ కాలుష్య కాసారాన్ని ఇప్పటికే సతమతమైతున్న హైదరాబాద్‌పై రుద్దుతామంటే కష్టమే! ఎందుకంటే హైదరాబాద్ రెండో రాజధాని అయినట్లయితే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. పెరిగిన వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు వేయడానికి వీలు లేకపోవడంతో కాలుష్యం పెరిగి పోతుంది. ఇక్కడ హైదరాబాద్ దేశ రెండో రాజధాని అంశంపై అంబేడ్కర్ ఏమన్నాడో చూద్దాం.

The Government may remain in Delhi during winter months and during other months it can stay in Hyderabad. Hyderabad has all the amenities which Delhi has and it is a far better City than Delhi. It has all the grandeur which Delhi has. Buildings are going cheap and they are really beautiful buildings, far superior to those in Delhi. They are all on sale. The only thing that is wanting is a Parliament House which the Govern ment of India can easily build. It is a place in which Parliament can sit all the year round and work, which it cannot do in Delhi. I do not see what objection there can be in making Hyderabad a second capital of India. It should be done right now while we are reorganising the States. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో దీని గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇది ఆచరణకు నోచుకునేది కష్టమనే భావనతోనే ఆనాడు ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరమీదికి తీసుకురావడమంటే కుట్రకోణం దాగి ఉన్నదనేది గుర్తించాలి.

1955లో “థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో దేశానికి రెండో రాజధాని అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు హైదరాబాద్, సికింద్రాబాద్, బొల్లారం మూడింటిని కలిపి చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అంటే దాని ఉద్దేశం కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. ప్రస్తుతం ఢిల్లీ రాజధానిగా ఉంది. దానికి రాష్ర్ట స్థాయి హోదా కూడా ఉన్నది. అయితే అక్కడి పోలీస్ కానీ, భూ లావాదేవీలన్నీ లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయమే చూస్తుంది. కానిస్టేబుల్‌ని బదిలీ చేయాలన్నా లెఫ్టినెంట్ జనరలే చేయాల్సి ఉంటుంది. అంటే అధికారాలు, ఆస్తులు అన్నీ కేంద్రానికి కట్టబెట్టి తెలంగాణకు ఏమి కావాలన్నా అడుక్కోవాల్సి ఉంటుంది.

నిజానికి తెలంగాణ ఉద్యమమే స్వయం పాలన కోసం సాగింది. నిజానికి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్.ఆ గుండెకాయను కోసి కేంద్రం చేతిలో పెట్టడమంటే మన ప్రాణాలను మనమే తర్పణం చేయడం. ఇప్పటికే తెలంగాణ నుంచి వచ్చే నిధులను జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వం 2026లో జరగబోయే పార్లమెంటు నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసేలా ముందుకు వెళుతుంది. తాము దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బిజెపి హైదరాబాద్‌ని ఒక పావుగా వాడుకునే ప్రమాదమున్నది. అదే జరిగి హైదరాబాద్ దేశ రెండో రాజధాని అయినట్లయితే కొత్తగా తెలంగాణకు వచ్చే కొలువులేమీ ఉండవు కానీ ఉన్న స్వయంపాలనాధికారం కోల్పోవాల్సి ఉంటుం ది. 70 కిందటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు హస్తిమశకాంతరం తేడా ఉందని గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News