Tuesday, April 30, 2024

రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి మరొక 400మిలియన్ డాలర్లు జోడిస్తూ మొత్తం 550 మిలియన్ డాలర్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహాన్ని గురించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్‌కాన్ సంస్థ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ రూ.1,656 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. ఇలానే ఉంటే మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ నిర్మాణ పనులకు మే 15న కెటిఆర్ భూమి పూజ చేసిన సంగతి విదితమే. ఈ ఏడాది మార్చి3న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫాక్స్‌కాన్ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమయింది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి. ‘ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉంటుంది. ఇరువురు పరస్పర కట్టుబాట్లను అందజేస్తూ ఉంటాం. గతంలో ఉన్న 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలోకి ఫాక్స్‌కాన్ సంస్థ అడుగుపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్‌కాన్ సంస్థ సిద్ధంగా ఉంద’ని మంత్రి కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు.

Foxconn

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News