బెంగళూరు: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఈసారి భారత్, శ్రీలంక వేదికగా జరుగుతోంది. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు భారత్, కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ మహిళ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీథర్ నైట్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్ అయ్యింది.
దీంతో చాలాసేపు నొప్పితో బాధపడింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్‌ఛైర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఆమె గాయం తీవ్రత ఎలా ఉందనే విషయంలో స్పష్టత లేదు. స్కానింగ్ కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో అరుంధతి గాయం తీవ్రంగా ఉంటే.. ఆమె ప్రపంచకప్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. అదే జరిగితే బిసిసిఐ ఆమెకు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుంది. 27 ఏళ్ల అరుంధతి (Arundhati Reddy) భారత్‌లో కీలక బౌలర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఆమె ఆరు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసింది. ఒకవేళ అరుంధతి గాయంతో ఆడలేకపోతే.. ప్రపంచకప్‌లో ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్, శ్రీలంకతో తలపడనుంది.
Also Read :మళ్లీ కెప్టెన్‌గా శ్రేయస్.. ఈసారి ఏం చేస్తాడో..