Sunday, May 12, 2024

సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐఎఎస్‌లు సహా ఇతర అధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటలకే కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాంత భధ్రతలు మినహా మిగతా అన్ని సర్వీసులపై ఢిల్లీలోని ఎన్నికైన ప్రజాప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన కొద్ది గంటలకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చర్యలు ప్రారంభించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే అధికారుల భరతం పడతామని హెచ్చరించిన ఆయన ఢిల్లీ ప్రభుత్వ సేవల కార్యదర్శి అశీష్ మోరేను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఢిల్లీ జల్ బోర్డు మాజీ సిఇఓ ఎకె సింగ్‌ను నియమించారు. అయితే మోరే బదిలీని కేంద్రం అమలు చేయడం లేదంటూ కేజ్రీవాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి శుక్రవారం చీఫ్‌జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ ముందుఈ విషయాన్ని ప్రస్తావించారు.‘ మేం ఎవరినీ బదిలీ చేయమని వారు (కేంద్రం) చెబుతున్నారు. నిన్న ఇచ్చిన తీర్పు ప్రకారం నేను కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయవచ్చు. కానీ దానికి సమయం పడుతుంది. అందువల్ల దయచేసి మీరు ఈ విషయంలో జోక్యంచేసుకోవాలని కోరుతున్నా’ అని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.వచ్చేవారం దీనిపై వాదనలు వినడానికి ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. దీనికోసం ఒక బెంచ్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆప్ ప్రభుత్వం ఆశీష్ మోరేను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎకె సింగ్‌ను నియమించింది. పరిపాలనా పరంగా రానున్న రోజుల్లో బారీ మార్పులు ఉంటాయని, ఇప్పటివరకు చేసిన పనుల ఆధారంగా చాలా మంది అధికారులను బదిలీ చేస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రజావసరాలకు అడ్డు తగిలే అధికారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News