Friday, May 3, 2024

ఆసియా కప్‌కు లైన్ క్లియర్.. ఆగస్టు 31నుంచి మెగా టోర్నీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉప ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ టోర్నమెంట్‌గా పేరున్న ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించి నెలకొన్న అనిశ్చిత స్థితికి తెరపడింది. ఎట్టకేలకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ ఆసియా కప్ జరుగనుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లోని వేదికల్లో ఈ టోర్నీ జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్న ఆసియా కప్‌కు పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 18 రోజుల పాటు జరిగే టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉండగా మరో గ్రూప్‌లో శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయి.

ఆసియాకప్‌లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఇదిలావుంటే 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌కు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కాగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ శ్రీలంకలో జరుగనుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో టాప్2లో నిలిచే రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్ సెప్టెంబబర్ 17న జరుగనుంది. ఇదిలావుంటే సూపర్4 మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఈసారి పాకిస్థాన్ గడ్డపై ఆసియాకప్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే టీమిండియా అక్కడ పర్యటించేందుకు నిరాకరించింది. దీంతో ఆసియాకప్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. అయితే ఐసిసి జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించింది. దీంతో ఆసియాకప్ నిర్వహణకు అడ్డంకులు తొలగి పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News